Read more!

భరతుడికి కలలో కనిపించింది ఏంటి??

 

భరతుడికి కలలో కనిపించింది ఏంటి??

కొన్నిసార్లు కలలు వచ్చినప్పుడు మనసు ఎంతో కలతపడుతుంది. ఆ తరువాత ఆ కలల తాలూకూ పరిణామాలు నిజమవుతూ ఉంటాయి. మరికొందరికి ఎక్కడో జరిగిన విషయాలు కలల రూపంలో తెలుస్తూ ఉంటాయి. రామాయణంలో భరతుడికి వచ్చిన కల, దశరథ మహారాజు మరణాన్ని తెలుపుతూ ఇలా సాగుతుంది.

ఒక రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారే సరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు, అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి ఏమయ్యింది భరతా!! ఎందుకంత దిగులుగా ఉన్నావు" అని అడిగారు.

అప్పుడు భరతుడు ఇలా చెప్పాడు "నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడినుండి కిందపడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్ళలో పోసుకొని తాగుతున్నారు. తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను.

 సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలయిపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగాజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితోపాటు మా తండ్రిగారు ఒక ఇనుప పీట మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని, ఎర్ర చందనం రాసుకొని, ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడినుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు.

మా నాన్నగారు గాడిదలు పూన్చిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి, ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో, వాడు చితి మీద పడుకొని ఉండగా, ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్దిరోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తుంది" అని అన్నాడు.

అప్పుడే అయోధ్య నుండి వచ్చిన కొందరు వ్యక్తులు భరతుడి దగ్గరకు వెళ్లి పలకరించారు. అనుకోకుండా వాళ్ళు తన దగ్గరకు రావడం చూసి భరతుడు మొదట ఆశ్చర్యపోయాడు.

నాకు ఇంత చెడ్డ కల వచ్చింది కదా!! అయోధ్యలో అందరూ క్షేమంగానే ఉన్నారా లేదా ఒకసారి అడిగి కనుక్కుంటాను" అని అనుకుని వాళ్ళతో ఇలా అడిగాడు

"సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్టానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామ మాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా. శత్రుఘ్నడికి, లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా.

మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది. చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదు కదా. దశరథుడు, రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా" అని అడిగాడు.

అప్పుడు వాళ్ళు "నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో, వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది, నువ్వు ఇప్పుడే బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడు"  అని చెప్పారు.

ఇప్పటికిప్పుడు నన్ను అంత అత్యవసరంగా రమ్మనడమా??" అని ఆశ్చర్యపోయాడు భరతుడు.

"తప్పదు భరతా!! వశిష్ట మహాముని ఆజ్ఞ తప్పక రావాలి పదా!!" అన్నారు వాళ్ళు. ఇలా సాధారణ మనుషులు అయినా గొప్పవాళ్ళు అయినా ఆ విధికి తలవొంచాల్సిందే అని అర్థమవుతుంది.

                                   ◆వెంకటేష్ పువ్వాడ.