Read more!

హనుమ, అంగదుని పరాక్రమం!

 

హనుమ, అంగదుని పరాక్రమం!

రామలక్ష్మణులను కాపాడిన తరువాత గరుగ్మంతుడు "నాయనా రామ। ఇకమీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ  సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశములను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది" అన్నాడు.

అప్పుడు రాముడు "మీరు ఎవరు?" అని అడిగాడు.

గరుగ్మంతుడు అన్నాడు "నేను గరుగ్మంతుడిని, నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్దికాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించు రామ" అన్నాడు.

అప్పుడు రాముడు "చాలా సంతోషం, మీరు వెళ్ళండి" అన్నాడు గరుత్మంతుడితో.

గరుగ్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుండి వెళ్ళిపోయాడు.

రెట్టింపు ఉత్సహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు. కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు. పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి "ఏమి జరిగిందో చూడండి" అన్నాడు.

 అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి, రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణులిద్దరు నిలబడి ఉన్నారు. వారు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యపోయాడు తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు. 

అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి "నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా, నీకన్నా బంధువు నాకు లేడు. సువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి. నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు" అన్నాడు.

రావణుడు చెప్పగానే ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారంగుండా బయటకి వెళ్ళాడు. ఆయన అలా బయటకి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుండి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునములు కనపడినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు.

ఆ ధూమ్రాక్షుడు తన  బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుండి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. నుజ్జునుజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.

తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారంగుండా బయటకి వచ్చాడు. ఆ వజ్రదంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి. అన్ని మృగాలు ఏడిచాయి. ఆ వజ్రదంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వాసరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంష్ట్రుడిని కొట్టబోయాడు. కాని ఆ వృక్షాన్ని తన బాణములతో వజ్రదంష్ట్రుడు సరిచేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళీ అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్రదంష్ట్రుడు మరణించాడు.

ఇలా హనుమ, అంగదుల చేతిలో రావణుడి ఇద్దరు వీరులు మరణించారు.


                                                   ◆నిశ్శబ్ద.