Read more!

భౌతికవాదానికి-ఆధ్యాత్మికతకు మధ్య తేడా?

 

భౌతికవాదానికి-ఆధ్యాత్మికతకు మధ్య తేడా?

'కనబడేదే ప్రపంచం, కనబడనిది లేనేలేదు' అన్న నమ్మకం వల్ల పాశ్చాత్యులు ‘మనస్సు’ కు ప్రాధాన్యం ఇవ్వలేదు. అందుకే వారి విజయాలలో 'మనస్సు' నిర్దిష్టస్థానాన్ని పొందలేదు. తన పాపాల పరిహారానికి భౌతికంగా తనని తాను శిక్షించుకున్నవాడు గొప్ప ఆదర్శమూర్తి అయ్యాడు. వెయ్యేనుగుల బలం కలవాడు ఆరాధ్యదైవం అయ్యాడు. వాడికి బుర్ర ఉందా? లేదా? అన్న విషయం ఎవరికీ పట్టలేదు. అలాగే అందరి కన్నా వేగంగా పరుగెత్తగలవాడు, దూరం దూకగలవాడు, ఎత్తులు ఎక్కగలవాడు, డబ్బులు సంపాదించగలవాడు….. ఇలా తాత్కాలికంగా ఇతరులు కన్నా ఓ మెట్టు పైనున్న ప్రతివాడూ ఆదర్శం అయ్యాడు. కానీ విజయాలు అన్నీ అశాశ్వతం అని పాశ్చాత్యులకు తెలుసు. అందుకే వారు 'రికార్డు' లు రాయటం ప్రారంభించారు. 

ఒకడు వంద మీటర్లు పదిహేను సెకన్లలో పరుగెత్తి ఆదర్శమై పూజలు అందుకుంటాడు. కానీ మరో రోజున ఇంకొకడు అదే దూరం పద్నాలుగు సెకన్లలో పరుగెత్తి 'కొత్త దేవుడు'గా ఎదిగేవాడు. ఒక శాస్త్రవేత్త ఓ గొప్ప నిజం కనుక్కొని 'పూజ' లు అందుకునేలోగా, మరో శాస్త్రవేత్త అతనికన్నా గొప్ప నిజం కనుక్కుని మరిన్ని పూజలు అందుకునేవాడు. ఇలా పాశ్చాత్యుల దృష్టిలో 'విజయం' అన్నదాని అర్థం స్థిరపడింది. పది మందినీ ఆకర్షించగలిగేవాడు, లేక మరో పదిమందిని తన్నేవాడు, అందరినీ మోసం చేసి డబ్బు సంపాదించేవాడు. ఇలా వారి దృష్టిలో అశాశ్వత విజయాలే అసలైన విజయాలుగా స్థిరపడ్డాయి. ప్రపంచంపై మానసికంగా, భౌతికంగా పాశ్చాత్యులు అధికారం సాధించగలగటంతో, ప్రపంచమంతా  పాశ్చాత్యుల విజయమే నిజమైన విజయం అన్న అభిప్రాయం వేళ్లూనుకోసాగింది. మన దేశంలో కూడా ఇదే జరిగింది.

భారతీయుల దృష్టిలో కంటికి కనబడే భౌతికప్రపంచానికి ఎంత ప్రాముఖ్యం ఉందో, కంటికి కనబడని మానసిక - ఆధ్యాత్మికప్రపంచానికి కూడా అంత ప్రాధాన్యం ఉంది. తెరిచిన కళ్ళ ముందున్న విశాలవిశ్వం ఎంత నిజమో, మూసిన కళ్ళ వెనక దాగిన మహాద్భుతమైన మరో ప్రపంచం కూడా అంతే సత్యం. అంటే భారతీయుల దృష్టిలో మనిషి జీవితంలో ప్రతి వ్యక్తీ రెండు విభిన్న సంఘర్షణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి భౌతికం, మరొకటి ఆధ్యాత్మికం. వీటిలో భౌతికపరమైన శక్తులపై విజయం ఒక దశ వరకే సాధ్యమని భారతీయులు గ్రహించారు. ఎందుకంటే మనిషి శరీరం కొన్ని భౌతిక పరిమితులకు లోబడి ఉంటుంది.

 కన్ను కొంత దూరం వరకే చూడగలదు. చెవి కొన్ని శబ్దాలే వినగలదు. శరీరం అనుభవించే స్పర్శకూ పరిమితులున్నాయి. కానీ పరిమితులు లేనిది మనస్సుకే. అవధులు, అడ్డూ అదుపూ లేనిది మనస్సే. మనస్సు కూడా మనిషి అనుభవాల పరిధిలో ఒదిగే అవకాశం ఉన్నా, ప్రయత్నిస్తే, మనిషి ఈ భౌతికానుభవాల పరిమితులను మించి, మనోవిహంగానికి అనంతమైన రెక్కలనిచ్చి అనంత ఆకాశవీథిలో అప్రతిహతంగా విహరింపచేయగలడు. ఇది గ్రహించిన భారతీయ తత్త్వవేత్తలు తమ దృష్టిని మనోవిహంగానికి ప్రేరణనివ్వటంపై కేంద్రీకరించారు. వారి భౌతికత కూడా ఈ మనస్సుకు రెక్కలనిచ్చేందుకు అవసరమైన అంశాల పైనే కేంద్రీకృతమైంది. 

భౌతికపరికరాలతో భౌతిక ఇంద్రియాల శక్తిని పెంచాలని పాశ్చాత్యులు తపన పడుతూంటే, భౌతికాంశాలను మించి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించాలని భారతీయులు ఆరాటపడ్డారు. అందుకే పాశ్చాత్యుల అభివృద్ధి యాంత్రిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంది. భారతీయప్రగతి మానసిక వికాసంపై నిలిచి ఉంది. భౌతికంగా ఎన్ని విజయాలు సాధించినా అవి అశాశ్వతమే. కానీ మానసికవిజయం శాశ్వతం. ఇదీ భారతీయుల 'విజయా'నికీ, పాశ్చాత్యుల విజయానికీ నడుమ ఉన్న అంతరం. ఇది భౌతికవాదానికీ, ఆధ్యాత్మికానికీ నడుమ ఉన్న తేడా.

                                       ◆నిశ్శబ్ద.