Read more!

నిషిద్ధ గురువు అని ఎవరు పిలవబడతారు??

 

నిషిద్ధ గురువు అని ఎవరు పిలవబడతారు??


శిష్యుడికి ఆధ్యాత్మిక సాధనను, బోధనను ఉపదేశించేవాడు గురువు. ఈ గురువు శిష్యులకు మంత్రాలు ఉపదేశిస్తాడు. ఒకే అక్షరాన్ని, పదాన్ని లేక మాటని పదేపదే ఉచ్చరించటం వల్ల కొంత శక్తి పుడుతుంది. ఈ రకంగా పుట్టిన శక్తి వల్ల ఏ పని చెయ్యాలి? అనేది సాధకుడి యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఆ శక్తివల్ల తనకు కావలసిన ఐహిక వాంఛలు తీర్చుకోవచ్చు. అంటే ధనదాన్యాలు, భోగభాగ్యాలు, సిరిసంపదలు పొందవచ్చు. పుణ్యలోకాలు పొందవచ్చు. మోక్షమార్గం వైపు పయనించవచ్చు. ఆ శక్తిని లోకకళ్యాణానికి వినియోగించవచ్చు. ఇతరుల బాధలు తీర్చవచ్చు లేదా ఇతరులను వశం చేసుకోవటానికి వాడవచ్చు. ఇతరులు నాశనానికి కూడా ఈ శక్తిని ఉపయోగించవచ్చు. అయితే జపం చేసేటప్పుడు చెప్పే సంకల్పంలోను, సాధన విధానంలోను, క్రియలోను కొంత తేడా ఉంటుంది. 


మనదగ్గర ఉన్న శక్తిని లోకకళ్యాణం కోసం ఉపయోగించేవాడు ఉత్తముడు. ఇతరుల కోసం ఉపయోగించేవాడు మధ్యముడు. తన కోసం ఉపయోగించేవాడు అంటే తాను ఐహిక సుఖాలు పొందటానికి ఉపయోగించేవాడు అధముడు. ఆ శక్తితో ఇతరులకు హాని కలిగించేవాడు అధమాధముడు, ఆ శక్తితో మారణాది ప్రక్రియలు చేసేవాడి నీచత్వాన్ని చెప్పటానికి అసలు పదాలే లేవు. ఈ రకంగా వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేవాడు నిషిద్ధ గురువు.


అసలు వశీకరణాది విద్యలవల్ల మనకు జరిగేది ఏమిటి? ఈ రోజుల్లో కొన్ని పుస్తకాలలో మనం చూస్తుంటాం. ఒక మంత్రం చెప్పి, ఈ మంత్రాన్ని లక్షసార్లు జపం చేసి, ఆఖరిరోజున నువ్వు కోరిన స్త్రీ ఇంటి ఎదురుగా దీపం పెట్టినట్లైతే, ఆ రోజు నుంచి ఇరవై ఒక్కరోజుల లోపల, ఆ స్త్రీ నీకు వశమవుతుందని వ్రాయబడి ఉంటుంది. ఇలాంటి వాటిని చూసి ముఖ్యంగా యవ్వనంలో ఉన్న పిల్లలు ఆకర్షితులవుతుంటారు. వీటివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. శ్రమ వృధా తప్ప.


 వేరే ప్రక్రియల ద్వారా ఇటువంటి పనులు చేసి స్వార్ధంతో ఇతరులను వశం చేసుకున్నట్లైతే, అలాంటివాడు పిశాచమై, తినటానికి తిండి, త్రాగటానికి నీరులేక అమితమైన వేదన అనుభవిస్తూ తెలిసినవారి ఛీత్కారాలు అనుభవిస్తూ ముప్పై ఆరు వేల సంవత్సరాలు నిర్జన ప్రదేశంలో ఉన్న మర్రిచెట్టుకు తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉంటాడని శాస్త్రం చెబుతోంది. అలాగే ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని, నిష్కారణంగా తనకు పరిచయం కూడా లేనివాళ్ళమీద చేతబడులు చేస్తూ, మరణాన్ని ప్రయోగించేవాడు. పైన చెప్పిన విధంగా లక్ష సంవత్సరాలు పిశాచ రూపంలో మర్రిచెట్టుకు వ్రేలాడి, ఆ తరువాత అశుద్ధంలో పురుగుగా పుడుతూ, చస్తూ ముప్పైవేల జన్మలు ఎత్తుతాడు. 


ఆ తరువాత క్రిమికీటకాదుల నుంచి మళ్ళీ జీవనచక్రం ప్రారంభిస్తాడు. కాబట్టి విజ్ఞులైన వారెవరూ అటువంటి మార్గం వైపు వెళ్ళరు. కాని లోకకళ్యాణం కోసం ఒక్కొక్కసారి ఇటువంటి పనులు చెయ్యవలసి ఉంటుంది. అందుచేతనే ఇటువంటి విద్యలు సత్వగుణ ప్రధానంగా గలవారి దగ్గర మాత్రమే ఉండాలి. ధర్మసూక్ష్మం గ్రహించగల వారు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఈ విద్య నేర్చినవారు సంయమనం పాటించాలి. విధిలేని పరిస్థితిలో మాత్రమే దీన్ని వాడాలి. ఈ విద్య అంత నిషిద్ధమైనది. ఈ రకమైన విద్యను నేర్పేవాడు నిషిద్ధగురువు, మొత్తంమీద దీని జోలికి వెళ్ళకుండా ఉండటం ఉత్తమము.


                                       ◆నిశ్శబ్ద.