మనిషిని ఉన్నతుడిగా నిలిపే గీతా ప్రగీతం!!
మనిషిని ఉన్నతుడిగా నిలిపే గీతా ప్రగీతం!!
విధాత తలపున ప్రభవించిన జీవన వేదం అనే అక్షరాలు సిరివెన్నెల కలం నుండి జారిపడిన ఆంతర్యం సినిమా కోసమే కావచ్చు కానీ ఒక్కసారి అందులో అంతరార్థం తెలుసుకుంటే ఆ జీవన వేదమే మన గీతా గ్రంథమని అనిపిస్తుంది. సుమారు 700 శ్లోకాలు, ప్రతి శ్లోకంలో తాత్వికత, మనిషి నిజజీవితంలో ఉండాల్సింది ఏమిటి?? మనిషి వధులుకోవాల్సింది ఏమిటి?? మనిషి బతకాల్సింది ఎలా?? ఇలాంటివన్నీ భగవద్గీత చదివితే అర్థమైపోతాయి.
బెస్ట్ మొటివేషల్ గురు!!
అర్జునుడు యుద్దానికి వెళ్ళినపుడు అక్కడున్న తనవాళ్లను అందరినీ చూసి బాధపడతాడు, భయపడతారు. కారణం కురుక్షేత్ర యుద్ధం ఒక పెద్ద మహా సంగ్రామం. ఆ యుద్ధంలో ముగిసిన తరువాత ఎవరు బతికి ఉంటారో, ఎవరు మరణిస్తారో తెలియదు. తన వాళ్ళు చచ్చిపోతే!! అనే బెంగతో యుద్దానికి వెళ్లను అంటాడు అర్జునుడు. కానీ కృష్ణుడు జ్ఞానాన్ని భోదిస్తాడు. నిజానిజాలను తెలియజేస్తాడు. మనిషి తన జీవితంలో నాది అనుకుంటే అది ఏదైనా సరే మనిషి అయినా వస్తువు అయినా బాధిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనుకోకూడదు అని చెబుతాడు. మనిషి ఎప్పుడు తాను చేయవలసిన పని గురించే ఆలోచించాలి అని చెబుతాడు. దాని కష్టాల గురించి, లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు అని చెబుతాడు.
ఇదే నేటి యువతకు, విద్యార్థులకు కావాల్సింది. పలితం కాదు ప్రయత్నం ముఖ్యం. పని వెనుక ఉన్న లాభనష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ పని పూర్తి చేయలేరు. ఆ ఆలోచనతో పని మొదలుపెట్టినా అది సానుకూల పలితం కంటే వ్యతిరేక పలితాన్నే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది.
సుఖదుఃఖే సమానత్వే!!
సుఖం, దుఃఖం మనిషి జీవితంలో ఉండే రెండు ముఖ్య విషయాలు. మనిషి జీవితం ఈ రెండిటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అనుకున్నది జరిగితే సుఖం, జరగకపోతే దుఃఖం. మనుషులకు జరామరణ రోగాలు ఉంటాయి. అంటే పుట్టడం, జీవితంలో ఆరోగ్య సమస్యలు జబ్బులు రావడం, తరువాత మరణించడం. ఇవే ఉంటాయి జీవితంలో. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు వీటికి తలవంచాల్సిందే ఇవి ప్రకృతీ ధర్మమైనవి. కానీ సుఖం, దుఃఖం అనేవి మనిషి బుర్రలో పుట్టేవి, మనసులో వెంటాడేవి. నేను, నాది అనుకుంటూ నావాళ్ళు, పరాయి వాళ్ళు, శత్రువులు, మిత్రులు. ఇంకా సుఖాల సాంగత్యం. వస్తువులు, మనుషుల మీద మొహం ఇవన్నీ మనిషికి ఎప్పుడూ అశాంతిని కలిగిస్తాయి అదే మాట గీత చెబుతుంది.
అలాగని ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండమని చెప్పదు. ప్రతి మనిషి పుట్టిన తరువాత తన పని తాను తప్పక చేయాలి, దాన్ని తప్పించుకుంటే కూడా కర్మ వెంటాడుతుందని చెబుతుంది. అలాగని అనవసరమైన పనులు చేసినా కర్మ వెంటాడుతుందని చెబుతుంది, చేసిన పని మనిషిగా పుట్టాం కాబట్టి చేస్తున్నాం అనుకోవాలి అంతేకానీ అది నా పని, ఆ పలితం నాది అని ఆలోచించినా కర్మ వెంటాడుతుంది అని చెబుతుంది. అంటే ఇక్కడ ముఖ్యమైనది కర్మ చేయడం మాత్రమే. అంటే మనిషి ఆ క్షణంలో జీవించడం. వేరే వాటి గురించి ఆలోచించకపోవడం.
ప్రతి మనిషి ఆ క్షణంలో మాత్రమే జీవించడం అలవాటు చేసుకుంటే గతాన్ని గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం అనేది చేయకుండా ఉంటే సంతోషంగా ఉండగలడు. ఆ క్షణాన్ని ఎప్పుడైతే వంద శాతం సమర్థవంతంగా గడుపుతాడో, దానికి న్యాయం చేస్తాడో అప్పుడు భవిష్యత్తు ఎంతో ఆశాజనంగా ఉంటుంది. గతంలో తప్పు భవిష్యత్తులో పునరావృతం కావు.
ఇట్లా మానసిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్లు, ఆశాజనకమైన జీవితాల కోసం చెప్పే మాటలు అన్ని మన గీతలోనే వేల సంవత్సరాలు కిందటే పొందుపరచపడ్డాయి.
పిల్లల మనోవికాసానికి, పెద్దలు సమస్యల ఒత్తిడి నుండి బయటపడటానికి, యువత తమ లక్ష్య సాధనపై దృష్టి పెట్టడానికి, ముసలి వాళ్ళకు తత్వం బోధించటానికి, వైఫల్యాలను స్ఫూర్తి వంతంగా తీసుకుని ముందుకు సాగడానికి. ఇట్లా ఎన్నని చెప్పాలి. గీతలో లేనిది, మనిషి జీవితంలో పడత్యేకంగా ఉన్నది అంటూ లేదు. మనిషి జీవితం, ఆ జీవన సారం, జీవన వేదమే గీతాసారం.
ప్రతి ఇంట్లో భగవద్గీత ప్రతి పిల్లవాడికి దాని గూర్చి చెబుతూ అర్థం వివరిస్తూ ఉంటే గొప్ప జీవితాన్ని వాళ్లకు అందించినట్టే.
◆ వెంకటేష్ పువ్వాడ