Read more!

భగవంతుడిని నమ్మని వారికి ఓ అర్థమవంతమైన కథ!

 

భగవంతుడిని నమ్మని వారికి ఓ అర్థమవంతమైన కథ!

భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒకవిధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్నవయసు వారు దేవుడిని నమ్మడం అంటే తప్పుచేసినట్టు, అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటివారికి ఒక మంచి అర్థమవంతమైన కథ ఇది. 

అనగనగా ఓ ఊరికి ఓ సాధువు వచ్చాడు. ఆయన చేతిలో కర్ర తప్ప మరేమీ ఉండదు. "నాకు ఎటువంటి బంధనాలూ లేవు. నాదంటూ ఏమీ లేదు. నా వెంట ఏమీ తీసుకువెళ్లను. నాకు కావలసిందంతా భగవంతుడే సమకూరుస్తాడు" అంటూ ఎవరేమిచ్చినా తిరస్కరిస్తుండేవాడు. ఆ ఊరు వదిలి వెళ్తూంటే ఊరివాళ్ళు కొందరు ఆయన దగ్గరకు వచ్చారు.

"స్వామీ మీరు ఊరు వదిలి వెళుతున్నారు. అడవి దాటి ప్రయాణించాలి. అడవిలో ప్రయాణించేటప్పుడు దారిలో ఏమీ దొరకదు కాబట్టి కొంచెం ఆహారం మూట కట్టిస్తాము తీసుకెళ్లండి" అని అన్నారు.

"నేను తీసుకోనని తెలుసు కదా!! ఆ భగవంతుడు నాకు ఎప్పుడు ఏమివ్వాలో అది తప్పక ఇస్తాడు. కాబట్టి నేను తీసుకోను. నేను వెళతాను" అని చెప్పి ప్రయాణమయ్యాడు ఆ సాధువు. 

ఇదంతా చూస్తున్న ఓ యువకుడికి ఆ సాధువును పరీక్షించాలని అనిపించింది. "ఏమీ దొరకని అడవిలో భగవంతుడు ఈ సాధువుకి తిండిని ఎలా అందిస్తాడు. ఇతను దేవుడి గురించి అంత నమ్మకంతో ఉన్నా ఆ అడవిలో ఇతనికి తిండి దొరకడం అసాధ్యం. అందుకే ఇతనితో నేనూ వెళ్లి ఇతనికి ఆహారం ఎలా సమకూరుతుందో చూస్తాను" అనుకున్నాడు.

ఆ సాధువు దగ్గరకు వెళ్లి "మీరు అడవి దాటే వరకు మీకు తోడుగా నేను మీవెంట వస్తాను" అని అడిగాడు.

"నాకు తోడు ఎందుకు?? ఆ భగవంతుడే నాకు తోడు ఉంటాడు. నువ్వేమి అవసరం లేదు" అని అన్నాడు సాధువు.

"అలా అనకండి నేను మీ వెంట వస్తాను. మీతో కలసి అడవి దాటే వరకు ప్రయాణం చేయాలని ఉంది" అని పదే పదే మొండిగా పట్టుబట్టాడు.

 ఆ సాధువు ముందు ఒప్పుకోలేదు. కానీ చివరికి 'సరే రా' అన్నాడు. అడవిలో ఇద్దరూ నడవటం ప్రారంభించారు. కాలం గడుస్తోంది. ఆ యువకుడికి ఆకలి వేస్తోంది. సాధువు నడుస్తూనే ఉన్నాడు. తిండి మాట ఎత్తటం లేదు. చివరికి ఆ యువకుడే తిండి ప్రసక్తి తెచ్చాడు. 

"ఇక్కడేమీ దొరికేట్టు లేదు. ఇప్పుడెలా?" అన్నాడు. 

దానికి సాధువు నవ్వి "భగవంతుడి ఇచ్ఛ" అన్నాడు.

 కాసేపటికి యువకుడు భరించలేకపోయాడు. "ఏదీ నీ భగవంతుడు తిండి ఇవ్వటం లేదేం?" అని నిలదీశాడు. 

"ఇస్తే తింటాం. లేకపోతే దొరికినప్పుడు తింటాం" అంటూ ఆ సాధువు నిర్వికారంగా నడవసాగాడు. 

ఇక ఉండబట్టలేక "నీ దేవుడు నీకేమీ ఇవ్వడు. వాడిని నమ్ముకుని లాభం లేదని నాకు తెలుసు. అందుకే నేను నావెంట రొట్టెలు తెచ్చాను" అంటూ రహస్యంగా తెచ్చిన రొట్టెల మూట బయటికి తీశాడు.

 ఇద్దరూ తిన్న తరువాత "ఇపుడైనా ఒప్పుకో, అన్నీ భగవంతుడు సమకూర్చటం అబద్ధం అని" అంటూ నిలదీశాడా యువకుడు. 


దానికి సమాధానంగా ఆ సాధువు నవ్వి "అవును ఇప్పటికైనా ఒప్పుకో నువ్వు నా వెంట రావటం, రొట్టెలు ఇవ్వటం, నీ ద్వారానే నా ఆకలి తీరడం ఇదంతా భగవంతుడు ఇచ్చిందేనని ఒప్పుక ో"అన్నాడు సాధువు.

భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ నష్టపోడు అని ఇందుకే అంటారు పెద్దలు.

                                           ◆నిశ్శబ్ద.