Read more!

నిజమైన జ్ఞానుల ఆలోచన ఎలా ఉంటుంది?

 

నిజమైన జ్ఞానుల ఆలోచన ఎలా ఉంటుంది?

ఇద్దరు ఘరానా పెద్ద మనుష్యులు కలిసి మసీదులోకి వెళ్లారు. ఒకాయన తన పాదరక్షలు తీసి జతగా ఒకచోట జాగ్రత్తగా బయట పెట్టి లోనికి వెళ్లాడు. రెండవ ఆయన తన పాదరక్షలు కాళ్ల నుండి తొలగించి, వాటి క్రింది వైపులను జోడించి చంకన పెట్టుకొని లోనికి వెళ్లాడు.

మసీదు బయట కూచున్నవారిలో 'వీరిద్దరిలో ఎవరు ఉత్తములు?' అనే చర్చ ప్రారంభమైంది. 

'మసీదులోనికి వెళ్ళే మనిషి చెప్పులు వెలుపల వదిలి వెళ్లడం ధర్మం కదా?' అని ఒకరనగా, 'భగవంతుడి సాన్నిధ్యంలో తాను అతి సామాన్యుడినని గుర్తుంచుకోడానికే తుచ్ఛమైన తన చెప్పుల్ని వెంట తీసుకుని వెళ్లాడని' మరొకరు వాదించారు.

లోనికి వెళ్ళిన వ్యక్తులిద్దరూ ప్రార్థన ముగించుకొని బయటకు రాగానే, మీ విభిన్న చర్యకు కారణమేమిటో తెలియజేయమని అక్కడి వారు అడిగారు.

 ఒక పెద్దమనిషి "నేను చెప్పులు వాకిట్లో వదిలేయడానికి కారణమొకటుంది. వాటిని ఎవరైనా దొంగిలించాలనే దురాలోచనకు లోనైతే, అలాంటి పాపిష్ఠికార్యం చేయకుండా నిగ్రహించుకోడానికి వారికో అవకాశం కల్పిస్తుంటాను. ఆ విధంగా వారింత పుణ్యమార్జించడానికి దోహదం చేస్తుంటానన్న మాట" అని ప్రకటించాడు. 

"ఇతడెంత సద్ధర్మ పరాయణుడో ఇతరులు పుణ్యశీలురవడానికి ఇతడెంత త్యాగానికి సిద్ధపడ్డాడో" అని కొనియాడారు అక్కడివారు.

రెండవ పెద్దమనిషి ఇలా చెప్పుకొచ్చాడు. “నేను చెప్పుల్ని లోపలికి తీసుకెళ్ళిన కారణం వినండి, వాటిని నేను బయటవదిలి వెళ్ళినట్లయితే, ఎవరో ఒకరు దొంగిలించే వీలు కలగజేసినట్లే కదా? వారి పాపానికి బాధ్యత నాదే అవుతుంది కదా?” అని వివరించాడు.

 “ఆహాహా, ఎంత ధర్మబుద్ధి అండీ! తన కారణంగా మరొకరు పాపానికి గురవుతారేమోనని ఈయనకు ఎంత భీతండీ?" అని ఎంతగానో శ్లాఘించారు.

కానీ ఈ ఇద్దరు ఘరానావ్యక్తుల త్యాగనిరతినీ ధర్మాభినివేశాన్నీ మెచ్చుకుంటున్న వారిని పట్టించుకోకుండా, ఒక బుద్ధిశాలి ఇలా అన్నాడు "మీరు మీ అనుయాయులు ఊహాలోకంలో గొప్ప తర్కవితర్కాలు చేస్తూ, మనుష్యుల్ని ధర్మంలో సురక్షితులను చేయడానికి వారిని అనేక అగ్ని పరీక్షలకు లోనుచేస్తున్న ఈ తరుణంలో లోకంలోని కొన్ని వాస్తవ విషయాలను విస్మరిస్తున్నారు.” అన్నాడు.

"ఏమిటా వాస్తవ విషయాలు?" అని అరిచారు, అక్కడి ధర్మపరులు.

"వాకిలి వెలుపల వుంచిన చెప్పుల్ని దొంగిలించడానికి ఎవరూ ప్రయత్నించలేదనేది కనిపిస్తూనే వుంది కదా? అందుకని అలాంటి ఆలోచన ఎవరి మెదడులోనూ కదులాడి వుండదని అనడానికి వీలు లేదనుకోండి. ఎవరికి దొంగ గుణమున్నదో, ఎవరికి లేదో మనం కనుక్కోగలిగిలేము. కానీ బయట పెట్టటానికీ, లోనికి తీసుకువెళ్ళటానికైనా చెప్పులనేవే లేని వాడొకడు మసీదు లోనికి వెళ్ళినట్లు, మీరు గమనించారా? ఆ మనిషి తమ చర్యల ద్వారా ఇతరులు ఎలా ప్రభావితులవుతారని గానీ, వారికి తాను ఏమి నేర్పాలనే విషయం గురించి కానీ, ఆలోచించినట్లే కనిపించదు. ఎవరు తన వంక చూస్తున్నారు. ఎవరు చూడడం లేదు అనే స్పృహే లేదు. 

కానీ ఈ పరిశుభ్రమైన వ్యక్తి మసీదులో ఈనాడు తన ప్రార్ధన మూలంగా చెప్పులు దొంగిలించేవారి, దొంగిలించని వారి, దొంగిలిద్దామనే చెడు బుద్ధి కలిగి అటు తర్వాత మానుకున్న వారందరి ఆత్మోన్నతికి దోహదం చేశాడని అంటాను" అన్నాడు.

సత్ప్రవర్తన మనిషికి సహజంగా సిద్ధించాలి. అది అతడి హృదయం నుండి పుట్టుకు రావాలి. మెదడులోని ఆలోచన నుండి జనించినటువంటిది ఉద్దేశపూర్వకమని సూఫీ వేదాంతులు కనుగొన్న సత్యం. ఈ రెండవ దానికి పరిమితమైన విలువ వున్నప్పటికీ మొదటివానితో ఏనాటికి సమానం కాజాలదు.

అలాగే నిజమైన జ్ఞానం కలవారు వేరు, బండ్లకు బండ్లు జ్ఞానాన్ని మోసుకున్నట్లు బరువుగా తిరిగే గురువరేణ్యులు వేరు. ఆత్మశుద్ధి కలిగినవారు వేరు, నైతికసూత్రాలను నియమానుసారంగా పాటించేవారు వేరు. నిజమైన జ్ఞానులు మానవాళిని ముందుకు నడిపించగలరు. కుహనాజ్ఞానులకు నిజజ్ఞాన ముండదు. కానీ, జ్ఞానంతో ఆటలాడుకుంటూ వుంటారు.

                                     ◆నిశ్శబ్ద.