Read more!

రావణుడికి ఉన్న శాపాలు ఏమిటి?

 

రావణుడికి ఉన్న శాపాలు ఏమిటి?

రథం నుండి తూలి భూమి మీదకు పడిపోయిన రావణుడిని చూసి రాముడు "భయంకరమైన యుద్ధం చేశావు రావణా, నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి. నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతుంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పొ" అన్నాడు.

రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని "గరుగ్మంతుడు పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవ్వాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి, నన్ను కొట్టి, చంపకుండా వదిలేసి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళి స్వస్తతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా. చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు..

ఒకనాడు బ్రహ్మగారు నాతో నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు అన్నారు. ఆయన మాట యదార్ధమవుతోంది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను. కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు (రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు ఒరేయ్ రాక్షసుడా మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు. ఆయన నిన్ను సంహరిస్తాడు అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు. 

ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి "స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు" అని శపించింది. బహుశా ఆ వేదవతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందిరా, నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాశ పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు (నందీశ్వరుడిని చూసి రావణుడు కోతి ముఖంవాడ అని హేళన చేశాడు. ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.

అయినా నేను దేవ దానవులని ఓడించినవాడిని, నేను ఎవరికీ భయపడను, సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగ కోట బురుజులు ఎక్కండి, ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వారు రావాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఇంక మామూలు వారు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు, వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం, వాడు లేస్తే రాముడు ఎంత. వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి"  అన్నాడు.

                                         ◆నిశ్శబ్ద.