Read more!

హనుమాన్‌ జయంతి ఎంత ప్రత్యేకమో!

 

హనుమాన్‌ జయంతి ఎంత ప్రత్యేకమో!


ఒకసారి లక్ష్మీదేవి మానవరూపంలో, రాజకుమారిగా జన్మించింది. ఆమెకు వివాహం జరిపించేందుకు రాజుగారు స్వయంవరాన్ని ప్రకటించారు. ఆ స్వయంవరం ద్వారా ఆమెను వరించాలనుకున్నాడు విష్ణుమూర్తి. అయితే అదే సమయంలో… ఆ రాకుమారి అందాన్ని చూసి మోహించిన నారదుడు, ఎలాగైనా ఆమెను పొందాలనుకున్నాడు. ఈ లోకంలోకెల్లా విష్ణుమూర్తే అందగాడు కాబట్టి, అతిన్ని పోలిన రూపంలో స్వయంవరంలో నిలబడ్డాడు. కానీ ఆశ్చర్యం! చూసేవారందరికీ అతనిది కోతిమొహంలా కనిపించింది.
 

ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకున్న నారదుడు ఉగ్రుడైపోయాడు. ఏ కోతిరూపంలో అయితే తనని అవమానించాడో… అదే కోతుల సాయం చేయడం వల్లే విష్ణువు విజయాన్ని సాధిస్తాడంటూ శపించాడు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే! విష్ణువు, రాముని అవతారంలో ఆంజనేయాది వానర సైన్యం కారణంగానే తన సతి సీతను దక్కించుకోగలిగాడు.
 

హనుమంతుని జననం వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి! అంజన అనే అస్పరస, కేసరి అనే మహనీయులకు జన్మించినవాడే ఆంజనేయుడు. అంజనాదేవి సాక్షాత్తు ఆ శివుడే తనకు బిడ్డగా జన్మించాలని కోరుకుందట. దాంతో ఆయన అంశతో ఉద్భవించాడు హనుమ. మరో ఐతిహ్యం ప్రకారం… ఆయన జననంలో వాయుదేవుని మహిమ కూడా ఉంది. అందుకనే తనకి పవనసుతుడనే పేరు వచ్చింది.
 

ఆంజనేయుని జననం వెనుక ఎన్నిరకాల గాథలు ఉన్నాయో… వాటిని జరుపుకొనేందుకు కూడా అన్ని రకాల తిథులు ఉన్నాయి. ఉత్తరాదిలో, తెలుగునాట, తమిళనాట… ఇలా ఒకోచోట ఒకో సమయంలో ఈ జయంతిని నిర్వహిస్తారు. తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఈ పండుగ వైశాఖ కృష్ణ దశమి నాడు అంటే ఈ ఏడాది జూన్‌ 4న వచ్చింది. కొందరు ఈ హనుమాన్‌ జయంతిని 41 రోజుల వ్రతంగా ఆచరిస్తారు. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ కృష్ణ దశమి వరకూ ఓ 41 రోజుల పాటు హనుమంతుని సేవిస్తూ… మద్యం, మాంసాహారాల జోలికి పోకుండా, కాలికి చెప్పులు లేకుండా, సింధూరవర్ణ దుస్తులు ధరించి నిష్టగా పాటిస్తారు. 

ఇక ఈ హనుమాన్‌ జయంతిని నిర్వహించుకునేందుకు భక్తే ప్రధానం. కొందరు చాలీసా చదువుతారు. మరికొందరు రామాయణం, సుందరకాండ లాంటివి పఠిస్తారు. ఈరోజు కోతులకు నైవేద్యం పెడితే ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని ఓ నమ్మకం. ఇక గుడిలో నెయ్యి దీపాలు వెలిగించి, ఆ స్వామి విగ్రహానికి సింధూరాన్ని రాస్తే… విశేష ఫలితం ఉంటుంది. ఆంజనేయునికి అప్పాలు అంటే ఇష్టం. అందుకని ఈనాడు అప్పాలు చేసి ఆ స్వామికి నివేదించడం కానీ, ఆయన మెడలో మాలగా వేయడం కానీ చేస్తే… మన మనసు కరిగిపోతుంది.
 

ఆంజనేయుడు అమితబలవంతుడు. భక్తునిగా, సేవకునిగా, ఆలోచనాపరునిగా, నిష్టాగరిష్టునిగా, వినయవంతునిగా, యోధునిగా, కార్యసాధకునిగా… పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతినిధిగా నిలిచే చిరంజీవి. అందుకే సాక్షాత్తు ఆ రాముడు సైతం ఆయన సాయంతోనే విజయాన్ని అందుకున్నాడు. అలాంటిది మనుషులమైనన మనం, ఆయన శరణు వేడితే చెప్పేదేముంది! ఎలాంటి కష్టాన్నయినా, ఎంతటి సమస్యనైననా చిటికెలో తీర్చేస్తాడు. జీవితంలో ఎదుయ్యే ప్రతి భయాన్నీ, ప్రతి సంకటాన్నీ ఇట్టే మాయం చేసేస్తాడు!

- మణి