Read more!

భగవంతుడిని చేరే మార్గం ఎక్కడుందో తెలుసా?

 

భగవంతుడిని చేరే మార్గం ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోని సకల జీవజాలం అతి నెమ్మదిగానే అయినా అప్రయత్నంగానే భగవంతుడి వైపు ప్రయాణిస్తున్నట్లు, భారతీయ జీవన విధానం అన్ని కోణాల నుండీ భగవంతుడివైపు సాగే విధంగా వేదాలు, ప్రాచీన ఋషులు ప్రణాళికను రచించారు. ఇదొక విస్మయపరచే విశిష్టమైన విధానం. మానవాళి మీద అత్యంత ఆత్మీయతతో, బాధ్యతతో ఏర్పాటు చేసిన ఈ జీవితకాల అప్రయత్న సాధన, ఆస్తికత్వం ఒక్క శాతం కూడా లేని వ్యక్తిని కూడా అంతో ఇంతో, ఎంతో కొంత ఆ పరాత్పరుని వైపు నడిపిస్తోంది. 


మనిషి గర్భంలో కూడా పడని దశ నుండి మరణించిన కొన్నేళ్ళవరకూ (బహుశా మరో జన్మ తీసుకునే వరకూ) సంస్కారాల పేరుతో, సంప్రదాయాల పేరుతో భగవంతునితో అనుసంధానమై ఉండే విధంగా మానవ జీవిత వైఖరిని తీర్చిదిద్ది, మానవాళికి మహోపకారం చేశారు వారు. ఈ ఉత్తమమైన ప్రణాళికలో ఉన్న  ఆంతర్యం ఏమిటి?? ఈ ఆంతర్యాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? మనకు హాని చేసే విషయాల మీదకు క్షణాల మీద వాలిపోయే మనస్సు ఉపకారానికీ, ఉన్నతికీ నిర్దేశించిన అంశాల వైపు పొరపాటున కూడా చూడదెందుకు?


పునాదులతో సహా భవనం నిర్మించుకోవడం కన్నా పునాదుల మీద కట్టుకునే అవకాశం వస్తే అది సులభమవుతుంది. శ్రమా, సమయమూ కూడా కలిసివస్తాయి. ఆధ్యాత్మికత అనేది భారతీయ ఆత్మ. ఈ దేశంలో నివసించేవారికి  రక్తగతంగా, వారసత్వంగా అందిన అపురూప కానుక. పరమపదం వైపు నడిపించే ఆత్మవిద్య, అవకాశం అనేవి సగం పాళ్లు మనకు జన్మతః ఉంటాయి. ఆ మిగిలిన సగాన్ని సాధన చేసి పూరించుకోవాలి. 


ప్రతి వ్యక్తి కూడా భారతీయ మానవ జీవిత మనుగడతో అనుసంధానం చేసిన అద్భుత విధానాన్ని అధ్యయనం చేయాలి. ఏ దేశంలోనూ కనిపించని ఈ విశిష్ట ప్రణాళిక భారతదేశంలో మాత్రమే ఉంటూ.. భారతీయులకు, భారతదేశ నలుమూలల ఉన్నవారికి కూడా ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తుంది. తగినంత వ్యక్తిగత స్వేచ్ఛకూ, ఆనందానికీ భంగం కలిగించకుండానే అందరికీ అన్ని విధాలా మంచి చేకూర్చేలా  అడుగడుగునా ఆపాదించింది. విశృంఖలత్వానికి కళ్ళేలు వేస్తూనే వాటిని ఆమోదించే ప్రయోజనాన్ని వెల్లడి చేసింది. 


పదిమంది కోసం ఒకరు, ఒకరి కోసం పదిమంది నిలబడే సంస్కృతి భారతదేశంలోనే ఊపిరి పోసుకుంది. విభిన్న కులాల, మతాల, భాషల, సంస్కృతుల మేళా అయిన భారతదేశం, సౌందర్యం చెదరకుండా, సౌరభాలు సడలకుండా అన్నింటినీ ఒకే సూత్రానికి గుదిగుచ్చబడిన కదంబమాల. భిన్నత్వంలో ఏకత్వాన్నీ, ఏకాత్మతా భావాన్నీ, ఆధ్యాత్మిక తత్త్వాన్నీ మూల సూత్రంగా, బీజ మంత్రంగా ఉగ్గుపాలతో పోసే జాతి మనది. పాపభీతిని పాలుగా తాగే నీతి మనది. మనం కాకపోతే పరమపద  మార్గంలో ఎవరు ముందుంటారు? 


నిజానికి పరమపద సోపాన పటంలో నిచ్చెనలు తప్ప పాములు లేని జీవన శైలి మనది. అమృత కలశం లాంటి దేశం మనది. వితరణలో అందరికీ సమాన భాగం ఉంది. పంచుకుని, స్థాయి పెంచుకునే యోగ్యత మనకు లేదా? వేదాలు ఘోషిస్తున్నాయి, శాస్త్రాలు భాసిస్తున్నాయి... భగవంతుడున్నాడు. ఆయనను అందుకునే అవకాశం ఉంది. మార్గాలు ఉన్నాయి అని! ముఖ్యంగా భారతీయులకు సహజంగానే జీవన శైలి ద్వారానే ఆ భగవంతుడిని చేరుకునే ఒక మార్గం ఇమిడిపోయి ఉంది. ఆ తత్త్వమూ ఉంది. అదృష్టవశాత్తూ  ఇప్పటికీ అవసరమైన వాఙ్మయమే గాక గురుత్వం వహించి మార్గనిర్దేశం చేసే మహాత్ములు, గురువులు ఉన్నారు. అంది పుచ్చుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. పుట్టినందుకు మనం సాధించింది ఏంటి?? ఆ సాధన వైపు వెళ్ళడానికి  ఒకబాటగా జీవితాన్ని మలచిన దేశం భారతదేశం ఒక్కటే.

  

                                       ◆నిశ్శబ్ద.