Read more!

కోరికలు మనిషికి కలిగించే నష్టానికి ఉదాహరణ!

 

కోరికలు మనిషికి కలిగించే నష్టానికి ఉదాహరణ!

రామాయణంలో ఒక శ్లోకంలో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని, దాని  అర్థాన్ని గురించి  తెలుసుకుంటే…..

'క్రూరైరనార్యైః సౌమిత్రే పరిహాసః కథంచన!”

'క్రూరులతో, అనార్యులతో పరిహాసం ఆడకూడదని లక్ష్మణునితో శూర్పణఖ ఉదంతంలో రాముడు అంటాడు.

ఇది రాముడు వనవాసంలో ఉన్న సమయంలో జరిగే సంఘటన.  అరణ్యంలో నివసిస్తున్న రాముడిని చూసి మోహిస్తుంది శూర్పణఖ. కానీ తాను భార్యతో ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడి వైపు ఆమెని పంపుతాడు రాముడు. తాను సేవకుడు, కాబట్టి తనతో ఉండి లాభం లేదు. 'నువ్వు అందమైన రూపం ధరిస్తే అసహ్యంగా ఉన్న సీతను వదలి నీ వెంట పడతాడు రాముడు' అని శూర్పణఖతో హాస్యంగా అంటాడు లక్ష్మణుడు. 

అతడి మాటలలోని వ్యంగ్యం గ్రహించలేని శూర్పణఖ, 'నిజమే' అనుకుని సీతను చంపబోతుంది. అపుడు ఈ మాటలతో లక్ష్మణుడిని వారించి, నువ్వు హాస్యంగా అన్న మాట ఆమెకు అర్థం కాలేదు అని చెప్పి, ఆమెను వికలాంగిని చేయమని ఆజ్ఞాపిస్తాడు రాముడు.

కోరిక బాహ్యరూపం అందంగా ఉన్నా, దాని అసలు ఫలితం వికృతమే. శూర్పణఖ కోరిక అధర్మం. అందుకే శూర్పణఖ భయంకరమైన రాక్షసి. రాముడు మానవుడు,  ఆ కాలంలో బహుభార్యాత్వం తప్పు కాదు. కానీ మానవుడు రాక్షసిని కూడటం అధర్మం. అయినా సరే, శూర్పణఖని చిన్నబుచ్చకుండా ఆమెను లక్ష్మణుడి వైపు తోశాడు రాముడు. కానీ రాముడి అంత విచక్షణ లేని లక్ష్మణుడు ఆకృతి దాల్చిన కోరిక వంటి శూర్పణఖతో పరిహాసమాడాడు. కోరిక తనను కబళించేందుకు వస్తే, కోరిక ముక్కుచెవులు కోశాడు. కానీ పూర్తిగా జయించక, కొద్దికొద్దిగా దెబ్బ తిన్న కోరిక, తన రాక్షససోదరుల సహాయం కోరింది. వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. శూర్పణఖ గాథ, కోరికను సరైన రీతిలో జయించక, దాంతో పరిహాసమాడితే కలిగే అనర్థాలను ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తుంది. రామాయణంలో సీతమ్మను రావణుడు అపహరించడం అనే పెద్ద సంఘటన, ఆ తరువాత రాముడు వానరుల సహాయం తీసుకుని లంకకు వెళ్లి, అక్కడ  రావణుడిని వధించడం అనేది మొత్తం కేవలం శూర్పణక కోరిక తీరలేదు అన్న కారణం  వల్లనే జరిగింది.

అంటే, వ్యక్తి కోరికతో చెలగాటమాడితే అతని జీవితం అల్లకల్లోలమవుతోందన్న మాట. అందుకే 'యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్ తృష్ణా క్షయ సుఖస్యైతే కలాం నార్హంతి షోడశీం' అంటుంది శాస్త్రం. కామసుఖం, స్వర్గలోకంలో కలిగే దివ్యసుఖం కూడా తృష్ణాక్షయం వల్ల కలిగే సుఖంలో పదహారో వంతు కూడా కావు అన్నమాట. అంటే అన్ని సుఖాల కన్నా గొప్ప సుఖం కోరికలను నశింపజేసుకోవటం వల్ల కలిగే సుఖం వల్ల కలుగుతుందన్నమాట. మిగతా సుఖాలన్నీ కోరికల నాశనం వల్ల కలిగే సుఖం ముందు దిగదుడుపేనన్న మాట.

కేవలం లైంగికభావనలను అదుపులో పెట్టుకోవటం మాత్రమే కాదని,

 'యదా భావం న కురుతే సర్వ భూతేషు పాపకమ్। 

కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యత్ తదా॥' 


(సర్వభూతాలపై మనసా వాచా కర్మణా పాపాలోచన చేయని జీవుడు బ్రహ్మ అవుతాడు) 

ఎటువంటి మోహం లేక, త్రికరణశుద్ధిగా ఏ విషయం గురించి చెడు ఆలోచన చేయకపోవటం బ్రహ్మచర్యం. కోరికలు రావటం తప్పు కాదు. కోరికలు తీర్చుకోవటం వల్ల కోరికలు తీరవు. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి.

                                   ◆నిశ్శబ్ద.