Read more!

సత్పురుషులను గుర్తించడం ఎలా?

 

సత్పురుషులను గుర్తించడం ఎలా?


ఆధ్యాత్మిక జీవిత పురోగతికి సత్సంగం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. నిజమైన సత్పురుషులకూ, బూటకపువారికీ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం కష్టమవుతుంది.


భక్తి విశ్వాసాలు పుట్టి అవి బలంగా తయారయ్యేదుకు  సత్సంగమనేది ముఖ్యమైన కారకమన్న విషయం సత్యం. అలాగే నిజమైన సత్పురుషులు అరుదనే విషయం కూడా సత్యమే. ఆదర్శప్రాయుడైన సత్పురుషునికి ఉండాల్సిన లక్షణాల గురించి 'భాగవతం' ఇలా చెబుతుంది..


“ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర అనురక్తే బంధనానికి మూల కారణమని వివేకులు పలుకుతారు. కానీ అలాంటి అనురక్తి ఒక సత్పురుషునిలో గనక కలిగితే అది అతనికి మోక్ష ద్వారాన్ని తెరుస్తుంది. సత్పురుషులు జీవితంలోని ఒడుదొడుకులన్నిటినీ సమభావంతో స్వీకరిస్తారు. వారి మనసంతా అందరి పట్ల దయతో, స్నేహభావంతో నిండి ఉంటుంది. స్వభావ రీత్యా వారు ప్రశాంతచిత్తులు. అందువల్ల వారికి శత్రువులు ఉండరు. మంచితనమే వారి ఆభరణం. కేవలం నాపై మాత్రమే ఆధారపడే స్వభావంతో కూడిన అచంచల భక్తిని వారు సాధన చేస్తారు. వారు తమ కర్మలన్నిటినీ నాకు అర్పిస్తారు. నా కోసమై వారు తమ బంధుమిత్రులను త్యజిస్తారు. వారు నా మహిమలనూ, గుణగణాలనూ వింటారు. వాటి గురించి నలుగురితో మాట్లాడతారు. అది విన్నవారు కూడా తద్ద్వారా పవిత్రులు అవుతారు. ఆ విధంగా నా మీద భక్తి గలవారు జీవితం లోని రకరకాల దురదృష్టాల నుంచి రక్షించబడతారు.


పైన వర్ణించబడిన విధంగా సాంసారిక అను రక్తిని త్యజించినవారు సత్పురుషులు అనబడతారు. అలాంటివారి సాంగత్యం పొందినవారు కూడా సాంసారిక అనురక్తి నుంచి ముక్తులవుతారు.” 

పైన పేర్కొన్నదాన్ని బట్టి సాధువు లేదా సత్పురుషుడు అంటే దయాళువూ, అందరి మంచీ కోరేవాడూ, స్వార్థం - దంభం లేనివాడూ, అన్నిరకాల అనురక్తులకూ అతీతుడూ, మనోచాంచల్యం నైరాశ్యాల నుంచి ముక్తి పొందినవాడూ, భగవంతుని పట్ల శరణాగతిని సాధన చేసేవాడూ, ప్రశాంతచిత్తుడూ, సదా భగవంతుడి గురించి చింతించడం, మాట్లాడడం, సేవించడం లాంటి కార్యాలలో నిమగ్నమయ్యేవాడని మనకు బోధపడుతోంది.


'భాగవతం'లోని ఈ వర్ణనను ఆధారంగా చేసుకొని ఎవరికి వారే వ్యక్తుల గురించి నిర్ణయించుకోవచ్చు. ఇదే ఆదర్శం. నిజ జీవితంలో అపరిపూర్ణులైన వ్యక్తులు మాత్రమే మనకు తారసపడినప్పటికీ, అదీ మనకు గీటురాయిలా ఉపయోగపడుతుంది.


కానీ సాధారణంగా జనం శాస్త్రాల్లో చెప్పబడిన ప్రమాణాలను కాదని, తమ ఊహాజనిత ప్రమాణాలనే అనుసరిస్తుంటారు. మంత్ర తంత్రాలు ప్రదర్శించడం, భవిష్యత్తును ఊహించడం, వ్యాధులను నయం చేయడం లాంటి వాటినే పవిత్రతకు కొలమానాలుగా తరచూ భావిస్తుంటారు. అలాంటి ప్రదర్శనల ద్వారా ఆ వ్యక్తి కేవలం మానసిక శక్తులను మాత్రమే సాధించాడని తెలుస్తుంది. మనకు తెలిసిన కండ బలం, ధనబలం, బుద్ధిబలం మొదలైన ప్రాపంచిక శక్తుల లాంటివే ఈ మానసిక శక్తులు కూడా!


నిజమైన సత్పురుషులు వారి సాధనల ఫలితంగా కొన్ని శక్తులను సంపాదించినప్పటికీ వాటిని ఎన్నడూ ఉపయోగించరు సరి కదా, వాటిని కనీసం బహిరంగపరచరు కూడా! కాబట్టి శక్తులు ప్రదర్శించేవారు సత్పురుషులని అభిప్రాయపడకండి.


                                     ◆నిశ్శబ్ద.