వ్యాసుడు కూర్చిన అద్భుత శ్లోకం!!

 

వ్యాసుడు కూర్చిన అద్భుత శ్లోకం!!

 

భగవద్గీతలో శ్లోకానికి వ్యాసుడు అద్భుతమైన వివరణ యెతూ మలచిన సారాంశం ఇది. 

【యదా తే మోహకలిలం బుద్ధిర్వ త్యితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య

ఓ అర్జునా! ప్రతి వాడిని మోహం ఆవరించి ఉంటుంది. ఈ మోహం ఒక ఊబి లాంటిది. ఈ మోహము నుండి బయటపడినవాడే ఈ లోకములో ఉండే సుఖాలు, దుఃఖాలకు సంబంధించిన బంధనాల నుండి, అలాగే పరలోకములో లభించే సుఖాలకు సంబంధించిన బంధనాల నుండి విడివడతాడు. అప్పుడే మనిషికి వైరాగ్యం కలుగుతుంది.】


ఈ శ్లోకంలో మోహము అనే పదం వాడారు వ్యాసులవారు. మోహము అంటే తెలియని

తనం, అజ్ఞానం, అవివేకం, ఒక విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం. దీనినే మాయ అని కూడా అంటారు. వాడు దాని మాయలో పడ్డాడు. దాని మోహంలో పడ్డాడు. అని అనడం మనం వింటూ ఉంటాము. మానవునికి పరమాత్మకు మధ్య అడ్డుగోడగా నిల్చింది ఈ మోహమే. దీనిని దాటగలిగితే పరమాత్మను చేరుకోవచ్చు అంటే అహం బ్రహ్మ అస్మి అనే భావన కలుగుతుంది. కాని ఈ మోహము అనే అడ్డుగోడను తొలగించడం చాలా కష్టం. 

మరి ఈ అడ్డుగోడను దాటడానికి వీలు లేదా అంటే ఉంది అని చెప్పవచ్చు. నిష్కామంగా కర్మలు చేయడం, ఇదంతా నేను చేస్తున్నాను, అంతా నావలననే జరుగుతూ ఉంది అనే అహంకారము, కర్తృత్వభావన లేకుండా కర్మలు చేయడం, కర్మఫలములను పరమాత్మకు అర్పించడం, తిరిగి ఆ ఫలములను భగవంతుని ప్రసాదంగా స్వీకరించడం, ఏ పనిచేస్తున్నా పరమాత్మ మీద మనసు లగ్నం చేయడం, అప్పుడే మానవుడు అజ్ఞానము అనే ఈ మాయ నుండి బయటపడగలుగుతాడు.

వ్యాసులవారు ఇక్కడ నిర్వేదం అనే పదం వాడారు. నిర్వేదము అంటే వైరాగ్యము. వైరాగ్యము అంటే అన్నీ వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకోవడం కాదు. ఏ వస్తువు అవసరం ఎంతవరకు ఉందో తెలుసుకొని, అంతవరకే సంపాదించడం, ఉపయోగించడం, అనుభవించడం. అనవసరమైన వస్తువుల జోలికి పోకపోవడం. దీనినే వైరాగ్యం అని అన్నారు. అందుకే సన్యాసికి కూడబెట్టడం నిషిద్ధం అని కూడా అన్నారు. అలా కాకుండా, అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే అనుభవించాలి. ఇతరులకు ఏదీ దక్కకూడదు, నేను ఒక్కడిని నా వాళ్లు సుఖపడాలి, ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖాలు అనుభవించాలి అని అనుకోవడమే మోహం, వ్యామోహం అని అంటారు.

చిన్న ఉదాహరణ. ఏ పదార్ధమైనా నోట్లోకి వెళ్లనంత వరకే దాని ఆకారము, రంగు, రుచి, వాసన. ఒకసారి నోట్లో వేసుకొని నమిలిన తరువాత దాని ఆకారం మారి పోతుంది. ముద్దగా తయారవుతుంది. అలాగే పానీయాలు కూడా. గొంతు దిగిన తరువాత అన్నీ ఒకటే. ఇది అందరూ తెలుసుకోవలసిన సత్యం. మంచి నీరు కానీ, పండ్ల రసం కానీ, మత్తుపానీయం కానీ, ఇంటి భోజనం కానీ, ఫైవ్ స్టార్ హోటల్ భోజనం కానీ, కడుపులోకి వెళితే అన్నీ సమానమే. కాబట్టి మానవుడికి ఏ సుఖం అయినా శబ్ద, స్పర్శ, రస, రూప, గంధముల వలనే కలుగుతుంది. కాకపోతే ఆయా వస్తువులు దొరికే స్థలం బట్టీ, వాటి ఖరీదును బట్టి, ఆకర్షణను బట్టి మారుతుంటుంది. 

వీటి అసలు స్వరూపం తెలుసుకుంటే, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా అనుభవించే సుఖం ఒకటే తేడా ఉండదు అనే భావన కలుగుతుంది. వైరాగ్యం దానంతట అదే కలుగుతుంది. కాబట్టి బయట ప్రపంచంలో దొరికే పదార్థాల అసలు స్వరూపం తెలుసుకోకుండా అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే అనుభవించాలి. నాకు తప్ప ఇంకెవరికీ దక్కకూడదు అని అనుకోవడం అజ్ఞానం, అవివేకం, వాటిలో నుండి పుట్టే వ్యామోహం. పదార్థాల అసలు స్వరూపం తెలుసుకొని ప్రవర్తించడం వైరాగ్యం.

◆ వెంకటేష్ పువ్వాడ