Read more!

ప్రపంచంలో గొప్ప గురువు ఎవరో తెలుసా?

 

ప్రపంచంలో గొప్ప గురువు ఎవరో తెలుసా?

ప్రపంచాన్నే గొప్ప ఆద్యాత్మిక మార్గంలో నడిపించగల విస్తృత గ్రంథం భగవద్ఘీత. ఈ భగవద్ఘీత ముందు ఎంత గొప్ప సైకాలజీ, ఫిలాసఫీ గ్రంథాలు అయినా బలాదూర్ అవుతాయి. గీతను కృష్ణుడు అర్జునుడికి భోదించాడన్నది మహాభారత సారాంశం. అయితే అర్జునుడికి బోధించే నెపంతో సర్వమానవాళికి గీతోపదేశం చేసాడు శ్రీకృష్ణుడు. ఎన్ని యుగాలు గడిచినా ఆ ఉపదేశంలో లేశమాత్రమైనా ప్రభావం కోల్పోలేదు. అవతార పురుషులు యుగ యుగాల్లో జన్మిస్తారు.. ఎందుకూ అంటే.. లోకోద్ధరణకై పాటుపడడం కోసం. ఈ విధంగా లోకోద్దరణకై పాటుపడటం కేవలం పరమాత్ములకే సాధ్యమవుతుంది. అలాంటి వారు ప్రతీ యుగంలో జన్మిస్తూ ఉంటారు. అలాంటి  యుగపురుషుడే శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే  ద్వాపరయుగంలో  శ్రీకృష్ణావతారమెత్తి ఆ యుగంలోనే గాక, రాబోవు కలియుగములో కూడ ధర్మచింతన, ఆధ్యాత్మికపధంలో నడిపించే ప్రయత్నం కోసమే తాను ఆ అవతారం ఎత్తానని తానే స్వయంగా ప్రకటించాడు. 

శ్రీకృష్ణావతారం గురించి చెప్పుకుంటే అది చాలా పరిణతి చెందిన అవతారం. అందుకే 'కృష్ణం వందే జగద్గురుం" అని సకల జనులు స్తుతిస్తుంచారు. భగవద్గీతలో  అర్జునుడు యుద్ధరంగం చేరుకున్న తరువాత నేను యుద్దం చేయనని వెనకడుగు వేయడమే ఈ భగవద్ఘీత ఆవిర్భవించడానికి మూలకారణం. కృష్ణుడు అర్జునుడికి చేసిన గీతాబోధ కాస్తా ప్రపంచానికి గొప్ప ఆద్యాత్మిక గ్రంథం అయింది. 

భగవద్ఘీతలో ఒక చోట శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు..

 పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం 

 ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥

అని. శ్రీకృష్ణుడే  స్వయంగా ఇలా చెప్పడంలోనే దానికి గల కారణాన్ని అంటే తాను  అవతరించడానికి  గల కారణాన్ని  స్పష్టం చేశాడు. శ్రీకృష్ణావతారం పరమ పురుషుని అవతారం.  కేవలం భగవద్ఘీత ఆధారంగా.. శ్రీకృష్ణుడు చేసిన బోధ ఆధారంగా ఈ విషయాన్ని ఆద్యాత్మికతగా, శ్రీకృష్ణున్ని పరమపురుషునిగా వర్ణించడం లేదు. భాగవతంలో శ్రీకృష్ణుని సకల జీవిత విషయాలు తెలిసిన వారికీ.. వాటిని అర్థం చేసుకున్నవారికి కృష్ణుడు  భగవంతుడు, పరమపురుషుడు, అన్నిటికీ మించి గొప్ప గురువు అనే విషయం అర్థమవుతుంది.  శ్రీకృష్ణుడు పసిపాప మొదలు తన అవతారాన్ని జగద్గురువుగా ప్రకటించే క్రమంలో ఎన్నో అద్భుతాలున్నాయి. అజ్ఞానాంధకారాన్ని తొలగించు ప్రయత్నములో జీవుల జీవన విధానాన్ని బోధించిన పరమగురువు శ్రీకృష్ణుడు. అందుకే ఈయన  జగద్గురువుగా పేరుపొందాడు. 

ఇక భగవద్ఘీత విషయంలో శ్రీకృష్ణుడు స్పష్టం చేసిన మరొక ముఖ్యవిషయం ఏమిటంటే.. సామాన్యులలో కూడా  ధర్మ జిజ్ఞాసను మేల్కొలపడం. భగవంతుడే వచ్చి ఈ సామాన్యులను తనవైపు మళ్ళించుకోవడం. ఇదే తన అవతార  లక్ష్యమని చెప్పాడు. భగవన్నామం ఎక్కడ కీర్తింపబడుతుందో అదే పుణ్యక్షేత్రం, పవిత్ర తీర్ధ స్థలం. ఆ భగవన్నామోపదేశంకానీ, తత్త్వజ్ఞానోపదేశం కాని అవతార పురుషులైన సద్గురువుల వల్లనే సాధ్యమవుతుంది. గురువు సహాయంతోనే భగవంతుడిని చేరే మార్గం లభిస్తుంది. ఆ మార్గములోనే అందరీ సరైన విధానంలో భగపంతుడి సాక్షాత్కారం లభిస్తుంది. అలాంటి సద్గురువులు లభించడం చాలా అరుదు. శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపుడుగా అవతరించినందుకే, తానే స్వయంగా "ఆచార్యం మాం విజానీయాత్ - నేనే గురువునని తెలుసుకో" అని అంటారు భాగవతంలో అందులకే గురువుకీ, భగవంతుడికీ తేడా లేదు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడిని తమ గురువుగా భావిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్గం సాధ్యమవుతుంది.

                                   ◆నిశ్శబ్ద.