Shivatandavam - Comedy Serial 19

 

19 వ భాగం

పంకజం సోఫాలో కూర్చుని వుంది.

ఆమె ఎదుట నిప్పు అప్పలస్వామి ఎంతో నినయంగా నిలబడ్డాడు.

అతనే అంటున్నాడు " నా పేరు అప్పలస్వామండి...ఇంటి పేరు నిప్పండి. నా ఆనేస్టీ చూసి నిప్పనే బిరుదిచ్చేరని చాలామంది అనుకుంటారండమ్మా! ఎవరెట్టా అనుకున్నానమ్మా...మొత్తం పేరు నిప్పు అప్పలస్వామమ్మా " అని.

" అర్థమైంది. వచ్చిన పనేంటో చెప్పు "

" మా యస్పీ దొరగారికి ఈ స్టేట్ మొత్తం మీద పెద్ద పేరండమ్మా! ఆరు ధర్మరాజులండి. ఇంటిపేరు కూడా అదేనండమ్మ ! లంచమంటే చాలు మక్కేలిరగ తంతారండమ్మా! ఆనేస్టీలో ఆయన ఫస్టండి .నేను సెకండండి. ఎవుడినైనా కనుక్కోండి, కరెట్టనే చెప్తారండమ్మా "

" వచ్చిన పనేమిటో చెప్పకున్ఫా పోగుడ్తావేమిటయ్యా ?"

''చిత్తం! ఒకరికొకరం కొత్త కదండమ్మా ! పరిచయాలు కానిచ్చేసి పనేంటో చెప్పడం పద్దతండి. ఏవండమ్మా ఆరికి ఇద్దరంటే ఇద్దరే పిల్లలండి "

" ఎవరికి ?"

" యస్పీ గారికి ! ఆ ఇద్దరి పిల్లలకి తమరు డాన్సు నేర్పుతారేమో కనుక్కురమ్మని యస్పీగారు నన్ను పంపించరండమ్మా "

" మంచిది "

" చిత్తం ! మంచిదంటే అర్థం ఏమిటండీ ? ఒప్పుకున్నట్టేగా ?"

" ఆయనతో నేను మాట్లాడతానని చెప్పు "

" ఆరిప్పుడు ఊళ్ళో లేరండి. కూనీ కేసోకటి తగుల్తే కెంపుకెళ్ళారు "

" వచ్చిన తర్వాత ఫోన్ చేయమను "

" చిత్తం " అని పోలీసు సెల్యూట్ కొట్టేసి వెళ్ళబోతాడు.

" అప్పలస్వామీ " అని పిలిచింది.

" అమ్మా " అంటూ ఆగిపోయేడు.

" నువ్వు అస్తమానం మా ఎదురింటికి వస్తుంటావు కదా ! " అని అడిగింది పంకజం.

" చిత్తం "

" ఆ ఇంటి మీదగానీ, ఆ మనుష్యుల మీదగానీ ఏమైనా పోలీసు కేసులున్నాయా ?" ఆ మాటకి అప్పలస్వామి గొప్ప బాధపడిపోయేడు. చిహ్నంగా అతని కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగేయి. అంతమాట అన్నందుకు కోపం వచ్చినా అనువుగని చోట గనుక కోపాన్ని దిగమింగుకుని అన్నాడు

" అమ్మమ్మ.. అంత మాటనకండమ్మా ! కళ్ళు పెలిపోగలవ్ " అని.

" అట్లాగా "

" అవునండి ! అయినా ఇందులో తమ తప్పేమీ లేదు లేదమ్మా ! తప్పంతా నే తొడుక్కున్న యూనిఫాంలో ఉందండి. కాకి బట్టలేసుకుని, ఎర్రటోఫీ పెట్టుకుని, లాఠీ ఊపుకుంటూ గుళ్ళో కెళ్ళినా, ఆ పూజారి మీద జనానికి డవుట్ కలుగుతుందండి "

" అంటే.. ఆ ఇల్లు దేవాలయమంటావా ?"

" చిత్తం! అంతకంటే ఎక్కువేనండి. ఆ ఇంట్లో శివయ్యగారున్నారండి. ఆరు దేవుడేనండి "

" ఏం చేస్తున్నారేమిటి ?"

" ఉద్యోగమాండి! ఏదో ఉద్యోగం! ఆయన చేసె సేవ ముందు ఉద్యోగం ఏ పాటిదండి ?"

" సేవంటే "

" పజాసేవండి ! ఒరే మగవేదవల్లారా...ఆడదాన్ని నమ్మోద్దురా...పెళ్ళోద్దురా! కోరీ దుఃఖాన్ని కొనుక్కోవద్దురా అంటూ కొన్ని నిజాలు చెబుతారండి. మగోడి పవరు పెరిగేందుకు లేహ్యలిస్తారండి. అమ్మా... ఆయనకి నిజంగా గుడి కట్టించినా తప్పులేదండి. కానీ మచ్చ దెబ్బ తీసేసిందండి "

" మచ్చా ?"

" అవునండి ! ఎవరో ఆడదెయ్యం గురువుగార్ని సర్వనాశనం చేసేసిందండి ! ఆ తల్లి దయవల్ల గురువుగారింత వరకూ కోలుకోలేదంటే నమ్మండి " ఆ మాటకి పంకజం చిరుకోపం తెచ్చుకుంది.

" అడిగిన ప్రతివాళ్ళకి ఈ మాట చెప్పమని నిన్ను ఏజెంటుగా పెట్టేడా ఆయన ! ఆ సంగతేమిటి ఆయనకే ఫోన్ చేసి కనుక్కుంటానుండు " అని లేవబోయింది.

అప్పలస్వామి నీళ్ళుకారిపోయాడు.

" తల్లీ...అంతపని చేయకండమ్మా ! తమకి పుణ్యముంటది. ఎవడికీ చెప్పని కథ నన్ను నమ్మి నాకే చెప్పేరు. గురుగారి కథని బజార్లో పెట్టినట్టు తెలిస్తే నన్ను కూరండుకుని తింటారు "

పంకజం అసహనంగా అన్నది " సర్లే..నువ్వింక వెళ్ళచ్చు " అని. అప్పలస్వామి వెంటనే సెల్యూట్ చేసి గుండెల మీద చేయివేసుకుని బయటకు నడిచాడు. అతను వెళ్ళిపోతుండగా వసుంధర లోపలికి వచ్చింది.

వసుంధరను చూస్తూ అడిగింది పంకజం " ఇవాళ లేటుగా వచ్చేవెం బేబీ " అని.

" అదే...అతను..అతను కనిపించాడు ఆంటీ "

" ఎవరతను ?"

" అతనే కృష్ణ. ఎదురింటి అబ్బాయి ! ఉదయం సైకిల్ డేష్ ఇచ్చేడు " అని చెప్పింది వసుంధర.