Read more!

భూలోకాన్ని దేవలోకం అంటారెందుకు?

 

భూలోకాన్ని దేవలోకం అంటారెందుకు?

మనం మనుషులం. మనం ఉండేది భూలోకం. మనుషులు భూలోకంలో ఉంటారు. భూలోకం ఆవల భువర్లోకం. ఆపైన సువర్లోకం. అది దేవలోకం - దేవతలు ఉండేలోకం. మనవి భౌతిక శరీరాలు. భువర్లోక జీవులవి సూక్ష్మశరీరాలు. దేవలోకవాసులవి దివ్యశరీరాలు. అంటే ఈ లోకాల క్రమం మారేకొద్ది భౌతిక శరీరాలు కాస్తా సూక్ష్మశరీరాలు అవుతాయి. తరువాత లోకంలో దివ్యత్వాన్ని సంతరించుకుని దివ్య శరీరాలు అవుతాయి.

మనిషికి తన పూర్వజన్మ వాసన ఉంటుందో లేదో తెలియదు కానీ, స్వర్గసుఖాలపైన మమకారం ఉంటుంది. 

ఎందుకుంటుంది? 

ఎవరూ స్వర్గం చూసింది లేదు. కథల్లోనూ, సినిమాలలోనూ, పురాణాల లోనూ ఇదిగో స్వర్గం అంటే  ఇలా ఉంటుంది అని అందంగా వర్ణించడం, మంచివారు మాత్రమే ఆ స్వర్గానికి అర్హులని చెప్పడం వలనా మనుషులకు స్వర్గమంటే అదొక వ్యామోహం ఉంటుంది. అయితే మనుషులు ముందు స్వర్గంలో ఉన్నవారే. మానవజన్మపై మమకారం వదలక మరల మరల మానవజన్మకు వస్తుంటారు. స్వర్గ సుఖాలు మన పూర్వ స్మృతులు. మన ఇంద్రియాలకు తెలియకపోయినా, అంతరాత్మకు తెలుసు ఆ దేవరహస్యం. మన సూక్ష్మ శరీరాలకు తెలుసు స్వర్గసుఖాలు ఎలాంటివో, ఏమిటో? ఎన్నడో అనుభవించిన స్వర్గసుఖాలు మళ్లీ పొందాలనుకోవడం మనిషి నైజం. అందుకే 'స్వర్గం, నరకం' అని కలవరిస్తుంటారు. అయితే మనుషులు ఈ భౌతిక దేహంతో చేస్తున్న పాపపు పనులవల్ల ఎన్నో స్మృతులను మెల్లిగా కోల్పోతూ ఇక్కడ చేస్తున్న పాపపు పనులనే తన స్మృతుల ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు. 

ఆ తరువాత ఇంకాస్త పైకిపోతే తపోలోకాలు ఉంటాయి. అక్కడ ఉండేది జనన మరణాలకు అతీతులైన మహాత్ములు. అది తాపసులకు, మహాయోగులకు, పుణ్య పురుషులకు శాశ్వత నివాసం. ఆధ్యాత్మికంగా అవసరం ఏర్పడినప్పుడు ఆ తపోలోకాల నుండి ఒకరిద్దరు మహాత్ములు, భూలోకంలో జన్మిస్తుంటారు. మనుషులలో, అర్హతగల వారిలో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించడం ఆ మహాత్ముల పని. అలా అవతరించిన మహాత్ములు ఎందరో ఉన్నారు. వారు ఎందరికో ఆధ్యాత్మిక బోధ చేసి, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారు. 

భౌతిక శరీరాలకు వాసనలు ఉన్నా, లేకపోయినా, తమవి దివ్యశరీరాలైనా, అవి మానవ రూపాలకు ప్రతిరూపాలేనని వారికి తెలుసు. అందుచేతనే దేవలోక వాసులకు మానవలోకం పైన మక్కువ ఎక్కువ. ఇక్కడ మనుషులు భౌతిక శరీరాలతో 'తెగ' సుఖపడిపోతున్నారని అసూయపడుతుంటారు. అక్కడి స్వర్గసుఖాలు 'తనివి' తీరా అనుభవిస్తున్నారని మనుషులు 'తెగ' బెంగపడి పోతుంటారు. వారి సుఖాలు వీరికి కావాలి. వీరి శరీరాలు వారికి కావాలి. 

మనుషులకు, దేవలోక వాసులకు మధ్య సంబంధం విచిత్రంగా ఉంటుంది. వద్దన్నా వెంటపడే స్వభావం దేవుళ్లది. ఏ వరాలూ వర్షించకపోయినా దేవుళ్ల వెంటపడే నైజం మనుషులది. స్వర్గలోకంలోని దేవుళ్లందరికీ భూలోకంలో ఇళ్లున్నాయి. అవే గుళ్లు. అక్కడ వైకుంఠం, కైలాసం, స్వర్గం, ఇంద్రసభ, నందనవనాల డూప్లికేట్లు ఇక్కడ భూలోకంలో వెలిశాయి. అప్సరసలు, దేవతాస్త్రీలు, భోగాలు చెప్పనవసరం లేదు. భూలోకంలో అన్నీ సెకండ్ సెటప్లు. అవి చూచి, వాటిని అనుభవిస్తూ, స్వర్గసుఖాలు చవిచూస్తుంటారు. మనుషులు. కైలాసం నుండి కన్యాకుమారి వరకు మన దేశం మొత్తాన్ని దేవుళ్లు ఆక్రమించుకున్నారంటే అతిశయోక్తి కాదేమో! అందుకే మనది దేవభూమి. కొండలపైన, అడవుల్లో, నదీ తీరాలలో దేవాలయాలు ఏర్పడడానికి అదే కారణం.

                                                  ◆నిశ్శబ్ద.