అసలు పితృదోషం అంటే ఏంటి... ఇందులో ఎన్ని రకాలున్నాయో తెలుసా!
అసలు పితృదోషం అంటే ఏంటి... ఇందులో ఎన్ని రకాలున్నాయో తెలుసా!
హిందూ మతంలో దేవతలనే కాదు..పెద్దలను, మరణించిన వారిని పూజించే సంప్రదాయం ఉంది. పురాణ గ్రంథాల ప్రకారం ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజును పూర్వీకులకు కేటాయించారు. అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం వదులుతారు. దీనితో పాటు ప్రతి సంవత్సరం శ్రాద్ద పక్షం కూడా ఉంటుంది. దీనిని పితృ పక్షం అని కూడా అంటారు. పితృపక్షాల సమయంలో పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పిండాదానం, తర్పణం, శ్రాద్ధం చేస్తారు. పితృ పక్షంలో పూర్వీకులకు శ్రాద్ధం అర్పించడం ద్వారా పూర్వీకులు సంతోషించి కుటుంబానికి తమ ఆశీర్వాదం ఇస్తారని చెబుతారు. ఈ ఏడాది పితృపక్షాలు సెప్టెంబర్ 7వ తేదీ పౌర్ణమి తర్వాత ప్రారంభమై.. సెప్టెంబర్ 21వతేదీన ముగుస్తాయి. ఈ సందర్భంగా అసలు పితృదోషం అంటే ఏమిటి? ఇందులో కూడా రకాలు ఉన్నాయా? దీని గురించి తెలుసుకుంటే..
పితృదోషం..
జన్మకుండలిలో కొన్ని గ్రహస్థితుల వలన లేదా పితృకర్మలు సరిగ్గా చేయకపోవడం వల్ల పితృదోషం ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా మన పితృదేవతలు (తల్లిదండ్రులు, పూర్వీకులు) సంతృప్తి చెందకపోవడం వల్ల, లేదా పూర్వజన్మలో చేసిన కొన్ని కర్మల వలన కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఉన్నవారికి వివాహం ఆలస్యం కావడం, సంతానం సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు లాంటివి ఎదురవుతాయని నమ్మకం ఉంది.
పితృదోషం రకాలు..
కార్మిక పితృదోషం.
పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల ఏర్పడే దోషం. హింస, వంచన, సత్యవిరోధం లాంటివి కారణాల వల్ల ఈ దోషం ఏర్పడుతుంది.
కర్మలేమి వల్ల పితృదోషం..
పితృకర్మలు (శ్రాధ్ధ, తర్పణం, వార్షిక శ్రద్ధలు) చేయకపోవడం వల్ల. పితృదేవతలు అసంతృప్తిగా ఉండటం ఈ రకమైన పితృదోషం ఏర్పడుతుంది.
అకాల మరణ పితృదోషం..
కుటుంబంలో ఎవరు అకాల మరణం పాలైతే, వారి ఆత్మ సంతృప్తి చెందకపోవడం జరుగుతుంది. వీరికి ప్రత్యేక పూజలు అవసరమని పండితుల అబిప్రాయం.
పాపకార్యాల వల్ల పితృదోషం..
పూర్వీకులు చేసిన అనైతిక కర్మల వల్ల వారి సంతతికి కూడా ఆ ప్రభావం పడుతుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే దోషం. దీని వల్ల వంశమంతా ఇక్కట్ల పాలవుతుంది.
జన్మకుండలిలోని గ్రహస్థితుల వల్ల పితృదోషం..
ముఖ్యంగా రాహు, కేతు, శని, సూర్యుడు పితృదోషానికి కారణమని జ్యోతిష్యం చెబుతుంది.
మాతృపితృ దోషం..
తల్లిదండ్రులను అనాదరించడం, వారిని బాధ పెట్టడం వల్ల కలిగే దోషం.
పితృదోష లక్షణాలు..
కుటుంబంలో వివాహాలు ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, తరచుగా ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో కలహాలు, అనారోగ్యం. కలల్లో పూర్వీకులు కనిపించడం మొదలైనవి పితృదోషం లక్షణాలుగా చెబుతారు.
*రూపశ్రీ.