Read more!

సృష్టిలో అధ్యక్షుడి పాత్ర??

 

సృష్టిలో అధ్యక్షుడి పాత్ర??

 


మనిషి తన జీవితంలో కాలంతో పాటు ముందుకు వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఎన్నో తెలుసుకుంటూ ఉంటాడు. ఒకసారి విన్నది అప్పటికి ఎంతో ఉత్తమంగా అనిపిస్తుంది. కానీ ఆ తరువాత కాస్త ఆలోచనా పరిణితి పెరిగిన తరువాత అంతకు ముందు విన్నది అర్థం లేనిధిగా అనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది ఇది సహజమే కదా అని అందరికీ అనిపిస్తుంది. కానీ ఇలా మార్పులకు లోనవుతూ సాగిపోయి ఎప్పుడో ముసలి వయసు వచ్చాక కానీ మనిషి దేవుడి గురించి పూర్తిగా విశ్వాసం బయట పెట్టలేకపోతున్నాడు. ఇక్కడ విశ్వాసం అంటే ఊరికే ఎవరో చెప్పారని, ఎక్కడో చదివామని నమ్మేయడం కానే కాదు.  మొదట భక్తి, తరువాత పూజ, ఆ తరువాత ఆలోచన, ఆ తరువాత ధ్యానం. ఇలా ఒకో మెట్టు ఎక్కుతూ చివరకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకు దూరమయ్యి మనసును నిశ్చలంగా ఉంచుకుని ఆ నిశ్చలత్వంలో ఆ భగవంతుడిని ప్రతిష్టించుకోవడం.


ఒక సభలో అధ్యక్షుడు సభను నడిపిస్తాడు. వక్తలు మాట్లాడతారు. సన్మానాలు సత్కారాలు జరుగుతుంటాయి. జరగవలసిన కార్యక్రమాలను, ఒకదాని తరువాత ఒకటిగా అధ్యక్షుడు చెబుతుంటాడు. కార్యనిర్వాహకులు చేస్తుంటారు. వక్తలు మాట్లాడే మాటలకు, కార్యనిర్వాహకులు చేసే పనులకు అధ్యక్షుడికి ఎటువంటి సంబంధము లేదు. అవి ఆ అధ్యక్షుడి జీవితానికి సంబంధించినవేం కాదు. అలాగే పరమాత్మ ఈ సృష్టి అనే సభకు అధ్యక్షుడు, ప్రకృతి అనే కార్యనిర్వాహకుడు సృష్టిని సాగిస్తున్నాడు. పోషిస్తున్నాడు. లయం చేస్తున్నాడు. అధ్యక్షుడు అయిన పరమాత్మ కేవలం సాక్షిగా చూస్తున్నాడు. ఈ ప్రకృతిలోని అవ్యక్తములన్నీ కొన్ని కలవడం వలన వ్యక్తమవుతున్నాయి. కొంత కాలం వివిధ రూపాలలో ఉంటాయి. మరలా విడిపోవడం వలన అవ్యక్తంగా మారి పోతున్నాయి, మరలా కలుసుకుంటూ వ్యక్తము అవుతున్నాయి. ఈ వ్యక్త అవ్యక్త కార్యక్రాలను సృష్టి స్థితి లయము అని అంటారు. ఈ కలయికలు, విడిపోవడాలు, అవ్యక్త, వ్యక్త అవస్థలు అన్నీ పరమాత్మ అధ్యక్ష స్థానంలో ఉండి, కేవలం సాక్షిగా చూస్తున్నాడు.


ఇక్కడ ఇంకొకవిషయం కూడా ఉంది. అందరు వక్తలు వచ్చినా, కార్యనిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినా అధ్యక్షుడు రానిదే సభ జరగదు. అలాగే ఈ ప్రకృతిలో చైతన్యం రావాలంటే పరమాత్మ అందులో ప్రవేశించాలి. అప్పుడే చైతన్య వంతం అవుతుంది. ఆ చైతన్యమే అందరినీ నడిపిస్తుంది. సృష్టి, స్థితి, లయములను నిర్వహిస్తుంది. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. మనం ఎల్లప్పుడూ సభలో జరిగే కార్యక్రమాల వంక చూస్తుంటాము. అందులో లీనం అవుతాము కానీ, అధ్యక్షులు వారి వంక చూడము. అలాగే మనం పరమాత్మ నడిపించే ఈ ప్రకృతిలోనూ ప్రపంచంలోనూ లీనం అవుతాము కానీ పరమాత్మ గురించి పట్టించుకోము. వక్తల ఉపన్యాసాలు, సన్మానాలు వీటి మీదనే మనదృష్టి అంతా. అయితే ఈ సభ తాత్కాలికమనీ, కొంచెం సేపటికి అయిపోతుందనీ తెలుసు కానీ తెలియనట్టే ఉంటాము. అదే మాయ.


ఈ మాయను గురించి తెలుసుకోవాలంటే ఈ సభను నిర్వహిస్తున్న అధ్యక్షుడి గురించి తెలుసుకోవాలి. ఆయన గొప్పవాడు. ఆయన గురించి అంటే పరమాత్మ గురించి తెలియాలంటే జ్ఞానము విజ్ఞానము కావాలి. పరమాత్మ మన స్థూలదృష్టికి, మనసుకు అందడు. కాబట్టి మనదృష్టి సభలో జరిగే వక్తల మీద కార్యక్రమాల మీద మాత్రమే కాకుండా సభాధ్యక్షుని మీద కూడా కేంద్రికరిస్తే, ఆయనకు దగ్గరవుతాము. అధ్యక్షుడు ఎప్పుడూ అర్హత కలిగినవాడే అనే విషయం మరచిపోకూడదు


                              ◆ వెంకటేష్ పువ్వాడ.