Read more!

రాజుకు ఉండాల్సిన అర్హతలు!!

 

రాజుకు ఉండాల్సిన అర్హతలు!!


రామాయణంలో భరతుడు తనకు రాజ్యం వద్దని, రాముడి రాజ్యాన్ని పరిపాలించాలని అందుకోసం రాముడిని తీసుకుని రావాలి అని, అయోధ్యలో ఉన్న ఎంతోమందిని సైనికులతో సహా వెంటబెట్టుకుని వెళ్ళాడు. రాముడిని చూడగానే భరతుడు భావోద్వేగంలో మునిగిపోయాడు. రాజభోగాలు అనుభవించాల్సిన రాముడు మర్రిపాలు పోసుకుని జుట్టు జడలు కట్టుకుని, శరీరం మీద నారాచీరలు కట్టుకుని, ఒళ్ళంతా మట్టితో నిండిపోయి ఉండటం చూసి భరతుడు వెక్కి వెక్కి ఏడ్చాడు.

అయితే రాజ్యాన్ని పాలించాల్సిన భరతుడు ఇలా వచ్చాడేంటి?? భర్తుడిని చిన్న పిల్లాడిని చేసి ఎవరైనా రాజ్యాన్ని లాక్కున్నారేమో అనే అనుమానం వచ్చింది రాముడికి. 

రాముడు భరతుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావ, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు. అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు. అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా.

మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటే రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటే, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజే కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు. అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుండి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు. అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హొదాలలో ఉన్నవారి దగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా" అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు.

అప్పటికే అక్కడికి వశిష్టుడితో సహా మంత్రులు, సేనాపతులు, సైనికులు రాజ్యానికి సంబంధించిన వాళ్ళు అందరూ చేరుకుని రాముడు భరతుడిని అడిగినవి అన్నీ విన్నారు. వాళ్లకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. రాజ్యం గురించి ఎంతో అవగాహన ఉన్నవాడికి తప్ప వేరే ఎవరికీ తెలియని విషయాలు రాముడికి తెలుసు. అలాంటి రాముడు రాజ్యాన్ని వదిలేసి వచ్చాడు. అలాంటి వాడు అయోధ్యకు రాజు కానందుకు అయోధ్య దురదృష్టం చేసుకుంది అనుకున్నారు.

                                    ◆వెంకటేష్ పువ్వాడ.