మానసా దేవి ఎవరు.. మంగళవారం మానసా దేవిని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా!
మానసా దేవి ఎవరు.. మంగళవారం మానసా దేవిని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా!
హిందూ మతంలో ఎందరో దేవుళ్లు, దేవతలు ఉన్నారు. ఎవరి ఆసక్తి కొద్ది వారు ఆయా దేవతను పూజించవచ్చని, సాధన చేసుకోవచ్చని చెబుతారు పండితులు, పెద్దలు. దేవతలలో మానసాదేవి చాలా విశిష్టమైనది. చాలామందికి మానసా దేవి గురించి తెలియదు కూడా. ప్రతి గ్రామం, పట్టణంలోని గుడులలో నాగులు కట్ట ఉంటుంది. ఈ నాగులు కట్టలో మూడు విగ్రహాలు వరుసగా ఉంటాయి. మధ్యలో ఒక స్త్రీమూర్తి రూపంలో నాగ ప్రతిమ ఉంటుంది. ఈ అమ్మవారే మానసా దేవి. ప్రతి మంగళవారం మానసాదేవిని పూజించడం వల్ల అద్భుతాలు చేస్తుందని చెబుతారు. అసలు మానసాదేవి ఎవరు? మానసాదేవిని ఎందుకు పూజించాలి? తెలుసుకుంటే..
మానసాదేవి..
మానసాదేవి శివుడి మానస పుత్రిక. కశ్యపుడు, కద్రువులకు కుమార్తె గా పెరిగింది. కశ్యప, కద్రువుల సంతానంలో వాసుకికి ఈమె స్వయానా సోదరి. మానసాదేవిని ఆమె సోదరుడు వాసుకి జరత్కారు అని పిలిచేవాడు. అయితే మానసాదేవికి జరత్కారు అనే మహర్షి తోనే వివాహం అవుతుంది.
జరత్కారు మహర్షి వివాహాని దూరంగా ఉంటూ కఠోర తపస్సు చేసుకుని మోక్షం పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరోజు ఆయన అడవులలో వెళుతూ ఉంటే.. కొందరు పురుషులు చెట్టుకు వేలాడుతూ కనిపిస్తారు. ఎవరు మీరు ఎందుకు ఇలా చెట్టుకు వేలాడుతూ ఉన్నారు అని ఆయన వారిని అడుగుతాడు. అప్పుడు వారు జరత్కారు మహర్షితో.. మా వంశంలో ఒకడు వివాహం చేసుకోకుండా, వంశాన్ని పెరగకుండా చేస్తున్నాడు. అందుకే మాకు ఈ పరిస్థితి ఎదురైంది అని చెబుతారు. అప్పుడే తాను వివాహం చేసుకోకుండా చేస్తున్న తప్పును జరత్కారు మహర్షి తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే వాసుకి తన చెల్లెల్లు మానసా దేవిని జరత్కారు మహర్షిని వివాహం చేసుకోమని అడుగుతాడు. అయితే.. నేను నా పేరు గల అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని అంటాడు జరత్కారు మహర్షి. నా చెల్లెలు పేరు కూడా జరత్కారు నే.. నేను చిన్నతనం నుండి ఆమెను అదే పేరుతో పిలుస్తున్నాను అని చెప్పి వారికి వివాహం చేస్తాడు. అలా మానసా దేవి జరత్కారు మహర్షి భార్య అవుతుంది.
తమకు ఒక బిడ్డ పుట్టేవరకు మాత్రమే తనతో ఉంటానని, ఆ తరువాత తాను తపస్సుకు వెళ్లిపోతానని, తను ఏం చేసినా తనకు ఎదురు చెప్పకూడదని, ఒకవేళ తనకు ఎదురు చెబితే తాను వెళ్లిపోతానని జరత్కారు మహర్షి మానసాదేవికి చెబుతాడు. దీంతో.. మానసాదేవి జరత్కారు మహర్షికి ఎదురు చెప్పలేక చాలా విషయాలలో ఇబ్బందులు పడుతుంది. వారిద్దరికీ అస్తీక అనే ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు. కుమారుడు జన్మించగానే జరత్కారు మహర్షి మానసాదేవి ఓర్పుకు, ఆమె జరత్కారు మహర్షిని సేవించిన విధానానికి సంతోషించి, నాగులలో శ్రేష్టురాలిగా ఉంటావని, మానసాదేవిని పూజిస్తే నాగ భయం పోతుందని, నాగు పాములు కరిచినప్పుడు మానసాదేవిని సిద్దించుకున్నవారు ఆమెను స్మరిస్తే విషం విరిగిపోతుందని, కాల సర్ప దోషాలు కూడా తగ్గుతాయని చెబుతారు.
ప్రతి రోజూ స్నానం చేయగానే మానసాదేవి ద్వాదశ నామాలను మూడుసార్లు చెప్పుకోవాలి. ఇలా 108 రోజులల పాటు చేస్తే.. మానసాదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతారు. ప్రతి మంగళవారం మానసాదేవికి పసుపు నీటితో అబిషేకం చేసి, పాలు పోసి, నెయ్యి దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే.. కాలసర్ప దోషాలు, వివాహంలో ఆటంకాలు, భార్యాభర్తల సమస్యలు, పిల్లలు పుట్టడంలో సమస్యలు.. వంటివన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి మహిళ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యస్వామిని ఎంత నిష్టగా పూజిస్తారో.. అలాగే మానసాదేవిని పూజిస్తే.. జీవితంలో ఎంతో అద్బుతం జరుగుతుంది. అడుగడుగునా తానే వెంట ఉండి కాపాడుతుంది మానసాదేవి.
*రూపశ్రీ.