Read more!

జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు!!

 

జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు!!

జ్ఞానం కలిగినందు వలన అప్పటి వరకు ఉన్న మోహం పోతుంది. సమస్త ప్రాణి కోటిని తనలో చూడగలడు. అంటే సమత్వభావన కలుగుతుంది. భేదభావన ఉండదు. నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది. మనకు చూడటానికి కళ్లు ఉన్నాయి. ఎందుకు? చూచి నడవడానికి, గోతిలో పడకుండా ఉండటానికి, అలాగే జ్ఞానం ఉన్న దానికి లక్షణం మోహంలో పడకుండా ఉండటానికి, ఈ ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలు అన్నీ అసత్యములు. ఒక్క ఆత్మయే సత్యము, ఇదే ప్రాధమిక జ్ఞానము. ఇటువంటి జ్ఞానము కలవాడు ప్రాపంచిక వస్తువులను చూచి వాటి మోహంలో పడి ఇవన్నీ నావి, ఇవి లేకపోతే నేను బతకలేను. వీటిని నేను ఎలాగైనా పొందాలి. అని అనుకోవడం మోహం.


మామిడి కాయ మొదట వగరుగా ఉంటుంది. తరువాత పులుపుగా ఉంటుంది. బాగా పండిన తరువాత తియ్యగా ఉంటుంది. మామిడి పండు పూర్తిగా పండిన తరువాత పూర్వపు వగరు పులుపు మాయం అవుతాయి. అలాగే జ్ఞానం కలిగిన దానికి లక్షణం అజ్ఞానం, అవివేకం పోవాలి. ఈ ప్రపంచం అంతా మాయ అని తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి చిత్తమును పరమాత్మవైపు మళ్లించాలి. గీతలో అర్జునుడు వీరంతా నా వాళ్లు, వీరిని ఎలా చంపడం అని అనుకుంటూ తన కర్తవ్యమును మరిచిపోతాడు. వీరు వేరు, వీరి ఆత్మలు వేరు, వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి కాని వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమని చెబుతాడు కృష్ణుడు.


చాలా మంది మేము జ్ఞానులము మీకంతా జ్ఞాన బోధ చేస్తాము. అని అంటుంటారు. అటువంటి వారు కూడా ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటారు. అటువంటి వారి జ్ఞానము ఒకరికి చెప్పడానికే కానీ వారు ఆచరించడానికి కాదు. దానినే దాంబిక  జ్ఞానము, మిడి మిడి జ్ఞానము అంటారు. వారు జ్ఞానులు కారు అజ్ఞానులు అని గీతలో కృష్ణుడు చెబుతాడు. శుష్క వేదాంతములు వల్లించేవారు జ్ఞాసులు ఎన్నటికీ కాలేరు. వారి వేదాంతము ఉపన్యాసములకే పరిమితము. కాబట్టి జ్ఞానులు అని పిలిపించుకొనే వాళ్లు ముందు తాము చెప్పే వేదాంతాన్ని అర్థం చేసుకొని, ఆచరించి తరువాత ఇతరులకు బోధించాలి. భగవద్గీత ఎక్కువగా ఆచరణకే ప్రాధాన్యం ఇచ్చింది. కేవలం శాస్త్రజ్ఞానమునకు కాదు. కాబట్టి జ్ఞానము కొరకు సాధన చేసి జ్ఞాని అయిన వాడు ముందు కామమును, క్రోధమును, లోభమును జయించాలి. ఆత్మగురించిన జ్ఞానమును పొందాలి. ఒకరికి చెప్పేముందు తనకు తాను ఆత్మశోధన చేసుకోవాలి. తనలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే నిర్మూలించాలి. అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు.


జ్ఞాని అయ్యాడు అన్నదానికి లక్షణము ఏమిటంటే తనలో ఉన్న ఆత్మ, ఇతరులలో ఉన్న  ఆత్మ ఒకటే అని తెలుసుకోవడం. అందరూ సమానమే అని తెలుసుకోవడం. సమత్వభావన కలిగి ఉండటం. "నేను వేరు.. నీవు వేరు.. నాకంతా తెలుసు.. నీకేమీ తెలియదు" అని అనుకున్నంత 

వరకు ఎవరూ జ్ఞానికాలేరు. అంతే కాకుండా ఈ సమస్త జగత్తును జ్ఞాని తనలో చూడగలడు. మనస్సును ఆత్మ యందు లీనం చేయగలడు. ఆత్మానందాన్ని పొందగలడు. అతడే జ్ఞాని. జ్ఞాని యొక్క తరువాతి లక్షణము భగవంతుని తనలో ఆపాదించుకోవడం, తనలో దైవత్మమును ఆపాదించుకోగలగడం. నేనే భగవంతుడు భగవంతుడే నేను అనే తాదాత్మ్య స్థితికి రావడం. అంటే "నేను భగవంతుడిని అందరూ నన్నే పూజించండి" అని అహంకరించడం కాదు. తనలో ఆత్మ ఉంది. ఆత్మ వేరు శరీరం వేరు. నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశయే అనే జ్ఞానము కలగాలి కానీ అహంకారము కాదు. అంటే ద్వైత భావన వదిలిపెట్టి అద్వైత భావన పెంపొందించుకోవాలి. ఆ భావన గలిగిన వాడే గురువు.

ఇట్లా జ్ఞానం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి.

                               ◆వెంకటేష్ పువ్వాడ.