Read more!

గౌతమ బుద్ధుడు ఆత్మచైతన్య పరిణామం గురించి ఏమి చెప్పాడు?

 

గౌతమ బుద్ధుడు ఆత్మచైతన్య పరిణామం గురించి ఏమి చెప్పాడు?

ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మీలో నిద్రాణమై వున్న జ్ఞానాన్ని మీకు వివరించి చెప్పవలసిన అవసరంలేదు. అంటే జన్మ తీసుకున్నపుడే అపరిమితమైన జ్ఞానాన్ని  అంతరంగ ప్రపంచంలో ఇమడ్చుకుని ఈ భూమి మీదకు వచ్చారని అర్థం.  మీలో దాగివుంటున్న ఆ మహాజ్ఞానం మీ ఇంద్రియాలకు అనుభవంలోకి వస్తుంటుంది. మన అందరి ఉనికికి సమస్త జీవజాతుల ఉనికికి కారణభూతమైన ఆ మహిమాన్విత శక్తితో సంధానం ఏర్పరచుకొని సంభాషించగల శక్తి మనలోనే ఇమిడివుంటున్నది.

అయినప్పటికీ, మీరు ఎవరు? అని తెలుసుకోవడానికి కొంత సాధన చేయవలసివుంది. ఆ సాధన మార్గమే ధ్యానం! మీలో దాగి వుంటున్న ఆ మహా జ్ఞానాన్ని దైనందిక జీవితంలోకి వినియోగించుకునేందుకు ధ్యానం లేదా అంతర్ ప్రయాణం అనే సాధనా మార్గం అత్యంతావశ్యకం! 

యోగం అంటే మీ అంతరంగ ప్రపంచంతో కలవడం. యోగం అన్నా, ధ్యానం అన్నా ఒకటే! యోగం అనేది మానవజాతికి ఒక మహత్తరమైన వరం! ఒక మహిమాన్వితమైన మార్గం. అంతరంగ ప్రపంచంలోని బృహత్ బ్రహ్మస్వరూపాన్ని దర్శించగలిగేట్లు చేసే సాధనా మార్గం యోగం!

దేహం అంటే ఒట్టి మాంస పిండం కాదు. మాంస పిండంలో దాగివున్న ఈ ఆత్మ దేహంను ఒక వాహనంగా ఎంచుకుని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందటానికి భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. బ్రహ్మపదార్థం యొక్క ఒకానొక శకలం జ్ఞాన విస్తరణను కావించుకుంటూ తనలోని విరాట్ స్వరూపాన్ని ఎఱుకలోకి తెచ్చుకుంనేందుకు అంతర్ ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నది. ఈ యోగ సాధనే అందుకు సరియైన మార్గం!


'మీరు' అనేది మీకు తెలిసిన జ్ఞానం కంటే ఇంకా అపారంగా విస్తరించి వున్నది. దేవుడు మరి ఆత్మశక్తి అనేవి మీలోనే ఇమిడివున్నాయి. మరి, ఈ దేవుడు + ఆత్మశక్తి నిరంతరమూ విస్తరిస్తూ పురోగమిస్తూ చైతన్య పరిణామం చెందడం సంభవిస్తుంది.

గౌతమ బుద్ధుడు తాను నిర్వాణం చెందినపుడు చెప్పిన మాటలు తెలుసుకోవాలి. 

ఏదయితే అయి వున్నారో దానిని తెలుసుకోవడానికి యోగసాధన తప్పనిసరి. బ్రహ్మపదార్థం లేదా మూలచైతన్యం  యొక్క సర్వధర్మాలు, సర్వశక్తి సామర్థ్యాలు మీ ఆత్మశక్తిలో ఇమడ్చబడివున్నాయి. వాటిని దైనందిక జీవితంలోకి మరి వినియోగంలోకి తీసుకురావడానికి ఏ విధమైన సాధన అవసరమో మీకు తెలుసా?

అంతరంగ ప్రపంచంలోకి ప్రయాణం చేయడమే ఆ సాధన! యోగ సాధనే ఆ సాధన! మరి ఎంత కాలం ఈ సాధన కొనసాగాలి? ఈ అంతరంగ ప్రపంచంలోని ఆత్మశక్తిని తెలుసుకోవడానికి ఎంతకాలం ఈ సాధనను కొనసాగించాలి? ఆత్మశక్తి యొక్క అనంతతత్వాన్ని తెలుసుకోవడానికి ఎంతకాలం సాధన చేయాలి?

అనంతమైన శక్తిసామర్థ్యాలు గల ఆత్మశక్తిని తెలుసుకోవడానికి అనంతకాలమూ సాధన చేయాలి. సూర్యగోళం అనంతకాలమూ మండుతూనే వుంటుంది. భూ పరిభ్రమణం, భూ ఆత్మభ్రమణం అనంతకాలమూ కొనసాగుతుంటుంది కదా!!  

ఈ ఆత్మయొక్క చైతన్య పరిణామం కూడ నిరంతరమూ అనంతకాలమూ కొనసాగుతుంటుంది. నిరంతర పరిణామము, నిరంతర మార్పు అనేది ఈ ప్రకృతిలో ఈ మహా ప్రకృతిలో అనంతకాలము కొనసాగుతుంటుంది. ఈ నిరంతర సాధన, ఈ నిరంతర పరిణామము సంభవిస్తున్నపుడే మీలోని అంతర్గత శక్తిసామర్థ్యాలు దైనందిక జీవితంలోకి వినియోగింపబడతాయి అపుడే జీవితంలో 'ఆనందం' అనేది సంప్రాప్తిస్తుంది. అని గౌతమబుద్ధుడు చెప్పాడు.

                                     ◆ నిశ్శబ్ద.