ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 5 The Diary of LEKHA GUMMADI - 5

 

ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 5

The Diary of LEKHA GUMMADI

 

అటెండర్ నరసింహ కాస్త సరదా మనిషే. వాళ్ళనీ వీళ్ళనీ ఇమిటేట్ చేస్తూ నవ్విస్తాడు.

 

ఒకరోజు నరసింహ నీరసంగా కనిపించాడు. ఏమయిందని కళ్ళు ఎగరేశాను. ''ఏంటో మేడం...'' అంటూ మొదలుపెట్టి ఓ డాక్యుమెంటరీ లాంటి కధేదో చెప్పాడు. నా ఆర్టికల్ ఎప్పుడౌతుందా అనే ధ్యాసలో నేను నరసింహ మాటలమీద బొత్తిగా మనసు పెట్టలేదు. మొత్తానికి చివర్లో ''పెళ్ళయతే సెటిల్ అవ్వొచ్చు'' అనే మాట ఒక్కటీ వినిపించింది.

''ఏంటీ, పెళ్ళా?'' అన్నాను.

''అవును మేడం..''

''దానికి ఆఫీసువాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా ఏంటి? అంతగా లీవ్ ఇవ్వకపోతే, లాసాఫ్ పే అవుతుంది.. అంతకంటే పోయేదేం లేదు.. చేసుకో.. చేసుకో.. నా పట్టుచీరలన్నీ బీర్వాలో పడి ఏడుస్తున్నాయి.. కట్టుకోడానికి ఛాన్స్ అయినా వస్తుంది"

''ముందు పిల్ల దొరకాలిగా''

''నిజమే, ఎవరో ఒకరైతే దొరుకుతారు.. కానీ బుద్ధిమంతులు దొరకడం మాటలు కాదు.. కొంచెం కష్టమే..''

''మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి.. కాస్త డబ్బున్న పిల్ల..'' అంటూ నసిగాడు.

పక్కనున్న రిపోర్టర్ శ్రీనివాస్ తో "ఈ పెళ్ళి కాని ప్రసాద్ కి ఎవరైనా ఉంటే ప్రపోజ్ చేయరాదూ.. వెనక ఆస్తులు మూలుగుతుండాలట.. పెళ్ళయ్యాక ఈ ఉద్యోగం మానేసి వ్యాపారం పెడతాడేమో'' అన్నాను.

శ్రీనివాస్ చాలా సీరియస్ గా ''రెడీగా ఉంది... తరగని ఆస్తులు కూడా ఉన్నాయి..'' అన్నాడు.

నరసింహ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ''ఎవరు సార్?" అన్నాడు.

''ఒక్క విషయంలో ఎడ్జస్ట్ అయితే చాలు.. నాలుగు తరాలకు సరిపోయే ఆస్తులు'' అన్నాడు.

''ఏంటి సార్?" కళ్ళు తేలేస్తూ అడిగాడు.

''ఏం లేదు.. కాస్త లావు.. అంతే.."

''లావుదేముంది సార్... డబ్బు ఉందంటున్నారు.. ఇంతకీ ఎవరు? మన ఆఫీసేనా?"

"నీ ముఖం, మన ఆఫీసులో అంత రిచ్ కాండిడేట్స్ కూడా అఘోరించారా? మన స్టేట్ కూడా కాదు''

నరసింహలో ఉబలాటం పెరిగి ''ఎవరు?'' అనడిగాడు మళ్ళీ.

''ముందే చెప్తున్నా.. ఏజ్ కొంచెం ఎక్కువ''

''దాందేముంది.. సీత రాముడి కంటే పెద్దది.. సచిన్ టెండూల్కర్ కూడా తనకంటే పెద్దదాన్నే చేసుకున్నాడు''

''నువ్వు అసాధ్యుడివిరా బాబూ.. కాస్త కంపోజింగ్ నేర్చుకుని..'' అంటూ శ్రీనివాస్ ఏదో చెప్పబోతే నరసింహ మధ్యలోనే అడ్డుకుని ''వద్దులే సార్.. ఈ పనులు ఎవరు చేస్తారు గానీ, ముందు ఆమె గురించి చెప్పండి..'' అన్నాడు.

''చెన్నైలో ఉంటుంది.. తెలుగు వచ్చనుకో.. నువ్వు తమిళం నేర్చుకుంటే మరీ మంచిది..''

"కొంప తీసి పెళ్ళయినామె కాదుగదా?'' సందేహంగా అడిగాడు.

"ఛ ఛ.. పెళ్ళి కాలేదు.. కొంచెం ఏజ్ బార్ అంతే''

''ఎలా ఉంటుంది సార్?"

''ఆమెకేంటి క్వీన్.. ఒకప్పుడు ఆవిడచుట్టూ మహామహులు తిరిగారు.. ఇప్పటికీ ఆవిడకి ఉన్నంత ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదు...''

నాకు విషయం అర్ధమై పకపకా నవ్వాను.

నరసింహ మాత్రం తల గోక్కుంటూ ''సరిగ్గా చెప్పండి సార్'' అన్నాడు ఆశగా.

___+++___