కుంభ

 

కుంభ రాశి:- (గు, గె, గో, స, సి, సు, సే, సో, దా) 

ఆదాయం : 5, వ్యయం : 2 - రాజపూజ్యం : 5, అవమానం : 4

వీరికి ఈ సంవత్సరము శని ద్వాదశ, జన్మ రాశులలో సంచరించును కావున జాగ్రత్త అవసరము. ఆరోగ్య లోపములు, బంధు వైరములు, గృహచ్ఛిద్రములు బాధించును. వృథా వ్యయములు కలుగును. వ్యవసాయమందు నష్టమెక్కువ. మానసిక అశాంతి అధికముగనుండును. వృథా వాదములకు చోటివ్వరాదు. తేజోహాని, మతిభ్రంశము, భయము కలుగును. మిక్కిలి శ్రమకరముగనుండగలదు. చైత్ర బహుళం నుండి ద్వితీయ గురువు అగుటచే ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్ఠలు, మాట గౌరవము పొందుట జరుగును. ధర్మకార్యముల యందు | ధనవ్యయము కలిగిననూ, ఆత్మ సంతృప్తి కలుగును. చైత్ర బహుళం నుండి తృతీయ రాహువు, భాగ్యకేతువు అయినందున తలచిన కార్యములు నెరవేరును. భ్రాతృద్వేషము, మర్యాదాహాని, పాడిపంటటకు ఇబ్బంది ఒకప్పుడు కలుగును. కొంచెము జాగ్రత్తగా నుండవలయును. శ్రావణ బహుళం నుండి సంవత్సరాంతము వరకు అధిక సమయము అర్ధాష్టమ కుజుడు కనుక ప్రయాణాదుల యందు జాగ్రత్త అవసరము. సాహస కృత్యములు మానవలయును. మొత్తం మీద గురుబలము బాగున్నందున ఇబ్బంది లేదు. ధనిష్ఠ వారికి ఆశ్వయుజ శుక్లం నుండి మార్గశిర శుక్లం వరకు తిరిగి ఫాల్గునమందు జన్మతార యందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక బహుళం నుండి జన్మతార యందు రాహువు సంచరించుదురు. సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ బహుళం వరకు కేతువేధ కలదు. శతతార వారికి జ్యేష్ఠ శుక్లం వరకు నైధనతార యందు రాహువు, ఆశ్వయుజ బహుళం నుండి జన్మతార యందు కేతువు సంచరించుదురు. మరియు కేతువేధ కలదు. పూర్వాభాద్ర వారికి మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు నైధనతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు నైధనతార యందు శని, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించుదురు. కావున ఆయా సమయములందు ఆయా గ్రహములకు శాంతి యొనర్చిన మేలు. ముఖ్యముగా శని, కుజులకు శాంతి యొనర్చిన మేలు. హనుమత్పూజా ప్రదక్షిణములు, సుందరకాండ పారాయణము ద్వారా శ్రేయస్సునందగలరు.