Read more!

ఈ రెండు చేయడం వల్ల మనసును జయించవచ్చు!

 

ఈ రెండు చేయడం వల్ల మనసును జయించవచ్చు!

ఎవరైనా ఒక విద్యార్ధి తన సందేహమును గురించి అడిగితే తెలివైన ఉపాధ్యాయుడు అతని సందేహము సరి అయినది అని చెబితే ఆ విద్యార్ధి సంతోషిస్తాడు. తరువాత ఆ సందేహము తీరే ఉపాయమును మెల్లగా బోధిస్తాడు. ఇది ఉత్తముడైన గురువు లక్షణము. అలా కాకుండా విద్యార్థిని "బుర్రలేని వెధవా! ఇంతసేపు చెప్పింది అర్థం కాలేదా! అని నీకు ఎంత చెప్పినా అర్ధం కాదు. నోరుమూసుకొని కూర్చో!" అంటే ఆ విద్యార్థి చిన్నబుచ్చుకుంటాడు. అప్పటిదాకా నేర్చుకున్నది కూడా మర్చిపోతాడు. అందుచేత కృష్ణుడు మొట్టమొదట అర్జునుడు చెప్పినవన్నీ విన్నతరువాత  నీవు చెప్పింది కరెక్టు అందులో ఎటువంటి సందేహము లేదు. ఇది నీ ఒక్కడి సమస్య కాదు. లోకంలో అందరి సమస్య అని చెప్పాడు. ఆ మాటలకు అర్జునుడు సంతోషించాడు. కృష్ణుడు వెంటనే దానికి ఓ చక్కటి ఉపాయం కూడా చెప్పాడు. అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటితో మనసును జయించవచ్చు లోబరచుకోవచ్చు స్వాధీనములో ఉంచుకోవచ్చు అని అన్నాడు.

ఈ మనసు చాలా బలమైనది, ధృడమైనది దానిని కట్టడి చేయడం, అదుపు చేయడం కష్టం అని అర్జునుడి సందేహము. జంతువులలో ధృడమైనది ఏనుగు. కాని దానిని మావటి చిన్న అంశంతో తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. తన ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. సింహము, పెద్దపులి చాలా క్రూరజంతువులు, బలమైనవి. కాని వాటిని ఆడించేవాడు చిన్న చర్నాకోలతో వాటిని కట్టడి చేస్తాడు. అలాగే బలమైన ధృఢమైన మనసు కూడా అభ్యాసము, వైరాగ్యము అనే అంశములతో, చర్నాకోలతో స్వాధీనం అవుతుంది అని పరమాత్మ చెప్పాడు.

ఈ విషయం తెలియక కొంత మంది, తెలిసినా అర్థం కాక మరి కొంతమంది, అర్థం అయినా ఆచరణలో పెట్టడం ఇష్టం లేక చాలా మంది, అర్జునుడు దగ్గర నుండి నేటి పండితులు వరకు "మనసు మన మాట వినదు" అనే నిశ్చయానికి వచ్చారు. దానికి పరమాత్మ చెప్పిన ఉపాయము అయిన అభ్యాస, వైరాగ్యములను ఎవరూ ఆచరించరు. ఈ విషయాన్నే పతంజలి తన యోగశాస్త్రంలో కూడా వివరించాడు. 

"అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః" అంటే అభ్యాస వైరాగ్యములతో మనసును నిరోధించవచ్చు అని. పతంజలి యోగశాస్త్రము, భగవద్గీత ఈ నాటివి. కావు, వేల సంవత్సరముల కిందట రాయబడ్డాయి. కాని ఈ నాటికి కూడా మానవులు అభ్యాస వైరాగ్యములను అనుసరించి మనసును స్వాధీన పరచుకోలేకపోతున్నారు.

వైరాగ్యము అంటే వి రాగము అంటే ప్రాపంచిక విషయముల యందు రాగము అంటే కోరిక, ఆసక్తి లేకుండా ఉండటం, (ఈ రోజుల్లో కోరిక, ఆసక్తి లేకుండా ఎవరుంటారు అని మీకు సందేహం రావచ్చు! కాని, ఇక్కడ కోరిక ఆసక్తి అంటే మితిమీరిన కోరిక, ఆసక్తి అని ఈ నాటికి అన్వయించుకోవచ్చు). ఈ ప్రపంచములో ఉన్న వస్తువులతో, మనుషులతో కలిగే సంగమం వలన మనకు లభించే ఆనందము శాశ్వతమైనది కాదు. అది ఈ రోజు ఉండి రేపు పోతుంది. ఆత్మానందమే శాశ్వతమైన సుఖం అని తెలుసుకోవాలి. ప్రపంచములో ఉన్న అనవసర విషయములలో తలదూర్చకుండా ఉండాలి. అనవసర విషయాల గురించి ఆలోచించడం. అనవసర వస్తువులను సేకరించడం, అనవసర విషయాల గురించి మాట్లాడటం, ఎక్కువగా బాధపడటం మానెయ్యాలి.

                                   ◆ వెంకటేష్ పువ్వాడ.