Read more!

భగవద్గీతతో విజయవంతమైన కెరీర్‌ – 1

 

భగవద్గీతతో విజయవంతమైన కెరీర్‌ – 1

 

మనిషి చేయలేనిదంటూ ఏమీ లేదు. సాధించలేనిదీ లేదు. కాకపోతే అనుమానం. తన మీద తనకే అపనమ్మకం. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి… అంటూ అడుగడుగునా సందిగ్ధత. దాన్ని దాటుకుని పని మొదలుపెట్టాక కూడా సంశయమే! తను లక్ష్యాన్ని పూర్తి చేయగలడా, ఫలితం ఆశించి విధంగానే ఉంటుందా. మధ్యలో సమస్య వస్తే ఏం చేయాలి… అంటూ సవాలక్ష ప్రశ్నలు చెదపురుగుల్లా మనసును తొలిచేస్తాయి.

ఇందులో అసహజం ఏమీ లేదు. ఆంజనేయుడు అంతటి వాడే… లంకను చేరుకునేందుకు సంశయించాడు. తన శక్తిని తెలుసుకోలేని శాపం హనుమంతుడికి ఉన్నట్టే, మనిషికి కూడా తన ప్రతిభను ఉపయోగించుకోలేని బలహీనత ఉంది. అందుకు విరుగుడుగా ఎన్నో వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఉన్నాయి. పెద్దల మాటలు, అనుభవజ్ఞుల సలహాలు సరేసరి. అయితే వేల సంవత్సరాలుగా… మనసులో చీకట్లు అలుముకున్నప్పుడు, ఆ అంధకారంలో దారి తోచనప్పుడు భగవద్గీత ఓ ప్రోత్సాహపు మాటగా, వెలుగు బాటగా నిలుస్తూ వచ్చింది. ఆ గీతను ఆధారంగా చేసుకుని ఎలాంటి పరీక్షనైనా ఎదుర్కోనే ఉపాయాలను తెలుసుకునే ప్రయత్నం ఇది!

భగవద్గీత ఇవాల్టిదేమీ కాదు. కాలం అనే పరిధిలో చెప్పుకోవాలంటే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఇది వాడుకలో ఉన్నట్లు చెబుతారు. అప్పటి నుంచీ పదుల తరాలను, ఆ తరంలో చోటు దక్కించుకున్నవాళ్లనీ అది ప్రభావితం చేస్తూనే ఉంది. ‘సంశయాలు నన్ను చుట్టుముట్టినప్పుడు, నిరాశ అలుముకున్నప్పుడు, ఒక్క వెలుగు రేఖ కూడా కనిపించని అంధకారంలో… భగవద్గీతలోని ఏదో ఒక శ్లోకం నన్ను ఊరడిస్తుంది. పెల్లుబికే దుఃఖం మధ్య నాలో చిరునవ్వు రగిలిస్తుంది’ అంటారు గాంధీ. ‘గీతలోని ప్రతి పుటలోనూ స్పష్టంగా కనిపించే సందేశం చురుగ్గా పని చేయడమే. ఆ చురుకుదనం మధ్య అనంతమైన ప్రశాంతత కలిగి ఉండటమే. ఇదే పనిలోని రహస్యం’ అంటారు స్వామి వివేకానంద.

ఇలా భగవద్గీత తమకి చాలా ముఖ్యమైన దార్శనిక గ్రంథం అని చాలామంది ఒప్పుకున్న మాటే! ఆ మాటకు వస్తే గీత అనే మాటకి అద్భుతమైన పర్యాయపదాలు ఉన్నాయి. అది జీవితపు ‘పాట’ కావచ్చు, మంచిచెడుల విచక్షణ సూచించే ‘రేఖ’ కావచ్చు, ప్రోత్సహించే ‘మాట’ కావచ్చు. అందుకే భగవద్గీతను లోకంలోనే తొలి వ్యక్తిత్వ వికాస గ్రంథంగా పేర్కొంటూ ఉంటారు. ఎలాంటి సందర్భానికైనా లోతైన విశ్లేషణ, వివరణ అందిస్తుంది కాబట్టి, గీతను ఉపనిషత్తుగానూ భావించడం కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ఉపనిషత్తుల సారంగానూ వినిపిస్తుంది. అలాంటి అద్భుత గీత నుంచి కెరీర్‌ కు ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!