శూర్పణకతో రామలక్ష్మణుల పరిహాసం!!

 

శూర్పణకతో  రామలక్ష్మణుల పరిహాసం!!

సీతారామలక్ష్మణులు పంచవటిలో శ్రమం కట్టుకుని అక్కడ ఎంతో హాయిగా ఉన్నారు. ఒకరోజు అక్కడికి ఒక రాక్షసి వచ్చింది.ఆమె పేరు శూర్పణఖ (చాటలంత గోళ్ళు ఉన్నది). అప్పుడామె, విచ్చుకున్న పద్మముల వంటి కన్నులున్నవాడు, అపారమైన తేజస్సున్నవాడు, మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన రాముడిని చూసింది. ఆమెకి రాముడి మీద కామం కలిగింది.

రాముడిని చూస్తే 'అబ్బ ఎంత బావున్నాడో' అంటారు. కానీ పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు. ఆమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఆమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే, వారు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే, వారు భయపడతారు.

అటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి "నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కాని ఇక్కడ ఎవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది, ఇంతకీ మీరు ఎవరు" అని అడిగింది.

అబద్ధం చెప్పడం రాని, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోనీ మాటలు స్త్రీల దగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు  "నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము ముగ్గురమూ తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు?" అని రాముడు అన్నాడు.

అప్పుడు శూర్పణఖ "నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు. ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను. నాకు అపారమైన బలం ఉంది, స్వేచ్ఛావిహారం చేస్తుంటాను, ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు" అని సీతమ్మ వైపు చూసి ఈవిడెవరు, ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడా నీ భార్య, ఈవిడ నీకు తగినది కాదు, నేను నీకు తగినదానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే, ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను, అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించచ్చు" అని చెప్పింది. 

ఈమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు భేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు "నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్ని విధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు" అన్నాడు.

అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి "నీకు తగినటువంటి భార్యను నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు. నేను అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు" అని పలికింది. 

అప్పుడు లక్ష్మణుడు "నేనే ఓ దాసుడిని. మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినమ్మతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు. అందుకని మా అన్నగారినే అడుగు" అని పరిహాసం ఆడాడు.

లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకొన్న శూర్పణఖ మొదట సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన జింకలా సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో "చూశావ లక్ష్మణా! ఇలాంటిదానితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకొంది. తాను అందగత్తెని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక, పాదములు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కాబట్టి, అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కాబట్టి, ఆమె ముక్కు, చెవులు కోసెయ్యి" అన్నాడు. లక్ష్మణుడు అలాగే కోసేసాడు.

                                ◆వెంకటేష్ పువ్వాడ.