Read more!

భారద్వాజుడు వేదం నేర్చుకోవడానికి ఏమి చేశాడు??

 

భారద్వాజుడు వేదం నేర్చుకోవడానికి ఏమి చేశాడు??


 మహర్షులలో భారద్వాజ మహర్షి ఎంతో గొప్పవాడు. ఆయన త్రికాలవేది. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి ఆయనకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి. మహర్షులు అందరూ వేదాలను ఎంతో క్షుణ్ణంగా తెలుసుకుని ఉంటారు. అలా వేదం చదువుకున్నవారిలో భారద్వాజ మహర్షి కూడా ఒకరు. 

ఒకసారి భారద్వాజుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. 

భారద్వాజుడు బ్రహ్మను తనకు తెలిసిన పాండిత్యంతో స్తుతించి ఆ తరువాత  నాకు వేదం చదువుకోవాలని ఉంది. అయితే వేదం ఎంతో విస్తృతమైనది కాబట్టి చదువుకోవడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం(ఆయుష్షు) కావాలని భారద్వాజుడు అడిగాడు.

అప్పుడు బ్రహ్మ ఆలోచించాడు. అదేమీ నీచమైన కోరిక కాదు. మరొకరికి నష్టం కలిగించేది అంతకన్నా కాదు కదా అని అనుకున్నాడు. అప్పుడు బ్రహ్మ భారద్వాజుడితో సరే నువ్వడిగినట్టు వంద సంవత్సరాల ఆయుష్హు నీకు ఇస్తున్నాను అని అన్నాడు. 

భారద్వాజుడు వేదాన్ని చదువుతూనే ఉన్నాడు, నేర్చుకుంటూనే ఉన్నాడు. ఆయనకు బ్రహ్మ ఇచ్చిన  వంద సంవత్సరాల ఆయుష్హు అలా గడిచిపోసాగింది. 

"అయ్యో ఆయుష్షు అంతా అప్పుడే అయిపోతోందే" అనుకున్నాడు. మళ్ళీ బ్రహ్మ గురించి తపస్సు చేసాడు. బ్రహ్మ మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు.

కోరిక ఏమిటి అని అడిగాడు బ్రహ్మ. భారద్వాజుడు మళ్లీ ఆయుష్షు కావాలని అడిగాడు. బ్రహ్మకు అదేమీ ఇవ్వకూడని వరం అనిపించలేదు. అందుకే భారద్వాజుడికి మళ్ళీ వంద సంవత్సరాల ఆయుష్షు ఇచ్చాడు.

భారద్వాజుడు మళ్లీ వేదాలను చదివాడు. మళ్లీ ఆయుష్షు అయిపోవచ్చింది. మళ్ళీ కలత పడ్డాడు. మళ్లీ బ్రహ్మ కోసం తపస్సు చేసాడు. బ్రహ్మ కూడా మళ్లీ ఆయుష్హు ఇచ్చాడు.   అలా బ్రహ్మ దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. మళ్లీ ఆయుష్షు అయిపోవచ్చింది. అందుకే అలా 4వ సారి కూడా తపస్సు చెయ్యగా, బ్రహ్మ ప్రత్యక్షమై, భారద్వాజా నువ్వు వేదాలు చదవాలని నేర్చుకోవాలని ఎంతో ఆశపడుతున్నావు, ప్రతిసారి ఆయుష్హు కావాలని తపస్సు చేస్తున్నావు కానీ  వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపించాడు.

అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. వాటిని చూసి భారద్వాజుడు ఆశ్చర్యపోయాడు. కానీ నేను నేర్చుకుంటే ఏంటి?? అని ప్రశ్న ఆయనలో కలిగింది.

అప్పుడు బ్రహ్మ భారద్వాజుడితో  నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది మూడు గుప్పిళ్ళంత. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు అన్నాడు. అలా బ్రహ్మ గారిచే ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు. 

                                ◆వెంకటేష్ పువ్వాడ.