రాధాదేవి నామజపం చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసా!
రాధాదేవి నామజపం చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసా!
హిందూ పురాణాలలో రాధాదేవి గురించిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాధాకృష్ణులను ప్రేమకు నిర్వచనంగా చెబుతారు. రాధాకృష్ణులను విడదీని చెప్పడం కూడా జరగదు. కృష్ణుడు అనగానే రాధాదేవి, రాధాదేవి అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా.. ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసి, ప్రేమ తత్త్వాన్ని, ప్రేమ స్వభావాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసింది రాధా దేవినే. జీవితంలో ఎన్నో సమస్యలకు ఎందరో దేవతలను పూజిస్తూ ఉంటారు. అయితే.. రాధాదేవి నామ జపం చేయడం వల్ల జీవితంలో అద్బుతం జరుగుతుందని చెబుతారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు నేరుగా అనుగ్రహించకపోయినా, రాధాదేవిని ఆశ్రయించిన వారిని శ్రీకృష్ణుడు సులువుగా అనుగ్రహిస్తాడని కూడా చెబుతారు. ప్రేమకు ఒక దైవ శక్తిని జోడిస్తే.. ఆమెనే రాధాదేవి అని కూడా చెబుతారు. రాధాదేవి నామాన్ని జపించడం వల్ల జరిగేదేంటో, జరిగే అద్భుతాలు ఏంటో తెలుసుకుంటే..
మనస్సును స్థిరపరుస్తుంది..
రాధాదేవి చాలా శాంత స్వభావం కలిగినవారు. ఆమె ఎక్కడుంటే అక్కడ శాంతం, సంతోషం నెలకొని ఉంటుందని చెబుతారు. ఏ స్వార్థమూ లేని స్వచ్చమైన ప్రేమ రాధాదేవి సొంతం. తప్పు చేసిన వారిని కూడా క్షమించగలిగే అంత క్షమాబావం కలిగి ఉండటం కూడా రాధాదేవి సొంతం. రాధాదేవి నామాన్ని జపిస్తే.. రాధాదేవి గుణాలు అలవడి మనిషి చాలా శాంత చిత్తులుగా మారతాగని, మనస్సు స్థిరపడుతుందని చెబుతారు.
సహనం, ఓర్పు..
రాధాదేవి సహనం, ఓర్పు కు పెట్టింది పేరు. ఆమె శ్రీకృష్ణుడిని ఎంతో నిస్వార్థంగా ఆరాధించింది, ప్రేమించింది, అందరికీ ప్రేమను పంచింది. తప్పు చేసిన వారిని మనస్ఫూర్తిగా క్షమించింది కూడా. ఇవన్నీ అలవడాలి అంటే ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. రాధాదేవి నామాన్ని జపిస్తే.. సహనం, ఓర్పు అనే గుణాలు అలవడుతాయని చెబుతారు.
ప్రేమ స్వరూపం..
ప్రేమ అనేది మనుషుల మధ్య జరిగే ఆకర్షణ కాదు. అది చాలా శక్తివంతమైనది, నిస్వార్థమైనది కూడా. రాధాదేవి ఈ ప్రపంచానికి నిస్వార్థమైన ప్రేమ తత్వాన్ని తన జీవితం ద్వారా బోధించింది. రాధాదేవి నామ జపం చేస్తే రాధాదేవి లాగా ప్రేమ తత్వం అనేది అలవడుతుందని చెబుతారు.
నామ జపం..
రామ నామాన్ని జపిస్తే హనుమంతుడు కరిగిపోయినట్టు.. రాధాకృష్ణులు కూడా ఒకరిని స్మరిస్తే మరొకరు కరిగిపోయి అనుగ్రహం ఇస్తారు. ముఖ్యంగా.. మానవ జన్మకు అర్థాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం కావాలి అంటే మాత్రం రాధాదేవి నామ జపం సులువైన మార్గం.
*రూపశ్రీ.