Read more!

రామాయణంలో విరాధుడి వృత్తాంతం!!

 

రామాయణంలో విరాధుడి వృత్తాంతం!!


ఒకచోట చీకురువాయువులనే ఈగలు రొద చేస్తూ కనబడ్డాయి (ఈ ఈగలు పులిసిపోయి పడిఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి). అయితే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురోడుతుండగా తన వొంటికి చుట్టుకొని, ఒక శూలాన్ని పట్టుకుని, ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చివుండగా,, వొంటి నిండా మాంసం అంటుకున్న ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని ఒక్క ఉదుటున ఎత్తి  పట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు.


"మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్నవారు. ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యను నేను తీసేసుకున్నాను. ఇకనుండి ఈమె నాకు భార్యగా ఉంటుంది, అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు (రాధ్ అంటే ఆనందం, విరాధ్ అంటే ఆనందానికి వ్యతిరేకం) అంటారు. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని" అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో 'చూశావా లక్ష్మణా, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతోందో. నాకు ఎంత కష్టమొచ్చిందో చూశావా. నా కళ్ళ ముందు పరాయివాడు నా భార్యను పట్టుకున్నాడు. నాకు చాలా దుఃఖంగా ఉంది" అని, ఆ విరాధుడి వైపు చూసి "మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరథ మహారాజు పుత్రులము. మేము రామలక్ష్మణులము. మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు" అని రాముడు అన్నాడు. 


అప్పుడా విరాధుడు "నేను జవుడు అనే ఆయన కుమారుడిని. మా అమ్మ పేరు శతప్రద, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను" అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. అప్పుడా విరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వారు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు. అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులనిద్దరినీ పట్టుకొని, తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. 


అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు, లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కిందపడ్డాడు. కిందపడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు, పైకి కిందకి పడేసారు, అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మణుడితో, ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్యి తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేసాడు.


అప్పుడా విరాధుడు "నేను తపస్సు చేసి బ్రహ్మ నుండి వరం పొందాను. అందువలన నన్ను అస్త్ర శస్త్రములు ఏమి చెయ్యలేవు. నాకు ఇప్పుడు అర్ధమయ్యింది, నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి, నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు అని. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. కాని రంభ అనే అప్సరస మీద ఇష్టమెక్కువ. ఆమెతో గడుపుతూ కుబేరుడి సభకి వెళ్ళలేదు. దానికి ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుందని అడిగాను. నీవు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో, ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్ళి స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాపవిమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పుడ్చేసి సంహరించండి అని అన్నాడు. రాముడు అలాగే చేసి విరాధుడికి శాపవిముక్తి కలిగించాడు.


                                ◆వెంకటేష్ పువ్వాడ.