Read more!

క్రోధం ఎక్కువైతే జరిగేది ఇదే!

 

క్రోధం ఎక్కువైతే జరిగేది ఇదే!

మనిషిలో ఎన్నో రకాల లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలలో కోపం, ద్వేషం, ఆవేశం, ప్రేమ, సంతోషం, జాలి, కరుణ ఇలా చాలా ఉన్నాయి. మనిషి మాత్రం ఎక్కువగా కోపానికి, దుఃఖానికి, బాధకు, ప్రేమకు లొంగిపోతున్నాడు. వీటిలో ప్రేమ అనేది మనుషుల మధ్య అపార్థాలు తొలగించి మనుషుల్ని దగ్గర చేస్తే కోపం మాత్రం మనుషుల మధ్య యుద్ధాలే తెచ్చిపెడుతుంది.

"తన కోపమే తన శత్రువు" అన్నారు సుమతీ శతకకర్త. అంటే తన కోపము మనిషికి శత్రువుగా మారి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అర్థం. అలాంటి కోపాన్ని క్రోధం అని కూడా అంటారు. క్రోధం అంటే కోపమే.

క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామాలు ఏంటో భగవద్గీతలో కృష్ణుడు వివరంగా చెప్పాడు. క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామము... మానవుడు తాత్కాలికంగా వివేచనా శక్తి కోల్పోతాడు. విచక్షణ ఉండదు. మంచి చెడు గుర్తించడు. ఎవరిని తిడుతున్నారో ఏం తిడుతున్నాడో చూడడు. నోటికి ఎంతవస్తే అంత అనేస్తాడు. దానినే మోహము అంటారు. అంటే ఆ కోపానికి వశుడు అవుతాడు. ఆవేశానికి లోను అవుతాడు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడు. శంకరుల వారు కోపం వచ్చినవాడి గురించి చెబుతూ "అటువంటి వాడు గురువును కూడా ఆక్షేపిస్తాడు నీకేం తెలుసు అంటాడు. తల్లిని కూడా కొట్టడానికి పోతాడు" అని చెబుతాడు.  ఇక్కడ అటువంటివాడు అంటే క్రోధం లేదా కోపానికి వశం అయిపోయినవాడు. 

ఇటువంటి స్తితికి చేరుకున్నప్పుడు మానవుడికి బాహ్య స్మృతి ఉండదు. ఒకవిధమైన ట్రాన్స్ లో ఉంటాడు. ఊగి పోతుంటాడు. అంటే మంచి చెడు తెలుసుకొనే స్మృతి శక్తి పోతుంది. తన చుట్టూ జరుగుతున్నది ఏంటి అని విషయాలు అతనికి బుర్రలో ఉండవు.  తాను ఎవరితో మాట్లాడుతున్నారో మరిచిపోతాడు. నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాడు. వాడు నా యజమాని, వాడు నా తండ్రి, నా అన్న, నా బంధువు, నా భార్య అనే స్పృహ (జ్ఞాపకం) కూడా ఉండదు. ఎవరినీ లెక్కచేయడు. ఆ బుర్రలో ఉండేది ఒక్కటే అదే కోపం, ఆ కోపంతోనే మనిషిలో అహాంకారం కూడా చేరుతుంది. ఆ స్థితి నుండి మానవుడు ఇంకా దిగజారి తన బుద్ధిని కోల్పోతాడు. ఏది చేయాలి ఏది చేయకూడదు అని నిర్ణయించేది బుద్ధి. ఆ బుద్ధి కూడా పని చేయదు. పక్కకు తొలిగి ఉంటుంది. ఎందుకంటే చెప్పినా వినే స్థితిలో లేడు కాబట్టి.

బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో వాడి పతనం ప్రారంభం అవుతుంది. అప్పుడు మానసిక పతనం శారీరక పతనం కింద మారుతుంది. కొట్టడం తిట్టడం, చంపడం నరకడం లాంటివి చోటుచేసుకుంటాయి. దానితో పోలీసు స్టేషన్లు, జైళ్లు, పరువుబోవడం, అంటే మానవుని పతనం మొదలవుతుంది. ఇదీ సంగంతో మొదలయి తుదకు సర్వనాశన స్థితికి చేరుకున్న మానవుని పతనావస్థ.

                               ◆వెంకటేష్ పువ్వాడ.