పూరీ రథయాత్రలో రథాలు లాగే తాడు వెనుక ఇంత మర్మం ఉందా...
పూరీ రథయాత్రలో రథాలు లాగే తాడు వెనుక ఇంత మర్మం ఉందా...
జగన్నాథ రథయాత్ర జూన్ 27 నుండి ప్రారంభమైంది. ఈ శుభ సందర్భంగా దేశం, ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రం చేరుకుంటున్నారు. రథయాత్ర సమయంలో, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల భారీ రథాలను తాళ్లతో లాగుతారు. ఈ తాడును తాకడం, లాగడం చాలా శుభప్రదమైనది, పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది. రథం తాడును లాగడం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. అయితే ఈ పవిత్ర తాడు పేరు ఏమిటి? దానిని ఎవరు లాగగలరు? వీటి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే..
రథయాత్ర ఎక్కడికి?
జగన్నాథ రథయాత్రలో భక్తులు రథాన్ని లాగుతారు.. అయితే ఈ ప్రయాణంలో జగన్నాథుడు తన సోదరుడు, సోదరితో కలిసి నగర పర్యటనకు వెళ్లి, భక్తుల ద్వారా తన అత్త ఇల్లు అయిన గుండిచా ఆలయానికి చేరుకుంటాడు. ఈ ప్రయాణం మతపరమైన సంప్రదాయం కాదు. ఇది విశ్వాసం, అంకితభావం, భక్తి కలగలిసిన అద్భుతం అని చెప్పవచ్చు.
రథం లాగడం..
జగన్నాథ రథయాత్రలో మూడు రథాలను లాగడానికి ప్రత్యేక తాళ్లను ఉపయోగిస్తారు. ఈ తాళ్లను తాకడం, లాగడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందని, జీవితంలో ధర్మం, మోక్షం లభిస్తాయని నమ్ముతారు. అయితే భారీ జనసమూహం, భద్రతా ఏర్పాట్ల కారణంగా, ప్రతి ఒక్కరూ తాడును తాకడం అంత సులభం కాదు.
రథాల తాడు పేర్లు ఏమిటి?
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల రథాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అలాగే వాటి రథాలను లాగుతున్న తాళ్లకు కూడా ప్రత్యేక పేర్లు ఉన్నాయి.
జగన్నాథుని 16 చక్రాల రథం పేరు నందిఘోష.. ఈ రథం యొక్క తాడును శంఖచూడ నాడి అంటారు.
బలభద్రుని 14 చక్రాల రథం పేరు తాళధ్వజ.. ఈ రథం యొక్క తాడు పేరు వాసుకి.
సుభద్ర 12 చక్రాల రథం పేరు పద్మధ్వజ.. ఈ రథం యొక్క తాడును స్వర్ణుచుడ నది అంటారు.
ఈ తాళ్లు రథాలను లాగడానికి మాత్రమే కాకుండా, మతపరమైన కోణం నుండి చూస్తే ఇవి చాలా పవిత్రమైనవి, శుభప్రదమైనవి.
రథం తాడును అందరూ ముట్టుకోవచ్చా?
జగన్నాథ రథయాత్ర గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఏ భక్తుడైనా రథం తాడును తాకవచ్చు. ఇందులో ఏ మతం, కులం లేదా సమాజం అనే వివక్షత లేదు. దేవుడి మీద నమ్మకం, విశ్వాసం, భక్తితో పూరీకి చేరుకున్న ఏ భక్తుడైనా ఈ తాడును పట్టుకుని రథాన్ని లాగవచ్చు. రథం యొక్క తాడును లాగడం జగన్నాథుడికి సేవ చేయడంతో సమానమని, ఇది భక్తులకు ప్రత్యేక పుణ్యం, ఆశీర్వాదాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర కార్యంలో తాము కూడా భాగం కావడానికే లక్షలాది మంది ప్రజలు ఇక్కడకు తరలి వస్తారు.
రథం తాడును తాకినా, లాగినా లభించే పుణ్యం ఇదే..
జగన్నాథ రథయాత్రలో రథాల తాడులు తాకినంత మాత్రమే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్మకం. రథయాత్రలో పాల్గొనే భక్తుల ఆత్మ శుద్ది అవుతుందని చెబుతారు. అందుకే జగన్నాథ రథయాత్రలో రథం తాడును తాకడానికి, దానిని లాగడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు.
ఇంకొక విషయం ఏమంటే.. రథాన్ని లాగే తాడును ఆధ్యాత్మిక కోణంలో చూసే విధానం వేరు.. ఆ జగన్నాథుడితో కనెక్ట్ చేసి ఉంచే పవిత్ర మాధ్యమంగా రథం తాడును పరిగణిస్తారు. ఈ కారణంగా జగన్నాథుడి రథాన్ని లాగడం ద్వారా ఆధ్యాత్మిక జీవితం సుసంపన్నం అవుతుందని భావిస్తారు.
*రూపశ్రీ.