పురుషార్థ ధర్మాలలో ఏది ఉత్తమం??

 

పురుషార్థ ధర్మాలలో ఏది ఉత్తమం??


ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధములైన భక్తులు కూడా మంచివాళ్లే అంటాడు భగవద్గీతలో పరమాత్మ.  వారిలో జ్ఞాని అయిన వాడు, ఎప్పుడూ భగవంతుడి మీదనే మనసు నిలిపి, భగవంతుడి గురించి ఆలోచిస్తూ, భగవంతుడి గురించే ధ్యానిస్తూ, ఆ భగవంతుడి సన్నిది పొందడానికే నిరంతరము తపిస్తుంటాడు. అలా అన్నివిధాలుగా అన్ని కోణాలలో భగవంతుడితో ప్రయాణం సాగిస్తాడు. నిజానికి భగవంతుడికి, అన్ని విధాలుగా భగవంతుడితో ప్రయాణం చేసే ఆ జ్ఞానికి పెద్దగా తేడా ఉండదు. సాధారణ ప్రజలకు ఆ భగవంతుడితో ప్రయాణం చేసే వ్యక్తి సాక్షాత్తు ఆ భగవంతుడిలానే కనిపిస్తాడు. 

భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన నాలుగు రకాల భక్తులలో జ్ఞాని అనేవాడు ఎంతో ఉత్తమమైన వాడు. అలాగని మిగినవాళ్ళు ఉత్తమమమైన వాళ్ళు కాదని, ఎందుకూ పనికిరానివాళ్ళు అని ఈ మాటల్లో ఉద్దేశ్యం కాదు. మిగిలిన ఆడవాళ్లు ఏదో ఒక విధంగా భగవంతుడిని పూజిస్తూనే ఉన్నారు, ద్యానిస్తూ ఉన్నారు. వాళ్లకు కూడా ఆ భగవంతుడి కృప అంతో ఇంతో లభిస్తుంది. 

ఉదారా: సర్వ ఏవైతే అన్నారు ఒక శ్లోకంలో అంటే వారు అందరూ ఉదారులే అని అర్థం. ఉదార స్వభావం కలవాళ్ళు అంటే  మంచి వారు అని అర్థం. వాళ్ళందరూ కూడా భక్తులే కాని "జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతమ్" అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు వారిలో జ్ఞాని అనే వాడు భగవంతుడే. అన్నింటిలో భగవంతుడిని చూడగలిగిన వాడు ప్రపంచం అంతటినీ సమానంగా చూస్తాడు. అది విలువైనది, ఇది విలువైనది కాదు, అది మంచిది ఇది చెడ్డది వంటి తేడాలు ఉండవు. మిగిలిన వారు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ తానెవరో తెలుసుకోలేకపోతున్నారు. జ్ఞాని బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆత్మావలోకనం చేసుకుంటూ తన చిత్తమును ఆత్మలో లగ్నం చేస్తున్నాడు. తానే బ్రహ్మ స్వరూపుడు అవుతున్నాడు. భగవంతుడితో లీనం అవుతున్నాడు. కాబట్టి అతడే నేను అని శ్రీకృష్ణుడు చెబుతాడు.  అందుకే యుక్తాత్మా అంటే భగవంతుడి యందే తన మనసును నిలిపినవాడు కాబట్టి అతడు ఉత్తమగతులను పొందుతాడు.

 రెండు రకాల భక్తులు గురించి చెప్పబడింది. కొందరు ప్రాపంచిక విషయాలలో ఉంటూ భగవంతుని ధ్యానిస్తుంటారు. కోరికలు కోరుతుంటారు. వారి దృష్టిలో వారు వేరు భగవంతుడు వేరు. వారికి భగవంతుడు కేవలం కోరికలు తీర్చడానికే పరిమితం. మరికొందరు భగవంతుని కోరికలు కోరరు. భగవంతునే కోరుకుంటారు. తానే భగవంతుడు అని అనుకుంటారు. భగవంతుని యందే తన చిత్తమును లగ్నం చేస్తారు. తానే భగవంతుడిగా మారి పోతారు. మనిషి జీవితంలో నాలుగు పురుషార్థాలు ఉన్నాయి. అవి  ధర్మ, అర్థ, కామ, మోక్షములు. 

ధర్మం: మనిషిని నడిపించే అత్యుత్తమ మార్గం అని భావిస్తారు. కృష్ణుడు అంటాడు ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని రక్షించడానికి నేను ప్ పుడుతూనే ఉంటాను అని అంటాడు. 

అర్థ: ఇది మనిషి వ్యక్తిత్వానికి సంబంధించినది. మనిషి అవసరాలు  భౌతిక, నైతికదర్మాల మీద ఆధారపడి ఉంటాయి. మనిషిలో స్వార్థం, అవసరార్థం చేసే పనులు, అందరూ చెప్పుకునే నియమాలను కొన్ని సార్లు తప్పుగా పాటించడం అందులో స్వార్థానికి పోయి వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది.

కామము: ఇది మనిషి జీవితాన్ని కబళించేది. మనిషి నిప్పు మీద పడినా, నిప్పు మనిషి మీద పడినా కాలేది మనిషికే. అలాంటి నిప్పు స్వభావమే ఈ కామం. దానితో మనిషి జాగ్రత్తగా ఉండాలి. 

మోక్షం:  అన్ని విషయాల నుండి ముక్తిని ఇచ్చేది మోక్షమే. ఆ దేవుడి చెంతకు చేరడానికి మార్గాన్ని చూపించేది మోక్షమే. 

జ్ఞాని అనేవాడు  ధర్మ, అర్థ, కామములను వదిలి పెట్టి ఆఖరుది అయిన మోక్షమునే కోరుకుంటారు. పరమాత్మలో లీనం అయి పోతారు. ఇదే అద్వైత స్థితి. తనకు పరమాత్మకు తేడాలేదు అనే భావన. అలా అనుకునేవారే జీవన్ముక్తులు, కర్మ, భక్తి, ధ్యానము తుదకు సాధకుని ఈ స్థితికి తీసుకొని వెళతాయి. 


                               ◆ వెంకటేష్ పువ్వాడ