Read more!

ప్రస్థానత్రయంలో గీతనే గొప్పది ఎందుకంటే!

 

ప్రస్థానత్రయంలో గీతనే గొప్పది ఎందుకంటే!

అధ్యాత్మ వాఙ్మయములో మూఢనమ్మకాలు వదిలేసి ఆ పరమాత్మ వైపుకు సాగే వారిని ముముక్షువులు అని పేర్కొన్నారు. ముముక్షువులకు ప్రస్థానత్రయము ఎంతో ముఖ్యమైనది, అవసరమైనది కూడా. ప్రస్థానత్రయము యొక్క పరిచయము లేకపోతే పరమాత్మ యొక్క తత్వం ఏమిటనేది సరిగ్గా అర్థం కాదు.

అసలు ప్రస్థానత్రయం అంటే ఏమిటి అనే సందేహం చాలామందికి ఉంటుంది.  దశోపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ఈ మూడింటిని కలిపి ప్రస్తానత్రయం అని పేర్కొంటారు.  ఈ ప్రస్థానత్రయంలో గీత అనేక ధర్మసూక్ష్మములతో నిండి నిబిడీకృతమై ఉంది. అందుకే గీత ప్రస్థానత్రయములో చోటును సంపాదించుకోగలిగింది. ప్రస్థాన త్రయంలో ఉన్న మూడు అయిన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములలో నిండి ఉండే జ్ఞానము, సారము అంతా భగవద్గీతలో నిండి ఉంటుంది. అంతే కాకుండా బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తుల కంటే భగవద్గీత సరళంగా అర్ధమయ్యే భాషలోకి వచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండటం వల్ల భగవద్గీత మిగిలిన రెండింటి కంటే ఎక్కువగా ప్రజలలోకి వెళ్లగలిగింది.   

అంతేకాకుండా భగవద్గీత విషయంలో ఉన్న ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే  “నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను, గీత నాకు చక్కని మందిరము, గీతాజ్ఞానమున అవలంబించే  మూడులోకములను నేను పాలించుచున్నాను" అని గీతా మాహాత్మ్యములో విష్ణువు పలికిన వాక్యములు గీతయొక్క మహోన్నత స్థితిని, ప్రాధాన్యమును చెప్పకనే చెబుతున్నాయి. ఇంకా గీతను ఆశ్రయించి భగవంతుడు త్రిలోకములను, బ్రహ్మాండమునంతటిని పాలింపగల్గుచున్నాడంటే అలాంటి ఆశ్రయం వల్ల మనిషి ఒక చిన్న ఇంటిని సక్రమంగా నడపలేడా??  తన కుటుంబమును చక్కగా ఏర్పాటు చేసుకుని దానిని అభివృద్ధి చేసుకోలేడా?? తన జీవితాన్ని గురించి ఆందోళన నుండి బయటకు వచ్చి తనేమిటి అనే విషయాన్ని తనకు తాను తెలుసుకోలేడా?? తప్పక చేసుకోగలడు కదా. 

"భూభుజో జనకాదయః" అనునట్లు జనకాది మహారాజులు కూడా అలాగే పాలించగలిగారు. గీతను అనుసరించి వారందరూ తమ తమ సంసారాలను, తమ తమ జీవితాలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నడుపుకోగలిగారు. వారందరూ ధర్మాన్ని ఆశ్రయించే జీవించారు. కాబట్టి ఈ సంసారం జీవితంలో ఉండే సమస్యలు, బంధాల మధ్య వ్యామోహాలు, ప్రేమలు, కట్టిపడేసే కంచెల్లాంటివన్ని తొలగిపోయి, దుఃఖాలు, బాధలు మొదలైనవి తొలగిపోయి ప్రశాంతమైన జీవితం కావాలంటే తప్పనిసరిగా భగవద్గీత సహాయం తీసుకోవాలి. 


"గీతా రక్షతి రక్షితా" ఎవరు గీతను రక్షిస్తారో వారిని గీత కూడా రక్షిస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న సారం అలాంటిది. భగవద్గీతను వినేవారు, దాన్ని మరొకరికి చెప్పేవారు, దానివల్ల సమాజంలో మార్పు తీసుకొచ్చేవారు ఉంటే  ఖచ్చితంగా భగవద్గీత మనుషుల జీవితాలకు గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. గీత రక్షించడం ఏంటి అనే సందేహం వస్తే భగవద్గీతను ఆధరించేవారు, భగవద్గీతను అనుసరించి జీవించేవారికి వారి జీవితంలో ఎన్నో సమస్యలకు, కష్టాలకు, బాధలకు పరిష్కారంగా భగవద్గీత నిలుస్తుంది. దాన్నే భగవద్గీత తిరిగి మనల్ని కాపాడుతుంది అని చెప్పారు. కాబట్టే భయంకరమైన ఈ సంసార బంధాలు, వ్యామోహాలు, మనుషులతో ఉన్న దుర్గుణాలు, అన్ని జీవితాంతం ఉండవని. అవన్నీ మనిషి తనకు తాను మోయడం వల్ల కలుగుతున్న దుఃఖాలు అని ఎంతో సూక్ష్మంగా తెలిపి మనిషిని కొట్టుకుపోతున్న ప్రవాహం నుండి బయటకు లాగినట్టు భగవద్గీత మనిషిని మోక్షమార్గం వైపుకు లాగుతుంది. 

అంటే సముద్రమనే సంసారంలో కల్లోలం లేకుండా ప్రయాణించాలంటే భగవద్గీత అనే నౌకను తప్పనిసరిగా ఆశ్రయించాలి. లేకపోతే మనిషి బాధపడుతూ తుదకు మరణిస్తాడు.


◆నిశ్శబ్ద.