Read more!

రామలక్ష్మణులను కాపాడిన గరుత్మంతుడు!

 

రామలక్ష్మణులను కాపాడిన గరుత్మంతుడు!

త్రిజట సీతమ్మను ఓదార్చగానే ఆ పుష్పక విమానాన్ని ఆశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు. ఆ వెంటనే రాముడు మెల్లగా కళ్ళుతెరచి ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూపి ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఏ లోకములోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు. కాని లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, (కార్యవీర్యార్జునుడు ఒకసారి రావణుడిని ఓడించి చెరసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు" అని రాముడు బాధపడ్డాడు.

ఆ తరువాత సుగ్రీవుడిని పిలిచి 'సుగ్రీవ! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను" అన్నాడు. 

అప్పుడు సుగ్రీవుడు "విభీషణ! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు. ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో" అన్నాడు.

అప్పుడు సుషేణుడు "పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళీ జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మనదగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఓషధులని గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొని వచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాశం ఉంటుంది" అన్నాడు. 

సుషేణుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిదీ ఈ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు అల్లారుస్తూ ఒక మహా స్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుగ్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. 

అప్పటివరకూ రామలక్ష్మణులని గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుత్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుగ్మంతుడు వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు. గరుగ్మంతుడు అలా కౌగాలించుకోగానే, ఇంతకుముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమము ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి. అలా గరుత్మంతుడు ఆపద్భాంధవుడిలా రామలక్ష్మణులను కాపాడాడు.


                                    ◆నిశ్శబ్ద.