హనుమంతుడి శక్తి నాలుగు యుగాలలో ఉందా...

 

 హనుమంతుడి శక్తి నాలుగు యుగాలలో ఉందా...
 


జీవితంలో కష్టాలు తలెత్తినప్పుడల్లా లేదా సంక్షోభ  సమయం వచ్చినప్పుడల్లా చాలా మంది ఆంజనేయస్వామిని ప్రార్థిస్తారు.  పిల్లలు భయపడినా,  పిల్లలకు జ్వరం వచ్చినా,  జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా అన్నింటికి హనుమంతుడిని ఆరాధించడం ఎక్కువ మంది చేసే పని.   హనుమంతుడిని ప్రార్థిస్తే ధైర్యం వస్తుంది.  భయం తొలగిపోతుంది.  కష్టాలకు ఎదురు నిలబడతాము.  మనసులో ఒక కొత్త ఉత్సాహం,  ఆత్మవిశ్వాసం ఏర్పడతాయి.  హనుమంతుడు త్రేతాయుగంలో జన్మించాడని చెబుతారు.  అయితే హనుమంతుని కీర్తి మాత్రం నాలుగు యుగాలలోనూ విస్తరించి ఉంది. "నీ కీర్తి నాలుగు యుగాలలోనూ ఉంది" అని ఎందుకు హనుమంతుడిని ప్రస్తావిస్తూ అంటూ ఉంటారు.  దీని వెనుక ఉన్న నిజం ఏంటి?  సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు  కలియుగం అనే నాలుగు యుగాలు ఉన్నాయి. త్రేతాయుగంలో జన్మించిన హనుమంతుడు అన్ని యుగాలలో ఎలా ఉన్నాడు. దీని గురించి రహస్యం తెలుసుకుంటే..

హనుమంతుడు కేవలం రామ భక్తుడు కాదు.. హనుమంతుడికి అమరత్వం లభించింది.  హనుమంతుడు చిరంజీవి.  చిరంజీవి అంటే మరణం లేని వాడు.  ఎప్పటికీ జీవించి ఉండేవాడు అని అర్థం. త్రేతాయుగంలో హనుమంతుడు రాముడికే తన సేవను అంకితం చేశాడు. కానీ త్రేతాయుగం ముగిసినా హనుమంతుడు మాత్రం జీవించే ఉన్నాడు.

ద్వాపరయుగం..

హనుమంతుడు  మహాభారతం సమయంలో ద్వాపర యుగంలో కూడా ఉన్నాడు. అర్జునుడు తన పరాక్రమానికి గర్వపడినప్పుడు, హనుమంతుడు అతని అహాన్ని పోగొట్టాడు.  కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు అర్జునుడిని రక్షించడానికి అర్జునుడి  రథం పైన జెండాపై కూర్చున్నాడు. అంటే త్రేతాయుగం  తర్వాత కూడా ఆయన రహస్యంగా తన లీలలను ప్రదర్శిస్తూనే ఉన్నాడు.  ఇప్పుడు కలియుగం గురించి మాట్లాడుకుంటే హనుమంతుడి అనుగ్రహాన్ని పొందగలిగే యుగం ఇది.

కలియుగం..

కలియుగంలో యజ్ఞ శక్తి గానీ, తీవ్రమైన తపస్సు గానీ లేవు కానీ రాముడి నామాన్ని, హనుమంతుడి భక్తిని గుర్తుంచుకోవడం చాలా ఫలాలు ఇస్తుంది. హనుమంతుడి  ఉనికి నేటికీ దేవాలయాలలో, మంత్రాలలో, చాలీసాలోని ప్రతి పదంలో  నిక్షిప్తమై ఉంది. కష్ట సమయాల్లో ఎవరైనా "జై బజరంగబలి" అని పిలిచినప్పుడు వారికి తెలియకుండానే కష్టం నుండి బయటపడే మార్గం దొరుకుతుంది.

ఈ కారణంగానే హనుమంతుడి మహిమ నాలుగు యుగాలలో కూడా ఉంటుందని అంటారు. హనుమంతుడి కీర్తి, బలం, భక్తి, కృప ఏ ఒక్క యుగంతో పరిమితం కాలేదు. అవి కాలాతీతమైనవి, యుగయుగాలుగా ఉనికిలో ఉన్నాయి. ఆయన రామ భక్తుడు మాత్రమే కాదు, ఎక్కడ విశ్వాసం ఉంటుందో, ఎక్కడ సేవ ఉంటుందో, ఎక్కడ నిజమైన పిలుపు ఉంటుందో అక్కడ ప్రతి హృదయంలో ఆయన నివసిస్తారు. కాబట్టి అది సత్య యుగమైనా లేదా నేటి కలియుగమైనా, హనుమంతుడి శక్తి ప్రతి యుగంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.  భక్తి ఉన్నంత వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.