బ్రహ్మ ముహూర్తానికి,  సరస్వతి దేవికి ఉన్న సంబంధం ఇదే..!

 

బ్రహ్మ ముహూర్తానికి, సరస్వతి దేవికి ఉన్న సంబంధం ఇదే..!


రోజులో కొన్ని సమయాలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వీటిలో ఉదయం, సాయంత్రంకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు,  తరువాత వచ్చే ప్రదోష సమయం ఎంత పవిత్రమైనదో.. ఉదయాన్నే ఇంకా సూర్యుడు ఉదయించకముందే వచ్చే బ్రహ్మ ముహూర్తం అంతకంటే పవిత్రమైనది, శక్తివంతమైనది. బ్రహ్మ ముహూర్తం దేవతలు మేల్కునే సమయం అని కూడా అంటారు.  ఈ సమయంలో చేసే పూజలు,  ధ్యానం,  దైవ ఆరాధన మొదలైనవి సాధారణం కంటే చాలా రెట్లు  మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే బ్రహ్మ ముహూర్తానికి,  సరస్వతి దేవికి సంబంధం ఉందని పురాణ పండితులు చెబుతున్నారు.  ఇంతకూ బ్రహ్మ ముహూర్తానికి, సరస్వతి దేవికి మధ్య ఉన్న సంబందం ఏంటో తెలుసుకుంటే..

సరస్వతి దేవి రోజులో కొంత సమయం ప్రతి ఒక్క జీవి నాలుక పైన నివసిస్తుందట.  ఆ సమయంలో వ్యక్తిలో వాక్కుకు చాలా శక్తి ఉంటుంది.  అలాంటి సమయంలో వ్యక్తి ఏం మాట్లాడినా, ఏ పని చేసినా అది తప్పక జరుగుతుందని అంటారు. అయితే సరస్వతి దేవి నాలుక మీద నివసించే ఆ సమయమే బ్రహ్మ ముహూర్తమని పండితులు చెబుతున్నారు.

బ్రహ్మ ముహూర్తం సాధారణంగా సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందు ఉంటుంది.  అంటే.. 3.30 నుండి 5 లేదా 5.30 వరకు ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తి వాక్కుకు చాలా శక్తి ఉంటుంది.  అందుకే చాలామంది ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడమని చెబుతుంటారు. అంటే చెడు మాటలు మాట్లాడకూడదని అర్థం.

సాధారణంగా పెద్దలు, గురువులు పిల్లలను, లేదా ఏదైనా సాధన చేసేవారిని ఉదయాన్నే 4గంటలకు లేచి చదువుకోమని చెబుతుంటారు. అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకోమని లేదా సాధన చేయమని వారు చెబుతారు.  దీని వల్ల ధారణ శక్తి పెరుగుతుంది.  ఏధైనా చదువుకున్నా, నేర్చుకున్నా చాలా బాగా గుర్తు ఉంటుంది.  అందుకే బ్రహ్మ ముహూర్తాన్ని అందరూ సిఫారసు చేస్తారు.

బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, యోగాభ్యాసం,  మంత్ర జపం, దైవారాదన మొదలైన వాటికి చాలా ఉత్తమంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం, ఇష్టదేవతను స్మరించడం, ధ్యానం చేయడం, మంత్రాలు జపించడం మొదలైనవి వ్యక్తి జీవితంలో చాలా శాంతిని, ప్రశాంతతను చేకూరుస్తాయి.

బ్రహ్మ ముహూర్తానికి ఉన్న శక్తి కారణంగా ఆ సమయంలో నెగిటివ్ గా మాట్లాడటం, ఎవరిని అయినా దూషించడం వంటివి చేయకుండా ఉండటమే కాకుండా.. నెగిటివ్ ఆలోచనలు చేయడం, తమను తాము తక్కువ చేసుకుని మాట్లాడటం వంటివి అస్సలు చేయకూడదు అని అంటున్నారు పురాణ పండితులు. అలా చేస్తే సరస్వతి దేవి ఆగ్రహిస్తుందని అంటున్నారు.  

 అందుకే బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాయి.  పాజిటివ్ ఆలోచనల కోసం దైవారాధన, ధ్యానం, జపం చాలా మంచి ఎంపికలు అవుతాయి. బ్రహ్మ ముహూర్తంలో లేవడం,  సమయాన్ని తగిన విధంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల సరస్వతి అనుగ్రహం పొందవచ్చు.

                           *రూపశ్రీ.