Read more!

కులవ్యవస్థ గురించి అధ్యాత్మికతలో ఏమని ప్రస్తావించారు?

 

కులవ్యవస్థ గురించి అధ్యాత్మికతలో ఏమని ప్రస్తావించారు?

బ్రహ్మార్పణం బ్రహ్మహవి:

బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | 

బ్రహ్మైవ తేన గస్తవ్యం 

బ్రహ్మకర్మ సమాధినా ॥

యజ్ఞం చేసేవాడు, హోమం చేసే ద్రవ్యాలు, వాటిని స్వీకరించే అగ్ని, అన్నీ పరబ్రహ్మ స్వరూపాలే. ఆ యజ్ఞఫలితం కూడా బ్రహ్మార్పణమే. ఇలా సర్వకర్మలూ యజ్ఞదృష్టితో చేయటమే బ్రహ్మ కర్మసమాధి నిష్ఠ, ఇలాంటి నిష్ఠ కలవాడే పరబ్రహ్మస్థితిని పొందుతాడు. ఈ శ్లోకానికి వేదాంత పరంగా అర్ధం చెప్పుకోవచ్చు. యజ్ఞం అంటే మామూలు యజ్ఞాలుగా వివరణ ఇచ్చుకోవచ్చు. కానీ 'చాతుర్వర్ణ్యం' తరువాత దీన్ని చెబితే  పైపై అర్థాన్ని విడిచి లోతుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ అర్థాన్ని నిత్యజీవితానికి అన్వయించుకోవాల్సి ఉంటుంది.

భారతీయతత్త్వం ప్రకారం యజ్ఞముంటే పలు అర్ధాలు వస్తాయి. దాంట్లో మనిషి జీవితంలో 'ఊపిరి' పీల్చటం కూడా యజ్ఞమే. ఆహారం స్వీకరించటం యజ్ఞమే. దృశ్యాలు చూడటం యజ్ఞమే. మాట్లాడటం యజ్ఞమే. ఆలోచించటం యజ్ఞమే. చివరికి లైంగికచర్య కూడా యజ్ఞమే. 'ఓ సురవేణి నీ క్రతుహోమగుండమున నా జీవితమునే వ్రేల్చి' అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్, 'అద్వితీయం' అనే కవితలో మార్మికంగా. దీన్ని బట్టి చూస్తే నిత్యజీవితంలో మనం సంకల్పితంగా, అసంకల్పితంగా చేసే ప్రతిచర్య కూడా ఈ యజ్ఞంలో హోమం చేసే ద్రవ్యాలు, మన ఎదురుగా ఉన్న ముడిసరకులు. 

ఈ ప్రపంచంలో లభించే మట్టి, చెట్టు, గుట్ట, నీరు, గాలి ఇలా  అన్నీ ఈ యుద్ధంలో హవిస్సులే. 'ఈశావాస్యం ఇదం సర్వం. కాబట్టి అవన్నీ పరబ్రహ్మ స్వరూపాలే. వాటితో చేసే యజ్ఞఫలితం బ్రహ్మార్పణమే. కాబట్టి ఈ ప్రపంచంలో జీవి, ఏ పని చేసినా అది బ్రహ్మార్పణమే. దాంట్లో హెచ్చుతగ్గులు లేవు. ఉచ్చనీచాలు లేవు. సహ్యాసహ్యాలు లేవు. తాను చేస్తున్న పనిని బ్రహ్మార్పణంగా భావించి చేసే పనులలో హెచ్చుతగ్గులు ఉండే ప్రసక్తి లేదు.

ఎవరి గుణాన్ని బట్టి, స్థాయిని బట్టి వారి కర్మలుంటాయి. కర్మలేవైనా కరృత్వభావన లేకుండా చేస్తే సత్ఫలితాన్నిస్తాయి. అలా కాక కర్తృత్వభావన ఉంటే అవి దుష్ఫలితాన్నిస్తాయి. అందుకే ఒకప్పుడు సమాజంలో ఉచ్చనీచాల భావనలుండేవి కావు. వ్యక్తిని కర్మల ఆధారంగా కాక గుణం ఆధారంగా గౌరవించేవారు. మహారాజులైనా అడవుల్లో ఆకులు, అలములు తింటూండే మునికి సాష్టాంగ ప్రణామం ఆచరించేవారు. 'జ్ఞానం' ఉందని తెలిస్తే, రాజు మాంసం కొట్టేవాడి ముందు కూడా మోకరిల్లేవాడు. 'కులం'తో సంబంధం లేకుండా  వ్యక్తులు తపస్సు చేసేవారు. జ్ఞానం సంపాదించి ప్రపంచానికి పంచేవారు. అవసరం వస్తే అందరూ కలిసికట్టుగా ఉండి ధర్మరక్షణ చేసేవారు. చరిత్రను గమనిస్తే, కులాల భేదభావాలు లేకుండా కలిసి దేశం కోసం పోరాడేవారు. ఈ నాటికీ భారతీయధర్మం సజీవంగా ఉందంటే, ఆనాడు వ్యక్తులు కులభావనల కతీతంగా ధర్మం కోసం కలిసి పోరాడటం వల్లనే!

అయితే, కాలక్రమేణా, అదీ గడచిన కొన్ని వందల ఏళ్లుగా, ముఖ్యంగా మధ్యయుగం తరువాత, దేశంలో కులవ్యవస్థ గట్టిపడింది. ఈనాడు మనం అనుభవిస్తున్న 'కుళ్లు' ఆరంభమైంది. సృష్టిలో ఏదైనా ఆరంభంలో ఉన్న స్వచ్ఛత తరువాతి కాలంలో ఉండదు. గంగానది సైతం హిమాలయాల పాదాల వద్ద ఉన్నంత స్వచ్ఛంగా తరువాత ఉండదు. అనేక ఉపనదుల కలయికతో, స్థానిక నైసర్గికపరిస్థితులకు అనుగుణంగా మలినమౌతుంది. వీటి కన్నా ఎక్కువగా మనిషి దాన్ని మలినం చేస్తాడు. గంగానదికే ఆ గతి పడితే కులవ్యవస్థ గురించి వేరే చెప్పాలా? ఎలాగైతే కాలం చెల్లినదాన్ని పక్కన పడేస్తామో, అలా కులవ్యవస్థ స్వరూపాన్ని అర్థం చేసుకుని, అవసరం తీరిన మలినవస్త్రంలా సమాజం దాన్ని విసర్జించాలి. అసలు స్వరూపాన్ని గ్రహించక, చేసే దుర్వాఖ్యానాలను, విపరీతార్థాలను వదిలేయాలి.

                                      ◆నిశ్శబ్ద.