Read more!

దైవత్వం అంటే ఏమిటో తెలుసా?

 

దైవత్వం అంటే ఏమిటో తెలుసా?

దేహం లోపలా, మరి వెలుపలా సర్వమూ వ్యాపించిన మహామూల చైతన్య పదార్థం. ఆ మహామూల చైతన్యం యొక్క ఒకానొక శకలం  దేహంలో ఇమిడివుంది. మహాముల చైతన్యానికి ఏయే సర్వశక్తి సామర్థ్యాలూ, సమస్త ధర్మాలూ వున్నాయో, ఆ సమస్తమూ మీలోని ఆత్మశక్తి కలిగివున్నది. కాలం ప్రదేశంనకు ఏమాత్రం అందకుండా అది ఉంటుంది. అతీతమైన స్థితిలో ఉంటూ కోటాను కోట్ల లోకాలలో వివిధ రకాలైన జీవరాశులుగా జన్మలు తీసుకుంటూ చైతన్యపరిణామం చెందుతూ పురోగమిస్తున్నదీ దైవ పదార్థం!

సకల చరాచర సృష్టిలోని సమస్త జీవాత్మల ప్రాణాధారం మరి ప్రాణశక్తి ఈ దైవపదార్థం! గడ్డిపోచలోను, రాళ్ళలోను, పర్వతాలలోను, సముద్రాల్లోను, గ్రహంలోను మరి సమస్త నక్షత్ర మండల వ్యవస్థల్లోను ఈ దైవపదార్థం (బ్రహ్మపదార్థం) ఇమిడివుంది.  సృష్టి, చైతన్య పరిణామం రెండూ కూడ ఈ దైవ పదార్థమే. చైతన్య పరిణామం కోసం సృష్టి మరి సృష్టి కోసం చైతన్య పరిణామం సంభవిస్తున్నాయి. ఈ రెండూ ఒకటే!

దైవత్వమంటే సచ్చిదానంద స్వరూపం, దైవత్వమంటే ప్రేమ స్వరూపం, దైవత్వమంటే ప్రకృతి స్వరూపం, దైవత్వమంటే పరిపూర్ణమైన అందం + ఆనందం + శాంతితో నిండిన శక్తి స్వరూపం. 

బ్రహ్మ పదార్థం (దైవత్వం) అంటే సర్వవ్యాపితమైనది + సర్వశక్తిమంతమైనది సర్వ జ్ఞానం తెలిసినది అయిన కాంతి స్వరూపం. ఈ బృహత్ స్వరూపం అశ్మకకలం  రూపంలో మీ అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంటుంది. దైవత్వం (బ్రహ్మపదార్థం) అంటే దృశ్యరూపంలో వున్న భౌతిక ప్రపంచమూ మరి అదృశ్యరూపంలో ఉన్న శక్తి స్వరూపమూ..

అనంతమైన సర్వజ్ఞత, అనంతమైన ఎఱుక, అనంతమైన అనుభూతులను, అనంతమైన శక్తి సామర్థ్యాలను ఇముడ్చుకుని తనను తాను ప్రకాశం చేసుకోవడానికి కోటాను కోట్ల లోకాలలో విస్తరించిన జీవరాశులుగా చైతన్య పరిణామం చెందుతున్నదే ఈ బ్రహ్మపదార్ధం. సూక్ష్మాతి సూక్ష్మంలోనూ, బ్రహ్మండమైన లోకాలలోను విస్తరించి సమస్త జీవకోటికి ప్రాణధారమై విరాజిల్లుతున్న శక్తి స్వరూపమే ఈ బ్రహ్మపదార్థం.

తర్కానికి, విశ్లేషణకు, మానవ ఇంటెలిజెన్స్కు, ఇంద్రియాలకు మరి అహంకారానికి అందని శక్తి స్వరూపం ఈ బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థం రుజువులకు అందదు, ప్రయోగాలకు అంతుచిక్కదు. ఈ బ్రహ్మపదార్థం మీరు సంపూర్ణ శరణాగతితో ఆశ్రయించినపుడు మాత్రమే అందుతుంది. సమస్త లోకాలలోని జీవాత్మలకూ మూలధారం ఈ బ్రహ్మపదార్థమే!

ఈ బ్రహ్మపదార్థం ఆయా లోకాలలోని వాతావరణ పరిస్థితులు + భౌతిక పరిస్థితులకు అనుగుణంగా జీవాత్యలకు దేహాలను కలుగజేసి చైతన్య పరిణామం చెందుతున్నది. ఈ బ్రహ్మపదార్ధం ఎప్పుడూ సృష్టింపబడనూ లేదు. ఎప్పుడూ నశింపబడేది కాదు. అనంతకాలం నుండి నిత్యనూతన చైతన్య పరిణామం చెందుతూనే ఉన్నది. ఇకపై అనంతకాలమూ పరిణామం చెందుతూనే వుంటుంది.

దైవత్వానికి ద్వంద్వత్యాలు  లేవు, పక్షపాతాలు లేవు, చావులేదు, పుట్టుక లేదు, తీర్పు చెప్పే తత్వం  లేదు, పరిమితాలు లేవు, జీవ జాతులను తన నియంత్రణలో వుంచడం చేయదు. పగ, ప్రతీకారం, ద్వేషం, క్రోధం అనేవి వుండవు. అహంకారం, అసూయ అనేవి లేవు. దైవత్యం అంటే సమస్తమూ ప్రేమమయమే, ఆనందమయమే.శాంతిమయమే. బ్రహ్మానందమయమే.  భౌతిక ప్రపంచం, ఆభౌతిక ప్రపంచం, పదార్ధం, శక్తి అన్నీ దైవ పదార్థమే. సమస్త లోకాల్లోనూ విరాజిల్లుతున్నది ఈ దైవ పదార్థమే. ఈ సమస్త లోకాల ఉనికి, సమస్త ప్రాణకోటి చైతన్యశక్తి పరిణామం అన్నీ ఆ బ్రహ్మపదార్థమే.

 కర్త, క్రియ, కర్మ, భోక్త అన్నీ బ్రహ్మపదార్థమే. సమస్త జీవజాతులూ బ్రహ్మపదార్థంచే నడుపబడుతున్నవి. సమస్త జీవజాతులూ దైవపదార్ధం చేత సంపూర్ణంగా ప్రేమించబడుతున్నాయి. మనిషి పట్ల ప్రత్యేకమైన ప్రేమ అంటూ వుండదు. సమస్త జీవజాతులూ ప్రేమించబడుతున్నాయి. దైవ పదార్థమన్నా, బ్రహ్మ పదార్థమన్నా, సత్యమన్నా అన్నీ ఒకటే. దైవత్వం అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. అంతేకాని తర్క విశ్లేషణలు లేదా ఇంటెలిజెన్స్ ద్వారా శోధించలేము.

దైవత్వం వర్ణించలేనిది, ఆపరిమితమైనది, అప్రమేయమైనది, అనన్య సామాన్యమైనది.  సకల చరాచర సృష్టి యొక్క కర్మలను, చైతన్య పరిణామాన్ని నడిపించేది ఈ దైవత్వమే.

ఇదీ దైవత్వం గురించి అసలైన వివరణ!!

                                     ◆నిశ్శబ్ద.