Read more!

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడు??

 

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడు??

విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు. ఆయన వేటలో అలసిపోయి మొదట వశిష్ట మహర్షి దగ్గరకు వెళ్లి అక్కడ ఆయన సహాయం పొందాడు. తరువాత వశిష్ఠుడి దగ్గర ఉన్న శబల అనే ఆవును చూసి దాని మీద మొహం పెంచుకుని దాన్ని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడిలో మొదలైన అహంకారం శబల కోసం యుద్ధం చేసేలా చేసింది, తపస్సు చేసి ఇంద్రుడి నుండి ఎన్నో అస్త్రాలు పొందేలా చేసింది, త్రిశంకుడిని శరీరంతో సహా స్వర్గానికి పంపే ధైర్యాన్ని తెగువను ఇచ్చింది కానీ విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి అంత గొప్పవాడు కాలేకపోయాడు. 


మళ్లీ మళ్లీ తపస్సులు చేసినా మేనక వల్ల ఆ తరువాత రంభ వల్ల తపస్సు భంగం అయ్యింది. తనకు ఇలా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పుడు విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు. నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం (యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. 

అలా వెయ్యి సంవత్సరములు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుండి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది. సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి


ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.


అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో, నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు (ఓంకారము, షట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు. అలాగే తాను కూర్చుని యజ్ఞము చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరములు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. 


బ్రహ్మగారు సరే అన్నారు. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి పాదములు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి పాదములు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. 


అహంకారం మనిషిని ఎంత కోపంగా ప్రవర్తించేలా చేస్తుందో, ఆలోచన, ఆత్మవిమర్శ మనిషిని ఉన్నతుడిని చేస్తుంది.  అహం పోయింది కాబట్టే వశిష్టుడి పాదాలకు పూజ చేయగలిగాడు విశ్వామిత్రుడు.


                                ◆ వెంకటేష్ పువ్వాడ.