Read more!

రాముడిని గంగాతీరం దాటించినవాడు!!

 

రాముడిని గంగాతీరం దాటించినవాడు!!

రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు రాముడిని పడవలో గంగాతీరం దాటించే గుహుడు ఎంతో ఆత్మీయుడిగా అనిపిస్తాడు రామాయణం గురించి తెలుసుకునేవాళ్లకు కూడా. ఎందుకిలా అంటే కొందరు పూర్వజన్మ స్పర్శలలో(అనుభూతులు, అనుభవాల ఆత్మీయత) ఎంతో గాఢంగా ఇమిడిపోయి ఉంటారు. రాముడు వనవాసం బయలుదేరినప్పుడు కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీ (గార) వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు.


వృత్తి రీత్యా వేటగాడైన గుహుడు సరయు నది పరిసర ప్రాంతాల అటవీ ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. గుహుడు  సామాన్యుడేం కాదు. నిషాధ తెగకే రాజు. అధికారం, పరపతి, ప్రతిష్ఠ కలవాడే. కానీ రాముడు తన రాజ్యంలోకి అడుగు పెట్టాడని తెలియగానే గుహుడి ఆనందానికి అవధులు లేక పోయింది. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో (ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన (తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే) గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు, "రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్థాలు, అన్నరాసులు తీసుకొచ్చాను. తీసుకో రామా” అన్నాడు. గుహుడికి ఇక్ష్వాకు వంశమంటే చాలా ప్రేమ, ఆ వంశానికి వారసుడు అయిన రాముడంటే మరింత ప్రేమ. అండ్హ్యూకే అంత ఆనందం.


అప్పుడు రాముడు "గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు" అన్నాడు.


గుహుడు రాముడిని చూశానన్న సంతోషం కంటే, రాముడు అడవులకు వెళ్తున్నాడన్న బాధలో ఇక ఏమీ మాట్లాడలేదు. మరుసటిరోజు   రాముడు గుహుడిని పిలిచి "గుహా! ఇకనుండి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా" అన్నాడు.


గుహుడు వెళ్లి మర్రిపాలను స్వయంగా తీసుకొచ్చాడు.  అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. 


"అంతఃపురంలో ఎన్నో సౌకర్యాల మధ్య సంతోషంగా ఉండాల్సిన రాముడు ఇప్పుడిలా సన్యాసిలాగా అన్ని వదిలేసుకొని ఎలా మారిపోయాడు" అనుకున్నారు.


 తరువాత అక్కడున్న వాళ్ళందరి వైపు చూస్తూ  రాముడు "నేను ఈ 14 సంవత్సరములు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను" అన్నాడు.


ఇక సమయం అయిపోయిందని అనిపించిందేమో రాముడు గుహుడి వైపు చూసాడు. గుహుడు గంగాతీరంలో ఉన్న పడవను సిద్ధం చేసి నిలబడ్డాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి "ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు" అని చెప్పి, వారు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. వాళ్ళను గంగాతీరం దాటించినవాడు గుహుడు. 

  ◆వెంకటేష్ పువ్వాడ.