సుందరకాండ పారాయణ అద్భుత పలితాలు!!
సుందరకాండ పారాయణ అద్భుత పలితాలు!!
రామాయణం గొప్ప గ్రంథం. అందులో మొత్తం ఏడు కాండలు ఉన్నాయి. ఆ ఏడు ఆ సందర్బాలకు అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి. కానీ ఆ ఏడింటిలో విశిష్టమైనది సుందరకాండ. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుని, సీతను వెతికి, కనుక్కుని తరువాత లంకను దహనం చేసి, సీత ఎక్కడుంది అనే విషయాన్ని రాముడికి తెలియజెప్పడం ఈ సుందరకాండ సారాంశం. రామాయణం అంతా రాముడి గురించి అయితే, సుందరకాండ ఆంజనీయుడి అద్భుత విన్యాసాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. అందుకే సుందరకాండకు అంత ప్రత్యేకత. అయితే సుందరకాండ పారాయణ వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయని అందరి నమ్మకం.
సుందరకాండలో ఏది చదివితే ఏ సమస్య తీరిపోతుందని కూడా పండితులు వివరించారు. సుందరకాండలో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మంత్రబద్ధమై ఉంటుంది. అంతే కాదు అదంతా చందస్సులో కూర్చబడి ఉంటుంది. సుందరకాండను భక్తితో చదివినా, విన్నా,
నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా, బాధలు కష్టాలు తొలగిపోతాయి. రోగాలు నయమౌతాయి, భయాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. మృత్యు భయం పోతుంది.
లంకా విజయం చదివితే భూత-ప్రేతాదుల భయంతో ఉన్నవాళ్లను హనుమంతుడు రక్షిస్తాడు.
హనుమ నిర్వేదం చదివితే బుద్దిమాంద్యం సమస్యలున్నవారికి ఆ సమస్య తొలగుతుంది.
లంకలో సీతాన్వేషణ ఘట్టం చదివితే ఇతరులు వల్ల మనపై కలిగే దోషాలు తొలగిపోతాయి.
లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
త్రిజటా స్వప్న వృత్తాంతం చదివితే చెడ్డ కలల వల్ల కలిగే దోషాలు పోతాయి.
సీతారావణ సంవాదం చదివితే మంచి బుద్ధి కలుగుతుంది.
సీతా హనుమ సంవాదం చదివితే దూరమైపోయిన బంధువులు తిరిగి కలుస్తారు.
అంగుళీయక ప్రదానం చదివితే కష్టాలు తగ్గుతాయి.
కాకానుగ్రహం చదివితే తెలిసీ తెలియక ఎప్పుడైనా రాముడి విషయంలో ఏదైనా తపోయూ చేసి ఉంటే అవి తొలగిపోతాయి.
చూడామణి ప్రదానం చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
కిమ్కరాది రాక్షసులను హనుమ వధించిన ఘట్టాలు చదివితే శత్రువుల మీద విజయం సాధిస్తారు.
లంకాదహన ఘట్టం చదివితే ఇంట్లోనూ, వ్యవసాయ పనుల్లో అభివృద్ధి కలుగుతుంది.
మధువన ధ్వంసం చదివితే ఆ పుణ్యం వల్ల మరణం తరువాత బ్రహ్మలోకానికి వెళతారు.
సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం చదివితే అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి.
68 రోజుల పారాయణం చేస్తే కొడుకులు పుట్టలేదని బాధపడేవారికి కొడుకులు పుడతారు. అలాగే పెళ్లికాని ఆడపిల్లల పెళ్లి తొందరగా జరుగుతుంది.
రోజూ సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటే వర్షాలు చక్కగా కురిసి, పంటలు పండి, కరువు మాయమవుతుంది.
అంగుళీయక ప్రదానం చదివితే తలపెట్టిన పనులలో విజయం సొంతం అవుతుంది.
బ్రహ్మాస్త్ర బంధం నుండి విముక్తి, హనుమద్గ్రహణం చదివితే శనిబాధలు ఉన్నవారికి ఆ సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది.
నిత్య పారాయణం చేస్తే అన్ని పనులలో విజయం కలుగుతుంది, అలాగే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది.
సుందరకాండ చదివేచోట రాముడు ఎల్లప్పుడూ ఉంటాడు, అలాగే రాముడి గురించి పూజలు జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. కాబట్టి సుందరకాండ పారాయణ చేయగానే ఆవు పాలు బాగా కాచి గోరువెచ్చగా ఉన్న పాలలో చక్కెర కలిపి నైవేద్యంగా పెట్టాలి. ఇది ఎంతో గొప్ప నైవేద్యం. ఇలా చేస్తుంటే సకల సమస్యలు తొలగిపోతాయి.
◆ వెంకటేష్ పువ్వాడ