Read more!

నవరాత్రి సమ్మోహనం - బాలా త్రిపుర సుందరి

 

నవరాత్రి సమ్మోహనం - బాలా త్రిపుర సుందరి

హిందు సంప్రదాయంలో పండుగలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ ఎంతో భక్తిగా, అంతకు మించి సంబరంగా చేసుకునే దుర్గా నవరాత్రులు వచ్చేసాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి, నవమి వరకు జరిగే నవరాత్రులలో అమ్మవారి స్మరణ మార్మోగిపోతుంది. శరత్కాలంలో వచ్చిన పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అని పిలుస్తారని పెద్దల మాట.

దుర్గా నవరాత్రులు, దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఇలా పేర్లు ఎన్నైనా అన్నీ తొమ్మిదిరోజుల భక్తిపారవశ్యాన్ని నింపుకున్నవే.

ఈ నవరాత్రులలో ఒకో రోజు ఒకో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటిరోజు బాలికగా బాలా త్రిపుర సుందరిగా కొన్ని ప్రాంతాల్లోనూ, శైల పుత్రిగా మరికొన్ని ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది. ఆకట్టుకునే మోముతో ముద్దుగారే బాలికగా లోక కల్యాణం కోసం అవతరించిన బాలా త్రిపుర సుందరి మనిషి శరీరంలో ఉన్న జాగృత, స్వప్న, శుషుప్తి గణాలకు అధిదేవతగా పేర్కొంటారు. అంటే మనిషి ఈ మూడు స్థితులలోనే జీవిస్తుంటాడు. అలాంటి మూడు స్థితులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగేది త్రిపుర సుందరి దేవి.

బాలా త్రిపుర సుందరి అవతారం వెనుక ఒక కథ ఉంది. భాండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి ముప్పయి మంది పిల్లలు.  వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను, దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారు. అప్పుడే లలితా దేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళను సంహరించడానికి హంసలు లాగుతున్న రథంపైన బయలుదేరి వెళ్లి వాళ్ళను అంతం చేస్తుంది. వాళ్ళను సంహరించడానికి బాలా త్రిపుర సుందరికి లలితా దేవి తన ఆయుధాలను ఇచ్చి పంపుతుంది.

 నవరాత్రి మొదటి రోజున  బాలా త్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇదీ. 

అయితే ప్రతి మనిషి బాల్యంతోనే మొదలవుతుంది. అలాగే అమ్మవారు తన బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ మంచివాళ్లను కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తూ ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు.

పాడ్యమి రోజున చిన్న పిల్లలను బలాత్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా చూస్తారు.  ప్రాణ శక్తిని, మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరిని పూజించడంగా కూడా భావిస్తారు. ఈ ప్రాణ శక్తి, మూలాధార శక్తులు మనిషి స్థితిని ఉన్నతంగా నిలబెట్టేవి. కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది.

శ్రీ బాలాత్రిపురసుందరీ  మంత్రం:-

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే

కామేశ్వర్యై చ ధీమహి

తన్నోబాలా ప్రచోదయాత్.

అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.

◆అలాగే స్వర్ణకవచాలంకృత అమ్మవారుగా శ్రీశైలంలో, విజయవాడలో దర్శనమిస్తుంది. 

విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు.

శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే! యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్.

ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని ఈ సమస్త భూమండలాన్ని కాపాడు! అని.

ఇలా వేసుకుంటే అమ్మ కరుణించదా మరి.

◆ వెంకటేష్ పువ్వాడ