జన్మాష్టమి రోజు ఉపవాసం ఎవరు పాటించకూడదో తెలుసా..
జన్మాష్టమి రోజు ఉపవాసం ఎవరు పాటించకూడదో తెలుసా?
జన్మాష్టమి.. శ్రీకృష్ణుని జన్మదినం. జన్మాష్టమిని భారతీయులు పండుగలా జరుపుకుంటారు. హిందువులకు జన్మాష్టమి చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం జన్మాష్టమి 2025 ఆగస్టు 16న వస్తుంది. పవిత్రమైన జన్మాష్టమి రోజున కన్నయ్య పుట్టినరోజును ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో, కన్నయ్యను ప్రత్యేకంగా అలంకరించి, 56 పదార్థాలతో మహా నైవేద్యాన్ని అర్పించి, హారతి చేసి, భజనలు, కీర్తనలు చేస్తారు పాడతారు. అయితే ఈరోజున ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలామంది ఉపవాసం ఉండటం సహజమే.. అయితే ఈ రోజు ఎవరు ఉపవాసం ఉండకూడదు అనే విషయం తెలుసుకుంటే..
శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది. ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం తీసుకోరు. కాబట్టి ఈ ఉపవాసం కొంచెం కష్టంగా ఉంటుంది. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. కానీ ఈ ఉపవాసం అందరికీ తప్పనిసరి కాదు. నిజానికి కొన్ని పరిస్థితులలో ఈ ఉపవాసాన్ని దాటవేయవచ్చు. జన్మాష్టమి ఉపవాసాన్ని ఎవరు పాటించకూడదంటే..
గర్భవతులకు లేదా పాలిచ్చే తల్లులకు జన్మాష్టమి నాడు ఉపవాసం లేకుండానే పూజ చేసినా కూడా కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయి. ఎందుకంటే ఈ స్థితిలో ఎక్కువసేపు ఆకలితో ఉండటం తల్లిబిడ్డలకు హానికరం. కాబట్టి వీరికి మినహాయింపు ఉంటుంది.
అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు కూడా ఉపవాసం నుండి మినహాయింపుగా ఉంటారు. మధుమేహం, రక్తపోటు, కాలేయం, మూత్రపిండాలు, గుండె జబ్బులు లేదా జ్వరం మొదలైన వాటితో బాధపడుతున్న వ్యక్తులు కూడా జన్మాష్టమి ఉపవాసం పాటించకూడదు. దీనితో పాటు వృద్ధులకు కూడా ఉపవాసం నుండి మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇలా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం పాటించినా దాని ఫలితం రాదని పురాణ పండితులు అంటున్నారు. అందుకే అనారోగ్యం ఉన్నప్పుడు శరీరాన్ని కష్టపెట్టుకోకూడదు.
పైన చెప్పుకున్న వారు మాత్రమే కాకుండా.. చిన్న పిల్లలు కూడా ఉపవాసాలు పాటించకూడదు. రుతుక్రమంలో ఉన్న స్త్రీలు కూడా ఉపవాసాలు, పూజలు చేయకూడదు. కుటుంబంలో ఎవరైనా మరణించి మైల ఉంటే.. వారు కూడా జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండకూడదు. పూజ కూడా చేయకూడదు. ఎందుకంటే అలాంటి సమయంలో పండుగలు, పూజలు, దైవ సంబంధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
*రూపశ్రీ.