Read more!

సగరులు ఎవరు?? ఎలా మరణించారు??

 

సగరులు ఎవరు?? ఎలా మరణించారు??

పూర్వం అయోధ్య నగరాన్ని సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరములు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహోత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు. కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనేవాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వారు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వారందరిని కలిపి సగరులు అన్నారు. 


పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయూ నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివలన ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుండి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి, అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగము నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది. కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. 


ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు, మీరెవరు కంగారు పడకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళ లోకములో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు. 


ఆ నగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వారు సగరుడికి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి. మీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సామనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమములో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగిలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక హుంకారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. 

                                  ◆వెంకటేష్ పువ్వాడ.