డైలమా వద్దు.. అడుగు ముందుకే
భగవద్గీతతో విజయవంతమైన కెరీర్ – 2
డైలమా వద్దు.. అడుగు ముందుకే
అర్జునుడు యుద్ధరంగంలో నిలబడ్డాడు. తన చుట్టూ ఉన్న సవాళ్లను గమనించాడు. ఒక్క క్షణం తన ధర్మాన్ని మర్చిపోయేంతగా మానసిక దౌర్బల్యం ఏర్పడింది. ‘సీదన్తి మమ గాత్రాణి – ముఖం చ పరిశుష్యతి – వేపథుశ్చ శరీరే మే – రోమహర్షశ్చ జాయతే – గాండీవం సంస్రతే హస్తా…’ అంటూ తన మానసిక స్థితిని ఏకరవు పెట్టాడు. అవయవాలు పట్టు తప్పుతున్నాయి, నోరు ఎండిపోతోంది, శరీరం వణుకుతోంది, నిలబడటానికి కూడా ఓపిక లేదు, ఆయుధం చేజారుతోంది… అంటూ తన లక్షణాలన్నీ వివరించాడు.
అర్జునుడు సామాన్యుడు కాదు! శివుని సైతం ప్రసన్నం చేసుకున్నవాడు. అందం, ఆరోగ్యం, తెలివి, నైపుణ్యం, బలం… అన్నింటిలోనూ మిన్నగా, పరిపూర్ణమైన మనిషికి ప్రతీకైనవాడు. కానీ వాటితో పాటు ఓ సామాన్య మనిషికి ఉండే భయం, మోహం అతన్ని ఆవరించాయి. అర్జునుడు చెప్పిన లక్షణాలేవీ తనకి మాత్రమే ప్రత్యేకమైనవి కావు. ‘పోరాటమా- పారిపోవడమా’ (fight or flight) అనే సంశయం ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరి శరీరంలోనూ హార్మోనులు చేసే అలజడి ఇది. ఒక పరీక్షను లేదా లక్ష్యాన్ని ఎదుర్కొనే ప్రతి మనిషికీ ప్రతీక అర్జునుడు. పరీక్షలో నెగ్గలేనేమో అనే భయం మనల్ని ముందుగానే ఓడించేస్తుంది. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడాలి, ఇబ్బందిపడాలి అనే నిరాశ కంగారుపెడుతుంది. దానికి లొంగిపోతే… వైఫల్యానికీ, ఎదుగుదల లేని జీవితానికీ సిద్ధపడాల్సిందే!
పరీక్షలకు సిద్ధపడేటప్పుడు లేదా కెరీర్ లో ఏదన్నా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు… రకరకాల మాటలు, అభిప్రాయాలు మనల్ని కుంగదీస్తాయి. ఈ కోర్స్ అంత తేలిక కాదు, ఫలానా పరీక్ష కోసం చాలామంది పోటీ పడుతున్నారు, ఈ వయసులో నువ్వు ఇంత కష్టపడలేవు.. లాంటి భావనలు కలుగుతాయి. పద్మవ్యూహాన్ని సైతం ఛేదించగల అర్జునుడు, కురుక్షేత్రంలో కుప్పకూలిపోయినట్టు… ‘కుదరదేమో’ అన్న అనుమానానికి తావిస్తే సగం పరాజయం ఖరారు అయినట్టే!
అందుకే కృష్ణుడు బోధకు పూనుకున్నాడు. ‘క్లైబం మాస్మగమః పార్థ… క్షుద్రం హృదయం దౌర్బల్యం’- నీలాంటి వీరుడికి పిరికితనం తగదు. నీచమైన ఈ హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టు అంటూ హెచ్చరించాడు. భగవద్గీత చెప్పే మొట్టమొదటి విజయసూత్రం… పిరికితనాన్ని, అనుమానాలను విడిచిపెట్టి లక్ష్యాన్ని ఎక్కుపెట్టమనే!
- నిర్జర