ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 4 The Diary of LEKHA GUMMADI - 4
ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 4
The Diary of LEKHA GUMMADI - 4
చిన్నికి ఆ నిమిషంలో ఎందుకు గుర్తొచ్చిందో గానీ ''ఇప్పుడు తాతమ్మ ఏం చేస్తూ ఉంటుంది?" అంటూ మొదలెట్టింది.
''నాకేం తెల్సు? నేను కూడా ఆకాశంలోకి వెళ్ళాక చూసి మెసేజ్ లు పంపిస్తాలే'' అన్నాను.
నిన్నేం వెళ్ళనివ్వను.. తాళ్ళతో కట్టేసి, గదిలో పెట్టి తాళమేస్తాను''
''పోయే టైం వస్తే..'' అంటూ నేను వేదాంతం స్టార్ట్ చేయబోతే, ''అబ్బా.. చెత్త మాటలు ఆపి తాతమ్మ సంగతి చెప్పు'' అంది.
నాకు ఒళ్ళుమండి, ''ఏమో.. పాలేటి వీర్రాఘవయ్యగారు, చారుమతి మామ్మ, చిట్టెక్క లాంటివాళ్ళని పోగేసి మీటింగు పెట్టి ఉంటుంది.. లేదా కాఫీ తాగుతోందేమో.. అబ్బే తాతమ్మ దేంట్లో పడితే దాంట్లో తాగదు.. పోయి, నా ఇత్తడి గ్లాసు తీసుకురండి'' అని ఎవరికో పురమాయించి ఉంటుంది..''
ఇక అక్కణ్ణించి చిన్నికి లక్షన్నొక్క సందేహాలు.. నాకు తోచింది చెప్పి వదిలించుకోవాలని చూస్తే మధ్యలో కౌంటర్లు..
దాంతో, నేను కూడా కాసేపు నాన్నమ్మ లోకంలో మునిగాను.
+++___+++
నాన్నమ్మ ఖచ్చితంగా స్వర్గానికే వెళ్ళి ఉంటుంది. ఒకవేళ పొరపాటున యమ కింకరులు వచ్చినా, వాళ్ళ చెవులు గింగురుమనేలా తిట్టేసి ఉంటుంది. ఇంకా అధిక ప్రసంగం చేస్తే గూబ గుయ్యిమనిపించగలదు కూడా!
''ఏంటీ... నాలాంటి ఉత్తమురాలు యమలోకానికి రావాలా.. చస్తే రాను.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి.. జీవితంలో ఒక్కనాడు అబద్ధం చెప్పలేదు.. ఒక్క నీతిమాలిన పని చేయలేదు.. నేనసలే ఆళ్ళ వెంకయ్యగారి కూతుర్ని.. ఆయన ఎవరనుకున్నారు.. రంగనగూడెం మునసబు.. మా నాన్న వీధిలో వెళ్తోంటే జనాలు ఎదురుపడ్డానిక్కూడా ఒణికి చచ్చేవాళ్ళు..'' అని మొదలుపెట్టి ఉంటుంది.
అప్పుడా కింకరుడు ''అదేంటి, మీ నాన్నగారు ఫాక్షనిస్టా?" అని అడిగి ఉంటాడు.
ఇక నాన్నమ్మ సినిమా నిర్మలమ్మలా రెచ్చిపోయి ''మీ జిమ్మడ.. మీకు పోయేకాలం రాను.. మీరేం యములోళ్ళు? ఎన్నాళ్ళబట్టీ ఈ పని చేసి అఘోరిస్తున్నారు? అసలు మీకు ఎవరేంటో తెలిసి చావదు.. నాలాంటి పెద్దింటి ఆడపడుచుతో ఎలా మాట్లాడాలో తెలీదు.. ఏ దొంగ సచ్చినోడు మిమ్మల్నీ కొలువులో పెట్టాడు? మా ఊళ్ళో ఒళ్ళొంగని తెల్ల వెంకయ్య మీకంటే వందరెట్లు నయం..'' అంటూ ఛడామడా, అడ్డదిడ్డంగా దండకం చదివేసి ఉంటుంది.
ఆ యమభటులు బిక్కచచ్చిపోయి ''బతికుంటే బలుసాకు తినొచ్చురోయ్'' అనుకుని, తాము తెలీక లగెత్తుకొచ్చామని లెంపలేసుకుని, ''ఈ కేసు తమరిదే అయ్యుంటుంది.. మంచోళ్ళయితేనే బల్ల గుద్ది వాదిస్తారు గానీ, భ్రష్టులు, మోసగాళ్ళకు వాయిస్ ఎక్కణ్ణించి వస్తుంది..''- అంటూ శివ కింకరులకు ఓ వైర్లెస్ ఇచ్చేసి, కాళ్ళకు బుద్ధిచెప్పి పరారయ్యుంటారు.
+++___+++
ఇంతకీ నాన్నమ్మ ఏం చేస్తోందో?! అబ్బో, ఉన్నన్నాళ్ళూ భలే హుకుంలు జారీ చేసేది. ఆవిడ చెప్పిన మాట వినకపోయామో అయిపోయామే! పాలిటిక్స్ లోకి వెళ్ళలేదు గానీ వెళ్లుంటే ఇందిరాగాంధీకి గట్టి పోటీ అయ్యేది.
అన్నట్టు.. అక్కడ దేవేంద్రుడి భరతం పడుతోందేమో! ''నీ మొహం తగలడ.. నువ్వేం దేవేంద్రుడివి? రంభాఊర్వశులు ఆ వరసన చెత్త డాన్సులేస్తోంటే నువ్వు చోద్యం చూస్తున్నావా? నువ్వింత చచ్చు సన్యాసివి కనుకనే హిరణ్యాక్షుడు లాంటి రాక్షసులు నిన్ను నిమిషంలో ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నారు....'' అంటూ తెగ క్లాసులు పీకుతుండి ఉండాలి.. ఏమాట కామాటే చెప్పాలి.. నాన్నమ్మ కొంచెం సూర్యాకాంతంలా అనిపిస్తుంది కానీ ఎప్పుడూ నిజాలే మాట్లాడుతుంది. దొంగ మాటలు, డొంక తిరుగుళ్ళు ఆవిడ డిక్షనరీలోనే లేవు. అలాంటి నిజాయితీపరులు చాలామందికి మింగుడు పడరు. ''యదార్థవాదీ లోక విరోధీ'' అని ఊరికే అన్నారా?!