Read more!

మనిషి వ్యావెూహం ఎలా ఉంటుందో తెలిపే కథ!

 

మనిషి వ్యావెూహం ఎలా ఉంటుందో తెలిపే కథ!

వ్యామోహం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. జీవితంలో కొన్ని విషయాల మీద చెప్పలేనంత ఆశ పెంచుకుంటూ ఉంటారు. పదే పదే దాని గురించే ఆలోచిస్తూ వుంటారు. ఇలా ఆలోచించడం వల్ల మనిషి మనసు ప్రస్తుత విషయాల మీద, ప్రస్తుత సంతోషాల మీద కాకుండా వేరే వ్యామోహం ఉన్న విషయాల మీదనే ఉంటుంది. అలాంటి వ్యామోహం గురించి వివరంగా తెలిపే కథ ఇది.

ఓ రాజ్యంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను రాజభవనం దగ్గరలోనే ఉంటూ రోజూ, ఆ భవనం లోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు అందరికీ విందు ఇస్తున్నారు అనేవార్త విన్నాడు. విందు మాట వినగానే బిచ్చగాడికి తనూ వెళ్తే అనే ఒక ఆశ పుట్టింది. అయితే తన దుస్తులు చూసుకున్నాడు అన్నీ చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు. రాజభవనము దగ్గరికి వెళ్లి కాపలా వాళ్ళని చాలా బతిమి లాడి, ఎంతో ధైర్యం కూడగట్టుకొని, వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు.

అతన్ని చూడగానే రాజు ”నీకేమి కావాలి” అని అడిగాడు. దానికి ఆ బిచ్చగాడు రాజుగారికి వినయంగా నమస్కారం చేసి  ”రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. కానీ నా దగ్గర మంచి బట్టలు లేవు. అందుకే దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను.” అన్నాడు.

 రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ ”ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు, ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యెెకమైనవి. నువ్వు ఎప్పటికి వీటిని ధరించవచ్చు” అన్నాడు.

బిచ్చగాడి కళ్ళ వెంట నీరురాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు. ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని వేసుకుని అద్దములో చూసుకొని మురిసిపోయాడు. అయితే రాజుగారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజుగారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది. ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తన వెంట తెచ్చుకునేవాడు. రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపూ ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారేస్తారేమో అని భయం. క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు, కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారం తో ఆ మూటను అస్సలు వదిలేవాడుకాదు. 

తోటివారు అతన్ని చూసి, హేళన చేస్తూ, పీలిక గుడ్డల మనిషి అని పేరుపెట్టారు. చివరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండి మంచంపై నుండి లేవలేక పోయేపరిస్థితిలో పక్కనున్న జనాలు పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి కాడుకుంటూ ఉండటం కోసమే జీవితం అంతా గడిపి, ఏ రోజూ సంతోషాన్ని పొందలేదు కదా! అని బాధపడ్డారు.

ఇది కేవలం ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా మోస్తూ ఉంటాము. ఎన్నో జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభవించలేము, ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, అశాంతికి కారణము. అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉంటూ పాతబడ్డ చెడు జ్ఞాపకాలు విడిచిపెడితే జీవితం ఆనందంగా ఉంటుంది. ధనం ఒక్కటే నిజమైన శక్తికాదు. మన మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి.

                                      ◆నిశ్శబ్ద.