శ్రీకృష్ణుడికి 56 నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారు!

 

శ్రీకృష్ణుడికి 56 నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారు!

 

భారతదేశంలోని ప్రధానమైన  పండుగలలో జన్మాష్టమి ఒకటి. దీనిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా,  అంతే  భక్తితో జరుపుకుంటారు. ఇంటి నుండి దేవాలయాల వరకు గొప్పగా అలంకరణలు చేస్తారు. భజనలు,  కీర్తనలు ప్రతిధ్వనిస్తాయి.  ఖచ్చితంగా  రాత్రి 12 గంటలకు శ్రీ కృష్ణ జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడిని  స్వాగతించడానికి వివిధ ఆచారాలు నిర్వహిస్తారు.  వీటిలో ఆయన అలంకరణ, ఊయల ఊపడంతో పాటు   ప్రత్యేక భోగ్ సమర్పించడం ప్రముఖమైనది. శ్రీకృష్ణుడికి సమర్పించే నైవేద్యాలనే భోగ్ అని అంటారు.  ఈ నైవేద్యాలలో ఒకటి, రెండు కాదు.. ఏకంగా 56 పదార్థాలు ఉంటాయి.  అసలు ఇన్ని నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారు? దీని గురించి తెలుసుకుంటే..

జన్మాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుడికి 56 రకాల రుచికరమైన వంటకాలను నైవేద్యంగా పెడతారు. కానీ ఈ సంఖ్యను 56గా ఎందుకు నిర్ణయించారో  ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చాలా ఆసక్తికరమైన పౌరాణిక కథ దాగి ఉంది. ఇది భక్తి, ప్రేమ, ఆ శ్రీకృష్ణుడి అద్భుతాలకు సంబంధించిన విషయం.

పురాణ కథనం ఇదే..

పురాణ కథనం ప్రకారం బ్రజ్ ప్రజలు వర్షాలు బాగా పడటానికి,  సమృద్ధిగా పంటలు పొందడానికి ఇంద్రదేవుడిని  పూజించడానికి సిద్ధమవుతున్నారు. బాల శ్రీ కృష్ణుడు నందుడిని  అలా పూజించడానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి కారణం అడుగుతాడు.  ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడని,  అతని ఆరాధన ఆనందాన్ని,  శ్రేయస్సును తెస్తుందని చెప్పాడు. అప్పుడు  కృష్ణుడు అందరికీ గోవర్ధన పర్వతానికి పూజ చేయండి.. ఆ పర్వతం వల్లనే మనకు వర్షాలు కురుస్తాయి. అంతే తప్ప ఇంద్రుడి వల్ల కాదు అని చెప్పాడు. కృష్ణుడు చెప్పిన మాటలు  బ్రజ్ ప్రజలకు సబబుగానే అనిపించాయి. వారు ఇంద్రుడికి కాకుండా  గోవర్ధన గిరికి పూజ చేశారు.

బ్రజ్ ప్రజలు తనకు కాకుండా గోవర్థన గిరికి పూజ చేయడంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. బ్రజ్ ప్రాంతంలో భారీ వర్షం కురిపించాడు, దీని కారణంగా మొత్తం బ్రజ్‌లో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి ఏడు రోజులు పట్టుకున్నాడు. ఏడు రోజుల పాటు ఆ గోవర్థన గిరి కింద బ్రజ్ ప్రాంత ప్రజలు,  జంతువులు, ఆవులు,  సకల జీవరాశులు తలదాచుకున్నాయి. ఏడు రోజుల తర్వాత వర్షం ఆగిపోయినప్పుడు కృష్ణుడు  ఏడు రోజుల నుండి  ఏమీ తినలేదని అందరూ గుర్తించారు. యశోద కృష్ణుడికి  రోజుకు ఎనిమిది సార్లు ఆహారం ఇచ్చేది. కానీ ఏడు రోజుల నుండి కృష్ణుడు ఏమీ తినకుండా గోవర్దన గిరిని ఎత్తుకుని ఉండటంతో యశోదకు కృష్ణుడి మీద ప్రేమతో కూడిన భావోద్వేగం కలిగింది.  

తన ప్రియమైన కుమారుడు ఆకలితో ఉన్నప్పుడు ప్రేమ,  భావోద్వేగంతో ఏడు రోజులు కృష్ణుడు తినగలిగే ఆహారాన్ని సిద్దం చేసింది. అందులో  56 రకాల వంటకాలను తయారు చేసింది. అప్పటి నుండి, జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి 56 నైవేద్యాలు సమర్పించే సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు.

భోగ్ లో ఏ ఆహారం ఉంటుంది..

చప్పన్ భోగ్ లో వివిధ రకాల రుచికరమైన వంటకాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా స్వీట్లు, ఉప్పు స్నాక్స్, కాలానుగుణ పండ్లు, తృణధాన్యాలు, పానీయాలు,  పాల వంటకాలు ఉంటాయి. సాంప్రదాయకంగా, వెన్న, చక్కెర మిఠాయి, పెడ, లడ్డు, రబ్రీ, పూరి, కచోరి, హల్వా, కిచ్డి, తాజా పండ్లు,   పానీయాలు వంటి అనేక రుచికరమైన వంటకాలు ఇందులో అందించబడతాయి.  ఇందులో ఉండే ఆహారాలు అన్నీ   శ్రీ కృష్ణుడికి ఇష్టమైనవిగా భావిస్తారు.


                                 *రూపశ్రీ.