Read more!

భారతీయ ధర్మం ఎలా గాడి తప్పింది?

 

భారతీయ ధర్మం ఎలా గాడి తప్పింది?

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః॥ . సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్।। 

ప్రశాంతాత్మా విగతభీ: బ్రహ్మచారి ప్రతే స్థితః౹ 

మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః౹౹

'నడుమును, మెడను, శిరాన్ని వంగక చలింపక స్థిరంగా ఉంచి, దిక్కులు చూడక ముక్కు కొనపై దృష్టి నిలిపి నాపై మనస్సు నిలిపి, భయం వదలి, బ్రహ్మచర్య వ్రతం అవలంబించి శాంతచిత్తంతో ధ్యానం చేయాలి. ధ్యానానికి శ్రీకృష్ణుడు విధించిన నియమాలివి. 

'స్థిరసుఖమాసనమ్' అంటుంది పతంజలి యోగసూత్రం. అంటే స్థిరంగా, సుఖంగా కూచోవటం 'ఆసనం' అన్నమాట. ఈ స్థిరంగా, సుఖంగా కూచోవటం అంటే ఏమిటో భగవద్గీత విపులీకరిస్తుంది. నడుము, మెడ, శిరస్సు వంగకూడదు. చలించకూడదు. స్థిరంగా ఉండాలి. ఇవి స్థిరంగా ఉండాలంటే భౌతికంగా శారీరకస్వస్థతనిచ్చే 'యోగాసనాలు' దారి చూపిస్తాయి.

ప్రపంచమంతా ఈశ్వరమయం. కాబట్టి తనలోనే కాదు, ప్రతి వాడిలోనూ, ప్రతి అణువులోనూ భగవంతుడున్నాడన్నమాట. ప్రపంచమంతా భగవంతుడిమయం అయినప్పుడు, తానూ భగవంతుడిలో భాగమైనప్పుడు, ప్రపంచమంతా తనదే అవుతుంది. ఇక తన దాన్నే తాను దొంగిలించటం, తన దానికే తాను ఆశపడటం అన్నది అర్థం లేని విషయం. ఈ రకంగా భగవంతుడి భావనను నిత్యజీవితంలో ధర్మానికి ముడిపెట్టి భగవదారాధనను జీవన విధానం చేశారు. దాంతో అడుగడుగునా వ్యక్తిలో ఓ పవిత్ర భావన జనిస్తుంది. తన పట్ల, తన శరీరం పట్లనే కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల కూడా ఈ పవిత్రభావన విస్తరిస్తుంది.

శారీరక స్వస్థతనిచ్చే యోగాసనాలను కూడా భగవద్భావనతో మిళితం చేయటం సూర్యనమస్కారాలలో కనిపిస్తుంది. సూర్యనమస్కారాలు, సూర్యోదయవేళలో కానీ సూర్యాస్తమయంలో కానీ చేయాలి. సూర్యుడిని ఉద్దేశిస్తూ బీజాక్షర సంపుటితో కూడిన సూర్యనమస్కారాల మంత్రాన్ని జపిస్తూ చేయాలి సూర్యనమస్కారాలు. అంటే దేవాలయం లాంటి శరీరాన్ని శుభ్రంగా ఉంచి, దారుడ్యంగా, ఆరోగ్యంగా ఉంచటం కూడా దైవకార్యమేనన్న మాట. బీజాక్షరపూరిత మంత్రపఠనం వల్ల శారీరకంగా, మానసికంగా, అంతర్గతంగా, యోగపరంగా లాభాలున్నాయి. 

సూర్యనమస్కారాలలోని పన్నెండు భంగిమల వల్ల శరీరం అంతర్భాగాలలో చక్కటి కదలికలు కలుగుతాయి. వీటి వల్ల గ్రంధులన్నీ చైతన్యవంతమౌతాయి. వెన్నముక స్థిరమౌతుంది. శారీరక స్వస్థత సాధించటంతోటే వ్యక్తికి తనకు తెలియకుండానే తనపై విశ్వాసం పెరుగుతుంది. 

ఇక్కడే మనం యువతలో పాతుకొని ఉన్న కొన్ని అపోహలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం సమాజం 'బ్రెయిన్' ఎలా 'వాష్' చేయబడిందో తెలుసుకోవాల్సి ఉంటుంది.

ప్రతివారూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. శక్తిమంతులవ్వాలని కోరుకుంటారు. తనవారిని, దేశాన్ని తన బాహుబలంతో రక్షించాలని ఉవ్విళ్లూరుతారు. అందుకే ఏ దేశంలో, ఏ సంస్కృతిలోనైనా 'శక్తి'ని, శక్తిమంతులను ఆరాధించటం, ఆదర్శంగా తీసుకోవటం కనిపిస్తుంది. హెర్క్యులెస్, అలెగ్జాండర్, జూలియస్ సీజర్, కింగ్ ఆర్థర్ ఇలా పాశ్చాత్యులు శక్తిమంతులకు పెద్దపీట వేసి వారిని ఆదర్శం చేసుకొన్నారు.

మన పూర్వికులు సైతం మనకు రాముడు, భీముడు, హనుమంతుడు, అర్జునుడు, పృథువు, వంటివారిని ఆదర్శంగా నిలిపారు. రాణా ప్రతాప్, శివాజీ, విక్రమార్కుడు, చంద్రగుప్తుడు, కృష్ణదేవరాయల వంటివారు మనకు ఆరాధ్యులు. అయితే పాశ్చాత్య ఆదర్శాలకు, మన ఆదర్శానికి తేడా అల్లా మనం కేవలం శక్తిమంతులవటమే ఆదర్శంగా ఎంచుకునేందుకు అర్హతగా భావించ లేదు. అలాగైతే రావణుడు, బకాసురుడు, జరాసంధుడు, వంటివారు కూడా శక్తిమంతులే. కానీ తనకున్న శక్తికి ధర్మపాలన తోడైతేనే వ్యక్తి 'ఆదర్శం'గా నిలుస్తాడు. గమనిస్తే మనకు పూజనీయులైన శంకరాచార్యులు, రామానుజాచార్యుల వంటివారు ఆధ్యాత్మికతలో నిష్ణాతులైనా శారీరకస్వాస్థ్యంలో ఎవరికీ తీసిపోరు. కాబట్టి ప్రారంభం నుంచీ మనం విచక్షణతో కూడిన విజ్ఞానార్జన, ధర్మంతో కూడిన బలాన్ని 'ఆదర్శంగా తీసుకున్నామన్నమాట.

కానీ పాశ్చాత్యుల ప్రభావంతో ఈ ఆదర్శస్వరూపం మారింది. బలహీనతను ఆరాధించటం ఆరంభమైంది. ఎపుడైతే కాళిదాసు నాటకాల కన్నా గ్రీకు ట్రాజెడీలపై మోజు పెరిగిందో, అపుడే మన ఆదర్శాలలో బలహీనత ప్రవేశించటం ఆరంభమైంది. నాయకుడు బలహీనుడై, కష్టాలకు కుంగి తాగుబోతై ఆత్మహత్య చేసుకుంటే మరీ మంచిది. 'దేవదాసు' వంటి బలహీనమనస్కుడు, ఎందుకూ పనికిరానివాడు తరతరాలుగా యువతీయువకుల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు. పైగా 'హీరో' అన్నవాడు నాజూకుగా ఉండాలి. వంగి నిలబడాలి అన్న అభిప్రాయం సమాజంలో బలపడటంతో సమాజం వెన్నెముక మొత్తంగా వంగిపోవటం ఆరంభమైంది. దీనికి బీజం ఎప్పుడో పడింది. ఆ కాలంలోనే ఇది గమనించిన వివేకానంద, దేశవ్యక్తిత్వాన్ని ఉత్తేజితం చేసేందుకు 'ఉక్కు నరాలు' కల యువత కావాలని గర్జించాడు. కానీ ఆ తరువాత రంగప్రవేశం చేసిన సినిమాలు ఉక్కు నరాలను తుక్కు నరాలు చేశాయి. ఇలా భారతీయ ధర్మం మార్పుకు లోనయ్యింది.

                                   ◆నిశ్శబ్ద.